వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

ప్రకటన గ్రంథములోని 2,3 అధ్యాయములలో సంఘములో హృదయపూర్వకముగాను మరియు నమ్మకముగాను ఉన్నటువంటి విశ్వాసులను "జయించువారిగా" పరిశుద్ధాత్ముడు ప్రత్యేకముగా గుర్తించుచున్నట్లుగా మనము కనుగొనెదము. ఆత్మీయముగా పతనమైన పరిస్థితులలో జయించున్నవారు పాపమును మరియు లోకతత్వమును జయించి ప్రభువుకొరకు నమ్మకముగా నిలబడతారు. ప్రభువు ప్రాముఖ్యముగా జయించువారియెడల ఆసక్తికలిగియున్నారు. జయించువారికి 7 వాగ్ధానములు ఇవ్వబడినవి.

మొదటి వాగ్ధానం: ప్రకటన 2:7లో ఎఫెసీ సంఘములో ఉన్న దూతకు ఈ విధంగా వ్రాయబడింది. "జయించువారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును". జీవవృక్ష ఫలములను తినే ధన్యతను జయించువారికి ప్రభువు బహుమానముగా వాగ్ధానం చేశాడు. దీనిని ఆదాము పోగొట్టుకున్నాడు. దేవుని జీవమునకును, దేవుని స్వభావమునకును జీవవృక్షము సాదృశ్యముగా ఉన్నది. ఆయన స్వభావములో మనలను పాలిభాగస్థులుగా చేయుటయే దేవుడు మనకివ్వగలిగిన అత్యంత గొప్ప బహుమానము. దీనిని గురించి భూమిమీద ఉన్న విశ్వాసులనేకులు ఆలోచించరు. కాని మనం నిత్యత్వపు వెలుగులో చూచినట్లయితే, ఇది దేవుడు మానవునికి ఇవ్వగలిగిన బహుమానాలన్నిటి కంటే అత్యంత గొప్ప బహుమానమని కనుగొనగలము.

రెండవ వాగ్ధానం: ప్రకటన 2:11లో స్ముర్న సంఘపు దూతకు వ్రాయబడింది: "జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియుచెందడు". దేవుని సన్నిధిలో నుండి శాశ్వతముగా వెళ్ళగొట్టబడి, నిత్య నరకాగ్నిలో(అగ్నిగుండములో) వేయబడుటయే రెండవ మరణం. జయించువారు మాత్రమే ఈ మరణం తప్పించుకుంటారని వాగ్ధానం చేయబడింది. పాపమునకు వచ్చు జీతం మరణం కనుక మనం పాపమును జయించాలి(యాకోబు 1:15). ప్రతివిధమైన పాపమును జయించుటయే క్రొత్తనిబంధనలో ఉన్న ముఖ్యమైన వర్తమానం.

మూడవ వాగ్ధానం: ప్రకటన 2:17లో పెర్గములో ఉన్న సంఘదూతకు వ్రాయబడినది: "జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక్క క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు". పెళ్ళి కుమారునితో పెళ్ళికుమార్తెకుండె సన్నిహిత సంబంధం, ప్రభువుతో మనకున్న సంబంధంతో పోల్చబడింది. లోకములో పురుషులు తాము పెళ్ళి చేసుకొనబోయే పెళ్ళి కుమార్తెకు ఉంగరం తొడిగి(విలువైన వజ్రంతో చేయబడి ఆమె పేరు దానిమీద వ్రాయబడియుంటుంది) ప్రధానం చేయబడుటతో ఇది సమానం (ప్రకటన 2:17). జయించువారికి ఆవిధంగా సన్నిహిత సహవాసం వాగ్ధానం చేయబడినది. సామాన్యమైన విశ్వాసి పాపమును మరియు లోకతత్వ విషయంలో తీవ్రముగా ఉండక ప్రభువుతో అనాసక్తితో సంబంధాన్ని కలిగియుంటాడు. ఆత్మీయముగా ఒక పెళ్ళి కుమార్తె తాను గాఢంగా ప్రేమించిన పెళ్ళి కుమారునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఆత్మీయముగా ఒక జయించువాడు ప్రభువుతో కలిగియుంటాడు. ఇటువంటి సంబంధం గురించి పరమగీతములో వివరించబడింది. మరియు ఒక జయించువాడు మాత్రమే దీనిని అర్ధం చేసుకొని మరియు తన జీవితంలో అనుభవించగలడు.

నాలుగో వాగ్ధానం: ప్రకటన 2:26-29లో తుయతైరలో ఉన్న సంఘదూతకు వ్రాయబడింది: "నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చెదను". తన ప్రభువుయొక్క కార్యములను చివరి వరకు చేయువాడే జయించువాడని చెప్పబడింది(ప్రకటన 2:27). ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో శోధనను జయించుటయే ప్రభువుయొక్క క్రియలుగా ఉన్నది. ప్రభువైనయేసు జయించిన రీతిగా అంతమువరకు శోధనను జయించువాడే, జయించువాడు. భవిష్యత్తులో జనములమీద అధికారమిచ్చెదని ప్రభువు వాగ్ధానం చేశాడు అనగా "అతడు వారిని ఏలును" (ప్రకటన 2:27) అనగా "వారిని కాయును" మరియు జయించువానికి వేకువ చుక్కనిచ్చెదనని ప్రభువు వాగ్ధానం చేశాడు (ప్రకటన 2:28). ప్రభువైన యేసే వేకువ చుక్కయైయున్నాడు (ప్రకటన 22:16). ప్రభువైనయేసు దుర్మార్గులందరిని, గర్విష్ఠులందరిని కాల్చివేసే నీతి సూర్యుడిగా కూడా పిలువబడ్డాడు (మలాకీ 4:1,2). లోకస్థులాయనను నీతిసూర్యునిగా మాత్రమే చూస్తారు. జయించువారు ఆయనను వేకువచుక్కగా చూస్తారు. సూర్యుడు ఉదయించేముందు మనం వేకువ చుక్కను చూస్తాము. ఈ యుగాంతమున మహశ్రమల కాలం ముగిసిన తరువాత లోకం చీకటిలో ఉండగా కడబూర మ్రోగినప్పుడు ప్రభువైనయేసు మహశబ్దముతో ఆర్భాటముతో దిగి వస్తాడు. అన్ని తరములలో ఉన్న జయించువారందరు, మధ్యాకాశములో ప్రభువును కలుసుకొని భూమిమీదకు ప్రభువును ఆహ్వానిస్తారు. అప్పడు ఆయనను వారు వేకువ చుక్కగా చూస్తారు.

ఐదవ వాగ్ధానం: ప్రకటన 3:5 సార్దీస్ సంఘదూతకు వ్రాయబడింది: జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడువబడుదు. నా తండ్రియెదుటను, దూతలయెదుటను అతనిని ఒప్పుకొందును. తమ హృదయములను శుద్ధిగా ఉంచుకొన్నవారి పేర్లను దేవుడు కలిగియున్నాడు. శుద్ధిగా ఉంచుకొనుట అనగా శరీరకార్యములనే పాపములనుండి విడుదల పొందుటయే కాక మనుష్యులయొక్క ఘనత పొందుటయు మరియు ఇతర పాపములనుండి విడుదల పొందుట. సార్దీస్‍లో దేవుని ముఖముయెదుట జీవించినవారే జయించినవారు. తెల్లని వస్త్రములు జయించినవారందరికి బహుమానముగా వాగ్ధానం చేయబడియున్నవి. అనగా జయించువారే క్రీస్తుయొక్క పెళ్ళికుమార్తెగా ఉందురు. దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథము నుండి వారి పేరు ఎంత మాత్రము తుడిచివేయబడదని జయించువారికి వాగ్ధానం చేయబడినది (ప్రకటన 3:5). తన తండ్రియెదుటను మరియు దూతలయెదుటను జయించువారి పేర్లను ఒప్పుకొంటానని ప్రభువు వాగ్ధానం చేశాడు. ఇది మనుష్యులయెదుట సిగ్గుపడక ప్రభువు నామం ఒప్పుకొను వారికి బహుమానముగా వాగ్ధానం చేయబడింది (మత్తయి 10:32, లూకా 12:8). మన బంధువులయెదుట, స్నేహితులయెదుట, ఇరుగుపొరుగు వారి యెదుట, మనతో పనిచేయువారియెదుట మనము ప్రభువు నామం ఒప్పుకొనే విషయముకు ప్రభువు ఎంతో విలువ ఇస్తున్నాడు.

ఆరవ వాగ్ధానం: 3:12లో ఫిలదెల్ఫియ సంఘదూతకు వ్రాయబడింది: "జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికి వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను" (ప్రకటన 3:12). అనగా అతడు సంఘములోని ఇతరులను భరించుచు వారిని ప్రోత్సహిస్తాడు. అతడు ఇతరులకు ఆత్మీయ "తండ్రి"గా ఉంటాడు. ఇటువంటి స్తంభములకు ప్రతి సంఘములో ఎంతో అవసరము ఉంది. మరియు జయించువాడు దేవుని పేరును, నూతన యెరూషలేమును దేవుని పట్టణపు పేరును మరియు ప్రభువుయొక్క నామమును అతని నుదిటమీద వ్రాయబడును. అనగా అతడు ఎక్కడికి వెళ్ళినను ప్రభువైనయేసును హృదయపూర్వకముగా వెంబడించిన శిష్యుడని దానిని బట్టి గుర్తించబడతాడు.

ఏడవ వాగ్ధానం: ప్రకటన 3:21లో లవొదికయ సంఘదూతకు వ్రాయబడింది: నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రభువైనయేసే మొదటిగా జయించినవాడు. ఆయన మనకంటే ముందుగా మనకొరకు జయించినవాడు, ఆయన ఇప్పటికే లోకమును, అపవాదిని జయించాడు. తన తండ్రియొక్క సింహాసనము కుడిపార్శమున కూర్చొనుటకు ఆయన ఆరోహణమై మహిమపరచబడియున్నాడు. ఇప్పుడు మనము ఆయనవలె జయించగలము. మనము జయించినట్లయితే, ఆయన పెళ్ళికుమార్తెమైయుండి ఆయనతో కూడా ఒక రోజు తండ్రి సింహాసనము మీద కూర్చుండెదము.