WFTW Body: 

దేవుణ్ణి తెలుసుకోవటంకన్నా బైబిల్‍ని తెలుసుకోవటం చాలా సులభం. బైబిల్‍ని తెలుసుకొనుటకు నీవు ఎటువంటి వెల చెల్లించనవసరము లేదు. కేవలం దాన్ని చదివితే చాలు.

నీ వ్యక్తిగత జీవితంలో అవినీతి ఉండవచ్చు, నీ ఆలోచనా జీవితములో అపవిత్రత ఉండవచ్చు, అయినప్పటికీ బైబిల్‍ను లోతుగా ఎరిగి ఉండవచ్చు. నీవొక ప్రఖ్యాత బోధకుడివై ఉండవచ్చు అదే సమయంలో గొప్ప ధనాపేక్షకుడవై ఉండవచ్చు. అయితే నీవు దేవుణ్ణి తెలుసుకున్నాక నీవు అపవిత్రుడిగా ఉండలేవు. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత నీలో ధనాశ ఉండనేరదు. అది అసాధ్యం. అందుచేత చాలామంది బోధకులు దేవుణ్ణి తెలుసుకునే మార్గం కన్నా సులభమైన బైబిల్‍ను తెలుసుకునే మార్గాన్ని అవలంబిస్తారు.

సహోదరులారా, నేను మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను: కేవలం బైబిల్‍ను తెలుసుకోవటంతోనే మీరు సంతోషిస్తున్నారా? లేక ప్రభువును తెలుసుకోవాలనే తీవ్రమైన ఆకలి మీ హృదయాల్లో ఉందా? ప్రభువును ఇంకా శ్రేష్ఠముగా తెలుసుకోవాలనే గొప్ప తృష్ణ తనలో ఉన్నట్లు పౌలు ఫిలిప్పీ 3:8-10లో చెప్పాడు. "ప్రభువును తెలుసుకొనుట" అను విషయం ముందు మిగతావన్నీ పెంటతో సమానమని అతడు పరిగణించాడు. గొప్ప వెలగల ఈ ముత్యంకోసం పౌలు తన ముత్యాలన్నిటినీ వదులుకున్నాడు. పౌలు పరిచర్య రహస్యము అతడు గమాలీయేలు శిక్షణా శిబిరంలో గడిపిన బైబిల్‍ అధ్యయన సంవత్సరాల్లో లేదుగాని దేవుని గూర్చిన అతని జ్ఞానంలో ఉంది.

"అద్వితీయ సత్యదేవుణ్ణి మరియు యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం" (యోహాను 17:3).

పరలోకంలో యుగయుగములు జీవించుటే నిత్యజీవమని బహుశా మనం నిర్వచించి ఉండవచ్చు. అయితే యేసుప్రభువు ఆ విధముగా నిర్వచించలేదు. పరలోకం వెళ్ళటం, నరకం నుండి తప్పించుకోవటంతో నిత్యజీవానికి ఎటువంటి సంబంధంలేదు. దానికున్న సంబంధమంతా "ప్రభువును ఎరుగుట"తోనే ఉంది. అతి సన్నిహితముగాను, వ్యక్తిగతముగాను దేవుణ్ణి ఎరుగుటయే నా జీవిత తృష్ణ మరియు నా హృదయ భారముగా ఉంది. దేవుణ్ణి వ్యక్తిగతముగా ఎరుగుట వల్లనే నా పరిచర్య దైవాధికారాన్ని పొందగలదని నాకు తెలుసు. అందుచేత మా సంఘాలన్నింటిలో ఉన్న ప్రజలు దేవుని గూర్చిన వ్యక్తిగత జ్ఞానం పొందాలని నేను చూచాను.

చరిత్రలో ఎన్నడూ లేనంత బైబిల్‍ జ్ఞానము ఈనాడు ఉన్నది. పెంతకోస్తు రోజు తర్వాత దాదాపు 1500 సంవత్సరాల కాలం వరకు అచ్చు వేయబడిన బైబిల్‍ గ్రంథాలు ఎక్కడా లభించలేదు. గత రెండు శతాబ్ధాలనుండి మాత్రమే బైబిల్లు విరివిగా దొరుకుతున్నాయి. ఈనాడు ఎన్నో రకాల బైబిల్‍ అనువాదాలు, బైబిల్‍ పదసూచికలు (కాన్‍కార్డెన్సు), సహాయక గ్రంధాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

అయితే ఇంతటి విస్తృత బైబిల్ జ్ఞానం పరిశుద్ధమైన క్రైస్తవుల్ని తయారు చేసిందని నీవు భావిస్తున్నావా? లేదు. బైబిల్ జ్ఞానమే పరిశుద్ధతకు మూలమైతే చరిత్ర మొత్తంలో ఎంతో గొప్ప భక్తిపరులు ఈనాడు మన మధ్య ఉండాల్సి ఉంది. అయితే అలాంటి వారు లేరు. బైబిల్ జ్ఞానం మాత్రమే పరిశుద్ధతకు కారణమైతే సాతాను కూడా పరిశుద్ధుడై ఉండేవాడు. ఎందుకంటే వానికున్నంత బైబిల్ జ్ఞానం ఏ మనిషికి లేదు.

వేలాది విద్యార్థులకు నేర్పించేందుకు ఈనాడు మనకు ఎన్నో బైబిల్‍ కాలేజీలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోకెల్లా దైవభక్తులు ఈనాడు ఈ బైబిల్‍ పాఠశాలల్లో ఉన్నారా? లేరు. ఈనాడు బైబిల్ కాలేజీల్లో డిగ్రీలు పొందిన చాలామంది, అన్యుల కన్నా భ్రష్టులుగా ఉన్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం, భారతదేశములోని ఉన్నత సౌవార్తిక శిక్షణా సంస్థల్లో ఒక కాలేజీలో ప్రధమస్థానం సంపాదించి డిగ్రీ పొందిన ఒక వ్యక్తిని నేను కలిశాను. బైబిల్ పాఠశాలలో అతడు ప్రవేశించినప్పుడు అతనికున్న ఆత్మీయ పరిస్థితికన్నా మూడు సంవత్సరాల శిక్షణ తరువాత అతని ఆత్మీయ పరిస్థితి అధ్వాణ్ణంగా మారిందని అతడు నాతో చెప్పాడు. మరి బైబిల్ కాలేజీ అతనికి ఏమి నేర్పింది? బైబిల్ గూర్చిన సత్యాలు, క్రైస్తవ్యం గూర్చిన సత్యాలను అది నేర్పించింది. అటువంటి బైబిల్‍ కాలేజీలో చదివితే సాతాను ప్రథమ స్థానంలో డిగ్రీ పొంది ఉండేవాడు.

ఆ యౌవనస్థుడు తన ఆత్మీయ జీవితంలో కోపం, కక్ష, మోహపు తలంపులు, ధనాశల్ని జయించలేకుంటే తాను నేర్చుకున్న వాక్య గూఢార్థలు, ఉన్నత విమర్శకుల "విమర్శలు", గ్రీకు పదాల మూల అర్థాల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? క్రొత్తగా తాను సంపాదించిన డిగ్రీతో ఓ సంఘానికి కాపరిగా అతడు నియమితుడవుతాడు. అయితే వేదాంతపరమైన సమస్యలతోగాక నైతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంఘ సభ్యులకు అతడు ఏమి బోధిస్తాడు? ఆ విషయాల్లో అతడు వారికి ఎటువంటి సహాయమూ చేయలేడు. ఈ విధముగా భారతదేశంలో సేవ నాశనమవుతుంది.

నీకు నీవుగా దేవుణ్ణి ఎరిగినప్పుడే నీ మందను కూడా ఆయనను తెలుసుకునేందుకు నీవు నడిపించగలవు. నీ సొంత జీవితములో పాపముపై విజయము సాధిస్తే నీ మందను కూడా పాపముపై విజయసాధన వైపు నడిపించగలవు. అప్పుడు వారు కూడా శక్తికలిగి అధికారముతో బయటకు వెళ్ళి ప్రభువును సేవించుటకు సిద్ధపరచబడతారు.

ఒకరు సంపాదించిన బైబిల్ జ్ఞానమును గాని, డిగ్రీ యోగ్యతా పత్రాలను గాని సాతాను మొచ్చుకుంటాడని నీవనుకుంటున్నావా? కానేకాదు. దేవుణ్ణి ఎరిగిన పరిశుద్ధులు మరియు దీనులైన స్త్రీ పురుషులకు మాత్రమే సాతాను భయపడతాడు.