మత్తయి 7:6వ వచనం నుండి కొండమీద ప్రసంగం యొక్క ముగింపు పేరాలు కనిపిస్తాయి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును (మత్తయి 7:6). మనం ఎవరితో ఏమి మాట్లాడాలన్న విషయంలో జ్ఞానం కలిగి ఉండాలని యేసు మనకు బోధిస్తున్నారు. సామెతలు 26:4లో వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర ఇవ్వకూడదని మనకు చెప్పబడింది. సత్యమును అభినందించని వారికి మనం సత్యమును ఇవ్వకూడదు. అందుకే మనం ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎంతో జ్ఞానం కలిగి ఉండాలి. మనం ప్రతి ఒక్కరికి ఒకే రకమైన వర్తమానాన్ని కలిగి ఉండకూడదు. మనం ప్రతి ఒక్క వ్యక్తితో ఏమి చెప్పాలన్న విషయంలో దేవుణ్ణి వెతకాలి. యేసు ఇలాగే జీవించారు, లేఖనాలలో ఏ వచనమునైనా అర్థం చేసుకోవాలంటే మనం యేసు యొక్క మాదిరిని తప్పక చూడాలి.
యెషయా 50:4లో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ఒక ప్రవచనం ఉంది. ‘నేను దేవుని వాక్యముగా ఈ వ్యక్తికి ఏమి ఇవ్వాలి?’ అని ఆలోచించే వాక్యమును బోధించు వారికి అది సరిగ్గా సరిపోతుంది. మొదటిగా నేను అతని ఆత్మీయ స్థితిని గ్రహించాలి. ఎవరితోనైనా దేవుని వాక్యాన్ని పంచుకొనేటప్పుడు దేవుని దగ్గర నుండి ప్రవచనాత్మకమైన గ్రహింపును కలిగి ఉండాలి. దేవుని వాక్యమును అందించుట ఒక అతీతమైన పని. నీవు కేవలం రసాయన శాస్త్రాన్ని బోధించినట్లుగా ఒక పాఠంవలె బైబిలును బోధించినట్లయితే, ఏ సమయంలోనైనా ఎవరికైనా దానిని బోధించగలవు. కానీ నీవు దేవుని వాక్యాన్ని ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని అనుసరించి అందించాలనుకున్నట్లయితే, దేవుడు మాత్రమే ఇవ్వగల గ్రహింపును కలిగి ఉండాలి. యెషయ 50:4 క్రీస్తును సూచిస్తూ ఇలా చెప్తుంది, "అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు". ఇంకొక మాటలో చెప్పాలంటే, "నా మార్గంలో తటస్థించే అలసిన వానికొరకు సరియైన మాటను పొందుటకు తండ్రియైన దేవుడు ప్రతి ఉదయమున నన్ను లేవనెత్తి శిష్యునివలె వినుటకు నా చెవిని మెల్కొలుపుతున్నాడు". యేసు ఇక్కడ ప్రతిరోజు వింటున్నానని చెప్తున్నాడు, తన వద్దకు వచ్చు వారికి సరైన మాటను ఇచ్చుటకు ఆయన నిరంతరం వింటూ ఉన్నాడు.
దీనికి ఒక ఉదాహరణను యోహాను సువార్త ఎనిమిదిలో చూస్తాము. పరిసయ్యులు, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసు దగ్గరకు తీసుకుని వచ్చి పాత నిబంధన యొక్క లేఖనాన్ని చూపుటను అక్కడ మనం చదువుతాము. ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడవలెనని పాతనిబంధన లేఖనం చెప్తుంది. యేసు పాత నిబంధన లేఖనమును ఎరుగును గనుక ఆయన వారితో విభేదించలేదు. వందల సంవత్సరాల క్రితం మోషేకు దాన్ని ఆయనే అందించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? యేసు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అక్కడ చెప్పబడింది. వారు ఆ స్త్రీని నిందిస్తూనే ఉన్నారు, యేసు కూర్చుండి ఆయన వేలితో నేలపై ఏదో రాస్తూ ఉన్నాడు (యోహాను 8:6). ఆయన తండ్రి దగ్గర నుంచి స్పష్టమైన మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. "నేను ఈ ప్రజలకు ఏమి ఇవ్వాలి? ఈ పేద స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్న ఈ ప్రజలకు ఇవ్వవలసిన సరియైన మాట ఏమిటి?" ఆయన లేఖనములను విభేదించడు. ఎందుకంటే ఆయనే మోషేకు ఆమెను రాళ్లతో కొట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన తండ్రి దగ్గర నుంచి ఒక మాటను పొందుకున్నప్పుడు ఆయన నిలబడి వారికి ఈ విధంగా చెప్పాడు (యోహాను 8:7 స్వేచ్ఛానువాదం), "మీలో పాపంలేని వాడు మొట్టమొదటిగా ఆమెపై రాయి వేయండి. మీరు ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టవచ్చు, కానీ పాపం లేనివాడే మొదటిగా రాయి వేయాలి". అక్కడ పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారని చెప్పబడింది, ఎందుకంటే పెద్దవారు ఎక్కువ పాపం చేశారు.
ఆ పరిస్థితిని అదుపు చేయుటకు ఒక ప్రసంగం గాక ఒక్క మాట సరిపోయింది. మరికొన్ని సమయాల్లో యేసు ఏమి చెప్పలేదు. ఉదాహరణగా ఒకసారి ఒకవ్యక్తి ఆయనను ప్రశ్నించినప్పుడు యేసు దానికి జవాబుగా, ‘మొదటిగా నన్ను ఈ ప్రశ్నను అడుగనివ్వు: యోహాను ఇచ్చిన బాప్తీస్మము పరలోకంనుండి కలిగినదా లేక మనుష్యులనుండి కలిగినదా?. వారు తమలో తాము ఆలోచించుకొని మనం మనుష్యులనుండి కలిగినదని చెప్పినట్లయితే ప్రజలు కోపపడుదురు ఎందుకంటే వారు యోహానును ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు, మనం పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, అప్పుడు మీరు ఎందుకు అతణ్ణి నమ్మలేదని అడుగుతాడు. కాబట్టి ఆయనకు ఏ విధంగా జవాబు చెప్పాలో వారికి తెలియలేదు. ‘మాకు తెలియదు, మేము చెప్పము’ అని వారు జవాబిచ్చారు. అప్పుడు యేసు, ‘అలా అయితే నేను కూడా మీ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వను’ అని చెప్పారు (మత్తయి 21:27).
ప్రతి ఒక్కరితో వ్యవహరించుటకు యేసుకు ఒకే రకమైన విధానం లేదు. కొన్నిసార్లు ప్రజలువచ్చి ఆయనను హాస్యాస్పదమైన ప్రశ్నలు అడిగినప్పుడు -‘ఒక మనిషి చనిపోయాడు తర్వాత ఆమెను అతని సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, ఆవిధంగానే అతని ఏడుగురి సహోదరులకు జరిగింది, పునరుత్థానమందు ఆమెకు ఎవరు భర్తగా ఉంటారు?’. ఆయన అక్కడి నుండి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళలేదు, వారికి సమాధానమిచ్చాడు. ఆయన సమయాన్ని వెచ్చించి, పునరుత్థానమందు ఎటువంటి వివాహం ఉండదని వారికి వివరించారు. మనం యేసు ఇచ్చిన జవాబులన్నిటినీ పరిశీలించినట్లయితే, ఒక ఖచ్చితమైన నిర్ధిష్ట సమాధానం లేదని గ్రహిస్తాము. కంప్యూటర్ ప్రోగ్రాంలో దీనికి సమాధానం ఏమిటని అడిగినప్పుడు వచ్చిన జవాబువలె ఒకే సమాధానం కాదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మనుండి వినుచున్నారు. మత్తయి 7:6 నుండి మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన నియమమిదే.
అనేకసార్లు ఒక వ్యక్తికి ఇవ్వవలసిన సరైన మాట ఏమిటో మనం తెలుసుకొని ఉండాలి. ప్రతి పరిచర్యలో ప్రజలకు ఇచ్చుటకు సరైన మాటను కచ్చితంగా తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కొత్త నిబంధన 1కొరంథీ 14:1లో ప్రవచించుటను ఆపేక్షించమని ఎందుకు చెప్పబడింది? ప్రతి విశ్వాసి కూడా ప్రవచించుటను ఎంతో ఆసక్తితో వెదకమని చెప్పబడ్డారు. దానికి కారణమేమిటంటే కొత్త నిబంధన సంఘపు సమావేశంలో అందరూ ప్రవచించినట్లయితే, ప్రతి ఒక్కరికి ప్రవచనవరం ఉన్నట్లయితే (అందరూ ప్రవక్తలు కారు కానీ అందరూ ప్రవచించవచ్చు) అప్పుడు వరములులేని, బహుశా ఈ వరములను నమ్మని వ్యక్తి వచ్చినప్పుడు తన హృదయం యొక్క రహస్యములు బహిర్గతం చేయబడటం వలన అతడు ఒప్పించబడతాడు, ఎందుకంటే అతను తన అవసరానికి తగిన మాటలు విన్నాడు (1కొరంథీ 14:24-25). అతను, ‘దేవుడు నిశ్చయంగా ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే నా అవసరానికి తగ్గ మాట నేను విన్నాను’ అని చెప్పి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తాడు.
ప్రతి సంఘ సమావేశం ఆ విధంగా ఉండాలి. ప్రతి సంఘం కూడా ప్రవచన వాక్యమును ప్రవచించే వ్యక్తులను కలిగి ఉండాలి. నీవు ఆవిధంగా చేయుటకు దేవుని దగ్గర వేచి ఉండాలి, ప్రతిదానిని ఆయనకు లోపరచాలి. నీవు ఆ విధంగా చేయనట్లయితే నీవు దేవుని వాక్యమును బోధించుటకు అనర్హుడవు. ఒక వ్యక్తికి ఇచ్చుటకు సరైనదేదో నువ్వు కచ్చితంగా తెలుసుకుని ఉండాలి. మత్తయి 7:6లో యేసు చెప్పినదాని ఉద్దేశ్యం అదే. నీవు పందుల వంటి వ్యక్తులను చూసినప్పుడు పందికి ఏదైతే సరిపోతుందో అదే అతనికి ఇవ్వాలి; నీవు కుక్కల వంటి వ్యక్తులను చూసినప్పుడు అతను ఎముకనివ్వాలి. జంతువులకు నీవు కొండమీద ప్రసంగాన్ని ఇవ్వలేవు.
మనం ప్రవచన వరమును కోరుకున్నప్పుడు, మనం మాట్లాడుటకు లేచి నిలబడినప్పుడు మన ముందు ఉన్న ప్రజలకు ఏది అవసరమో దాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు మరియు వారి అవసరానికి తగిన మాటలను కూడా ఇస్తాడు. కొండమీద ప్రసంగపు ముగింపులో యేసు చెప్పిన ప్రాముఖ్యమైన నియమిది, దీన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం - ముఖ్యంగా విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా దేవుని వాక్యాన్ని బోధించే వారికి చాలా ప్రాముఖ్యం. మనం ఎవరిని తృణీకరించము. నీవు ఎవరినైనా తృణీకరిస్తే దేవుని సేవకుడుగా ఉండుటకు అనర్హుడవు. యేసు ఘోర పాపులను కూడా తృణీకరించలేదు. అయితే ప్రజల యొక్క అవసరతను అనుసరించి సరియైన మాటను మనం కలిగి ఉండాలి. మత్తయి 7:6యొక్క ఉద్దేశం అదే.