WFTW Body: 

"మీలో ఒకరి స్నేహితుడు అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చాడనుకుందాం. అతనిపై ఉన్న ప్రేమ, మర్యాదల వలన మీరు అతన్ని భోజనం చేశావా అని అడుగుతారు. అతను చేయలేదని చెప్పినప్పుడు, మీరు మీ ఫ్రిజ్‌లో గానీ, ఇంట్లోని మిగతా చోట్ల గానీ ఆహారం ఏమీ లేదని చూసినప్పుడు మీరేం చేస్తారు? మీ పొరుగువారి దగ్గరకు వెళ్తారు" (లూకా 11:5, 6 వివరణ).

ఇది చాలా అరుదుగా జరిగే విషయం. అర్ధరాత్రి వేళ పొరుగువాని యొద్దకు వెళ్లి, అతనిని నిద్రలేపి, తన స్నేహితుని కొరకు ఆహారం అడిగే వ్యక్తి ఎక్కడా కనిపించడు, కానీ ఈ మనుష్యుడు అలాగే చేశాడు. అతడు వెళ్లి, పొరుగువాని తలుపు తట్టి... "దయచేసి నాకు మూడు రొట్టెలు బదులివ్వు. రేపు తిరిగి ఇస్తాను, ప్రస్తుతానికి నాకు ఇవ్వు. నా స్నేహితుడు ఒకడు నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారము లేదు" అని అడిగాడు. లోపల ఉన్న మనుష్యుడు తనను గానీ, తన పిల్లలను గానీ ఇబ్బంది పెట్టవద్దని చెబుతూ... "అర్ధరాత్రి వేళ మమ్మల్ని లేపి ఇబ్బంది పెడుతున్నావు, తలుపు కొడుతూనే ఉన్నావు, మేము పండుకొని యున్నాము" అని జవాబిచ్చాడు. అయినప్పటికీ ఈ వ్యక్తి తలుపు తట్టడం ఆపకుండా, తనకు కావలసినది దక్కేంతవరకు తన పొరుగువానిని పడుకోనివ్వలేదు.

ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నారు: "అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును" (లూకా 11:8). "అతనికి కావలసినవన్నియు" అనేది ఎంత అద్భుతమైన మాట!

నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు — దేవుని వాక్యమును సమర్థవంతంగా బోధించే పరిశుద్ధాత్మ శక్తి మరియు వాక్శక్తి కొరకు — కనిపెట్టిన సమయం నాకు గుర్తుంది. నేను రక్షించబడి, దేవుని వాక్యాన్ని పంచుకోవడం ప్రారంభించిన రోజుల్లో ఎంతో బిడియంగల వ్యక్తిగా ఉండేవాడిని. నాకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమని, ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు దొరికితే నేను మరొక వ్యక్తిగా రూపాంతరం చెందుతానని నాకు తెలుసు. సరిగ్గా అదే జరిగింది. మీరు కూడా మీ స్వార్థం కొరకు కాకుండా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన అభిషేకం కోసం దేవుని వెదికి... "ప్రభువా, ఈ ప్రజలను పోషించడానికి నాకు రొట్టెను దయచేయుము" అని పట్టువదలక తలుపు తడుతూ ఉంటే, దేవుడు మీకు కావలసినంత సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నేనిక్కడ పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నాను. మనము దేవుణ్ణి ఏమి అడగాలో యేసుప్రభువు స్పష్టంగా తెలియజేశారు. "ఇతరులకు పరిచర్య చేయడానికి నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. నా వ్యక్తిగత అవసరాలు తీర్చబడ్డాయి, ఇప్పుడు నేను ఇతరుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాను". నిజమైన క్రైస్తవుడు ఈవిధంగా ఉంటాడు.

చాలా తరచుగా ప్రజలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, ఏదో ఒక శారీరక అనుభూతి కోసమో, పరవశం కోసమో లేదా తాము అన్యభాషలు మాట్లాడటం కోసమో పరిశుద్ధాత్మ శక్తిని వెదుకుతుంటారు. కానీ మనము ఇతరులను ఆశీర్వదించే సామర్థ్యం కొరకు పరిశుద్ధాత్మ వరములను వెదకాలి. నేను పరిశుద్ధాత్మ వరముల కొరకు దేవుని వెదికినప్పుడు, అది ఇతరులకు పరిచర్య చేయుటకే వెదికాను. దేవుడు నాకు అన్యభాషల వరాన్ని అనుగ్రహించినప్పటికీ, అది నన్ను నేను ఆత్మీయంగా తాజాగా ఉంచుకోవడానికే; ఎందుకంటే అన్యభాషతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనునని బైబిలు సెలవిచ్చుచున్నది. నేను ఇతరులకు పరిచర్య చేసేటప్పుడు ఎల్లప్పుడూ తాజాగా ఉండటానికి నన్ను నేను ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చేసుకోవాలని ఆశించాను. కాబట్టి ఆ అన్యభాషల వరం కూడా చివరికి ఇతరులకు మేలు చేయడానికే ఉపయోగపడింది. ఆత్మ యొక్క ఏ వరమూ కేవలం స్వార్థపూరిత క్షేమాభివృద్ధి కోసం కాదు, ఇతరులను ఆశీర్వదించడానికి నడిపించే వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకే ఇవ్వబడింది.

పరిశుద్ధాత్మ యొక్క సమస్త వరములు ఇతరుల ప్రయోజనం కొరకే ఉద్దేశించబడ్డాయని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆత్మ ఫలము నాకు ప్రయోజనం చేకూరుస్తుంది. నాలో ఆనందము లేదా సమాధానము ఉంటే, అది నాకు మేలు చేస్తుంది తప్ప మీకు కాదు. కానీ నా యొద్ద ప్రవచించే వరము గానీ, స్వస్థపరిచే వరము గానీ, మరేదైనా ఆత్మ వరము ఉంటే, ఆ వరములు ఇతరులకు మేలు చేస్తాయి. మనకు ఈ రెండూ అవసరమే. మీరు విశ్వాసముతో దేవునిని అడగాలి.

"మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును" (లూకా 11:13). మనము మన పరలోక తండ్రి యొద్దకు వస్తున్నామనే విశ్వాసం మనకు ఉండాలి. ఏదైనా కంపెనీలో ఒక సెక్రటరీ ద్వారా మాత్రమే సంప్రదించగలిగే ఒక అధికారి యొద్దకు మనము వెళ్లడం లేదు. మనము మన పరలోకపు నాన్న యొద్దకు వస్తున్నాము; ఆయన మనకు దేనినైనా ఎందుకు నిరాకరిస్తారు? మనకు మేలైన ఏ ఒక్కదానిని కూడా ఆయన ఎన్నటికీ దాచిపెట్టరు. ఒకవేళ దేవుడు మనకు ఏదైనా ఇవ్వలేదంటే, అది మనకు మంచిది కాదని మనము నిశ్చయంగా నమ్మవచ్చు.

అపొస్తలుడైన పౌలు శరీరంలో ఒక వ్యాధి ఉండింది, దానిని అతడు శరీరంలో ముల్లు అని పిలిచాడు. అది తన యొద్ద నుండి తొలగిపోవాలని అతడు మూడుసార్లు ప్రభువును వేడుకున్నాడు (2 కొరింథీ 12). దేవుడు దానిని తొలగించలేదు, కానీ అది తనను దీనుడిగా, విరిగి నలిగిన మనస్సు గలవాడిగా ఉంచడానికే గనుక, తన మేలు కొరకేనని అతడు గ్రహించాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు శ్రేష్ఠమైనదానినే అనుగ్రహిస్తాడు. దేవుడు మన పట్ల అంతటి దయను, అపారమైన మేలును కనబరిచినప్పుడు మనమేం చేయాలి? మనము కూడా ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి.

"ప్రభువా, నేను పరిచర్య చేయవలసిన ఈ ప్రజల అవసరతలను తీర్చడానికి తోడ్పడే సామర్థ్యాన్ని నాకు దయచేయండి". మీ సంఘంలోని ప్రజల పట్ల మీకు ఒక భారం ఉన్నప్పుడు — వారిని దైవిక జీవితంలోనికి నడిపించడానికి, యేసుప్రభువు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ వారు గైకొనేలా చేయడానికి, కొండమీది ప్రసంగంలోని ఉన్నత ప్రమాణాల ప్రకారం జీవించేలా వారిని సిద్ధపరచడానికి — మీరు పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడుగుతారు. ఆ ప్రజల అవసరతను తీర్చి, వారిని సాతాను బంధకాల నుండి విడిపించి, దైవభక్తి గల జీవితంలోనికి నడిపించే ఒక ప్రవచన వర్తమానాన్ని పరలోకము నుండి అనుగ్రహించమని మీరు ప్రార్థిస్తారు. మీరు వారిని నిజంగా ప్రేమిస్తే, పట్టువదలక దేవుని సన్నిధిలో కనిపెడతారు.

అర్ధరాత్రి వేళ పొరుగువాని యొద్దకు వెళ్ళిన ఆ వ్యక్తికి, తన ఇంటికి వచ్చిన స్నేహితునిపై ఎంతో ప్రేమ ఉందని మీరు అనుకోవడం లేదా? అతడు ఆ రాత్రే తన స్నేహితునికి ఆహారం సమకూర్చాలని ఎంతగానో తీర్మానించుకున్నాడు. మనలో చాలామంది అయితే, ఆ రాత్రి వేళ ఆహారం లేనప్పుడు... "క్షమించు మిత్రమా, ఇంట్లో ఏమీ లేదు, పడుకో, ఉదయాన్నే ఏదైనా పెడతాను" అని చెప్పేవారము. కానీ ఈ మనుష్యుడు ఆకలితో ఉన్న తన స్నేహితుని ఎంతగానో ప్రేమించాడు గనుక, "పొరుగువాని యెదుట సిగ్గుమాలిన వాడిగా మారాల్సి వచ్చినా సరే, ఈ రాత్రే నీకు ఆహారం తెచ్చి పెడతాను" అని వెళ్ళాడు. పట్టువదలక దేవుని సన్నిధికి వెళ్లి... "ప్రభువా, ఈ ప్రజలకు పరిచర్య చేయడానికి నాకు పరిశుద్ధాత్మ వరములను దయచేయండి" అని ప్రార్థించడానికి ఇది ఎంత అద్భుతమైన సాదృశ్యం!