WFTW Body: 

లూకా 10:42వ వచనములో "అవసరమైనది ఒక్కటే!" అని మార్తతో యేసు చెప్పిన మాటలు ఎంత అద్భుతమైనవో కదా! చేయవలసిన మంచి పనులు ఎన్నో ఉండియుండవచ్చును మరియు అందులో ముఖ్యమైనవి కూడా ఎన్నో ఉండవచ్చును. కాని, వాటన్నింటికి పైగా అవసరమైనది ఒక్కటే అని యేసు ధృవపరుస్తున్నారు. ఆ ఒక్కటి ఏమిటి?

యేసు మరియు ఆయన శిష్యులు అప్పుడే బేతనియకు చేరుకున్నారు. మార్త వారిని చూచిన వెంటనే, సంతోషముతో వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని, వారిని కూర్చోబెట్టి వారికి భోజనము సిద్ధపరచుటకు నేరుగా వంటగదిలోనికి వెళ్ళింది. ఆ సమయములో అక్కడున్న వారికి యేసు బోధించుచుండెను. మార్త సహోదరియైన మరియ మార్తకు వంటలో సహాయపడకుండా, యేసు యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటున్నదని మార్త కనుగొని, వంటగదిలో నుండి కోపముతో బయటకు వచ్చి, యేసు వైపు చూచి ఆయనతో దాదాపుగా ఈ విధముగా మాట్లాడినది.

"ప్రభువా, మీ అందరికి భోజనము సిద్ధపరచుటకు నేను వంటగదిలో కష్టపడుతూ ఉంటే, నా సహోదరి ఏమి చేయకుండా ఇక్కడ కూర్చున్నది. లేచి నాకు సహాయము చేయుమని ఆమెకు చెప్పుము!"

ఆయన కూడా, మార్తకు ఆశ్చర్యము కలుగునట్లు మార్తనే గద్దించియున్నాడు. తప్పు చేసినది నీవే కాని మరియ కాదు అని ఆయన ఆమెతో చెప్పాడు.

ఇప్పుడు మనము ఒక విషయమును గమనిద్దాం, మార్త చేసిన దానిలో ఎటువంటి పాపము లేదు. యేసును సంతోషముగా తన గృహములోనికి చేర్చుకున్నది. వంటగదిలో ఆమె చేసినపని తన కొరకు కాదు గాని, ప్రభువు మరియు ఆయన శిష్యుల కొరకు మాత్రమే. తన హృదయములోనికి ప్రభువును చేర్చుకొని, నిస్వార్ధముగా ప్రభువుకు మరియు ఇతరులకు సేవ చేయుటకు చూస్తున్న నేటి విశ్వాసికి మార్త సాదృశ్యముగా నున్నది. ఆమె ఎంతో ఆసక్తి కలిగియున్నప్పటికీ, ప్రభువుచేత గద్దించబడినది. ఆమె చేసిన దానిలో తప్పు ఏముంది? అని మనలను మనము ప్రశ్నించుకొన్నట్లయితే, దానికి సమాధానము ఖచ్చితముగా యేసు చెప్పిన ఈ నాలుగు పదాలలోనే ఉంటుంది: "అవసరమైనది ఒక్కటే". ఆమె చేసిన పనిని బట్టి మార్త గద్దించబడలేదు, కాని మొదటి విషయములకు మొదట ప్రాధాన్యమివ్వనందుకు ఆమె గద్దించబడినది.

మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అని ప్రభువు చెప్పాడు. అది ఏమిటి? ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వినుచున్నది. అంతకంటే ఏమి చేయుటలేదు. కాని అది ఉత్తమమైనది. అన్నింటికంటే ఎక్కువగా అవసరమైనది అది ఒక్కటే. మన జీవితములలో వినుటకు ఏ స్ధానమున్నది? ప్రభువు పాదముల యొద్ద కూర్చుని, ఆయన వాక్యమును చదువుతూ మరియు ఆయన మనతో మాట్లాడునట్లుగా చూచుటకు ఎంత సమయము గడుపుచున్నాము? బహుశా మనము ఎంతో సమయము గడుపుట లేదు. ఇతర విషయములు ఎన్నో ఉండుట వలన, మార్త చేసినట్లు మనము కూడా అదే తప్పు చేసి తరచుగా దోషులుగా కనబడతాము. మనము తీరిక లేకుండా చేసినది లౌకిక సంబంధమైన విషయములు మాత్రమే కాకపోవచ్చు. అది క్రైస్తవ సేవకు సంబంధించిన విషయముకు కూడా అయ్యుండవచ్చు. ప్రార్థన, ఆరాధన, కూడికలలో లేక సాక్ష్యమిచ్చు విషయములలో మనము ఎంతో ఉత్సాహముగా పాల్గొనవచ్చును. అయినా కూడా ప్రభువు మార్తను గద్దించినట్లు మనలను కూడా గద్దించుట మనము కనుగొనగలము.

మరియ యేసు పాదముల యొద్ద కూర్చొన్న దానిని బట్టి మనము కనీసం మూడు ఆత్మీయ సత్యములను నేర్చుకొనవచ్చును.

1. కూర్చొనుట అనేది నడచుట లేక పరుగెత్తుట లేక నిలబడుట వంటిది కాదు. ఇది ప్రాథమికముగా విశ్రాంతిని సూచిస్తుంది. దేవుడు మనతో మాట్లాడునది మనము వినకమునుపు మన హృదయములు విశ్రాంతిలో ఉండాలి మరియు మన మనస్సులు కూడా నెమ్మదిలో ఉండాలని ఇది మనకు బోధిస్తుంది. ఒప్పుకొనని పాపము మనలను ప్రభువు యొద్ద నుండి వినకుండా చేస్తుంది. ఐహిక విచారములు, సంపదలు దేవుని యొద్ద కూర్చోనివ్వకుండా మార్గ మధ్యములో అడ్డుపడతాయి. సరిగాలేని మనస్సాక్షితో లేక చింత, భయముతో నిండియున్న మనస్సుతో "దేవుని యొక్క మెల్లనైన స్వరము"ని వినాలని ఏ విధముగా ఆశించగలము? మనము దేవునిని తెలుసుకోవాలంటే మనము ఆయన సన్నిధిలో ఊరకయుండమని కీర్తనలు 46:10చెప్పుచున్నది.

2. ప్రభువు యొక్క పాదాల చెంత కూర్చొనుట దీనత్వమును సూచిస్తుంది. మరియ యేసుతో సమానముగా కుర్చీలో కూర్చొనలేదు గాని క్రింద కూర్చొన్నది. దేవుడు తీర్పు దినమున తప్ప ఎప్పుడు గర్విష్టులతో మాట్లాడడు. ఆయన సన్నిధిలో చిన్న బిడ్డ వలె ఉండి (మత్తయి 11:25) దీనుడిగా ఉన్న వ్యక్తితో మాట్లాడుటకు ఎల్లప్పుడు సిద్ధముగా నుంటాడు.

3. మరియవలె కూర్చునుట లోబడుటను సూచిస్తుంది. ఇది యజమానుని సన్నిధిలో ఒక శిష్యునికుండవలసిన వైఖరి. దేవుని వాక్యమునకు మనము విధేయత చూపినప్పుడు మన లోబడేతత్వము బయల్పరచబడుతుంది. ఏదో మన కుతూహలమును సంతృప్తిపరచుటకో లేక మనకు సమాచారమిచ్చుటకో దేవుడు తన వాక్యములో ఆయన మాట్లాడలేదు. ఆయన హృదయవాంఛయే ఆయన వాక్యము. మనము విధేయత చూపించుటకు ఆయన మాట్లాడుతాడు. మనము ఆయన చిత్తమును చేయగోరితేనే ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానమును మనకు ఇస్తాడని యేసు యోహాను 7:17లో ఎంతో స్పష్టముగా చెప్పారు.

బైబిలు ద్వారా దేవుడు వారితో మాట్లాడాలని ఆశించకుండానే(వెదకకుండానే) అనేకమంది క్రైస్తవులు నెలలు, సంవత్సరముల తరబడి బైబిలు చదువుతూ ఉంటారు. అయినా కూడా వారు ఎంతో సంతృప్తి చెందినట్లుగానే ఉంటారు. నేను నిన్ను అడుగుచున్నాను. ప్రతిదినము దేవుని స్వరమును నీవు వినుచున్నావా? ఒకవేళ వినకపోతే దానికి కారణమేమిటి? ఆయన సన్నిధిలో నెమ్మది కలిగిలేకపోవుటయా, లేక ఆత్మయందు దీనత్వము కలిగిలేకపోవుటయా, లేక ఇప్పటికే ఆయన నీతో చెప్పినదానికి నీవు విధేయత చూపించక పోవుటయా? అదేదైనా సరే, ఒక్కసారే శాశ్వతముగా దేవుడు దానిని బాగుచేయగలడు. "మాట్లాడు ప్రభువా, నీ దాసుడాలకించుచున్నాడు" అని సమూయేలు వలె ప్రార్ధన చెయ్యి, తరువాత నీ బైబిలు తెరచి ఆసక్తితో దేవుని యొక్క ముఖమును వెదకు, అప్పుడు దేవుని యొక్క స్వరమును నీవు వింటావు.