వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము తెలిసికొనుట
WFTW Body: 

ఆగస్టు 1975 లో నా ఇంట్లో మేము కూడుకొనుట మొదలు పెట్టినప్పుడు, ఒక క్రొత్త సంఘమును మొదలు పెట్టాలన్న ఉద్ధేశము మాకు ఖచ్చితముగా లేదు. అపోస్తలులు మాత్రమే సంఘములు స్థాపించేవారు, నాకు ఆ అర్హత ఉన్నదని నేను ఖచ్చితంగా అనుకోలేదు! కాని సమయం గడచినకొద్దీ, ఇంకా ఎక్కువ మంది మాతో కూడుటకు వచ్చుట మేము గమనించాము. కాబట్టి ఈ కూడికను కొనసాగించుట తప్ప మాకు వేరే మార్గము లేకపోయెను. మాతో కలవమని మేమెవ్వరినీ ఆహ్వానించలేదు. కేవలం తమ సంఘముతో విసిగిపోయి మాతో కూడుటకు వచ్చిన వ్యక్తిని మేము కోరుకోలేదు! ఎందుకంటే అటువంటి వ్యక్తి త్వరగానే మాతోకూడా విసిగిపోగలడు! "ప్రయాసపడి భారము మోసికొనుచున్న" వారిని మాత్రమే యేసు తన యొద్దకు ఆహ్వానించెను (మత్తయి 11:28). వేరే మాటలో చెప్పాలంటే, వారి ఓడిపోయిన జీవితాలతో విసుగుచెందినవారు మరియు అత్యాసక్తితో విజయం కొరకు వెదకువారు. అటువంటి వారిని మాత్రమే మాతో కలుపుకొనుటకు కోరుకొన్నాము.

అప్పటికే భారతదేశంలో వందలకొలది డినామినేషన్స్‌ (తెగలు) ఉన్నాయి, కాబట్టి మా ద్వారా దేవుడు మరొక తెగను ప్రారంభించడానికి కోరుకోవడంలేదని మేము నిశ్చయముగా నమ్మాము. ప్రొటెస్టెంట్‌ మతోద్ధారణ నుండి, ప్రభువు ప్రారంభించిన ప్రతి ఉద్యమం అప్పుడున్న సంఘములు ఉద్ఘాటించని కొన్ని నూతన నిబంధన జీవితపు సత్యములను ఉద్ఘాటించుటకు ప్రారంభించబడినది. అలా కానట్లయితే దేవుడు ఒక క్రొత్త ఉద్యమం ప్రారంభించవలసిన అవసరం లేదు.

ఇప్పుడు ప్రభువు మా మధ్య ఒక క్రొత్త సంఘమును ప్రారంభిస్తున్నారు. మా ద్వారా ఆయన ప్రకటించ(వ్యక్తపరచ) కోరిన ప్రత్యేకతలేమిటా అని మేము ఆలోచించాము. మేము ఇతరులకంటే ఆత్మీయులమైతే కాదు. మేమందరము కృప ద్వారా రక్షింపబడిన పాపులము మరియు అనేక విషయాలలో మా లోపాలను మేము ఎరిగితిమి. కాని ఎక్కడైతే అనేకమైన సంఘములు నూతన నిబంధన బోధ నుండియు, అభ్యాసం నుండియు తొలగిపోయాయని మాకనిపించిన విషయములలో వారితో ఏకీభవించలేక పోతిమి. మేము కూడుకొనుట కొనసాగించినప్పుడు, మేము ఇతరులతో ఏకీభవించలేని కొన్ని విషయాలు మా మనసులలో స్పష్టమాయెను.

1. నీటి బాప్తీస్మము: మేము విశ్వాసులకు నీటి బాప్తీస్మము (ముంచుట ద్వారా) త్రిత్వం (తండ్రి కుమార పరిశుద్ధాత్మ) పేరున ఇచ్చుట ఆచరించాము. కాబట్టి పసిపిల్లల బాప్తీస్మము ఆచరించే ముఖ్యమైన తెగలనుండి మేము వేరుగా ఉంటిమి.

2. పరిశుద్ధాత్మలో బాప్తీస్మము: మేము పరిశుద్ధాత్మలో బాప్తీస్మము మరియు అన్ని కృపా వరాలనూ నమ్మాము. కాబట్టి మేము బ్రదరన్‌ వారికి బాప్టిస్టులకు వేరుగా ఉంటిమి!! అయినప్పటికి భాషలతో మాట్లాడుట ఆత్మలో బాప్తీస్మమునకు ఋజువని నమ్మలేదు. దేవుని శక్తిని పొందుకోవడమే దీనికి అసలైన ఋజువని నమ్మాము (అపొ.కా. 1:8; 10:38 చూడండి). కాబట్టి మేము పెంతెకొస్తువారికి, కరిస్మాటిక్స్‌ వారికి వేరుగా ఉంటిమి!!

3. శిష్యత్వము: ప్రభువు లూకా 14:26,27,33 లో చెప్పిన శిష్యత్వము యొక్క షరతులను నెరవేర్చే శిష్యులను చేయమని ప్రభువు మనకు ఆజ్ఞాపించెనని (మత్తయి 28:19) మేము చూచాము. శిష్యత్వమును కాక సౌవార్తీకరణను మాత్రమే ప్రకటించుచున్న అనేకమైన సంఘములతో మేము ఏకీభవించలేకపోతిమి.

4. పాస్టర్లు (కాపరులు): ’కాపరి’ అనేది ఒక వరమని, ఒక పదవి కాదని మేము చూచితిమి (ఎఫెపీ 4:11). ఒక సంఘము పాస్టరు (కాపరి) తో కాక "పెద్దల"తో నడిపింపబడాలని నూతన నిబంధన స్పష్టముగా బోధించుచున్నది(తీతు 1:5). ఒక్క మనిషి పరిపాలనతో ఉన్న ప్రమాదాలను తప్పించుకొనుటకు, నాయకత్వమునకు సమతుల్యతను తెచ్చుటకు కనీసం ఇద్దరు పెద్దలు ప్రతి సంఘములో ఉండవలెను. ఈ దృఢనిశ్చయము మమ్మును దాదాపు అన్ని సంఘములనుండి వేరుపరచినది.

5. డబ్బు: డబ్బుకు ఎంతశక్తి ఉన్నదంటే యేసు దానిని దేవునికి ప్రతిగా ఉన్న యజమానిగా పేర్కొనెను(లూకా 16:13)! ఈ విషయములో మాకొక స్పష్టమైన సాక్ష్యము అవసరమని మేము చూశాము. ఎందుకంటే భారత దేశములో చాలా క్రైస్తవ పరిచర్యలకు భక్తిహీనమైన ఆర్థిక ఆచారముల(పద్ధతుల) వలన చెడ్డ పేరు ఉంది. బోధకులు మరియు పాస్టర్లు వారి నివేదికలు, ప్రార్థనా ఉత్తరాల ద్వారా డబ్బును అడుక్కొనేవారు. యేసు మరియు ఆయన అపోస్తలులు వారు చేసిన పని గూర్చి వారి సహపనివారికి తప్ప వేరెవ్వరికీ తెలియజేయలేదు. వారికొరకు లేక వారి పరిచర్యకొరకు ఎప్పుడూ ఎవ్వరినీ ఆర్థిక సహాయము అడుగలేదు. దానికి బదులు వారి పనికి అవసరమైన డబ్బును వారి పరలోకపు తండ్రి మనుష్యులను ప్రేరేపించి వారి ద్వారా ఇప్పించునని నమ్మారు. మేముకూడా మా తండ్రిని ఆవిధముగానే నమ్మగలము. కాబట్టి మా సంఘకుటుంబానికి తప్ప వేరెవ్వరికి ఎప్పుడూ మా పని గూర్చిన నివేదికలు ఇవ్వకూడదని మరియు ఎవ్వరినీ ఎన్నడూ డబ్బు అడగకూడదని నిర్ణయించుకొన్నాము. మా సంఘ కూడికలలో ఎప్పుడూ కానుకలు పట్టకూడదని, కేవలం స్వచ్ఛందంగా ఇచ్చే కానుకలకు ఒక కానుక పెట్టెను పెట్టాలని నిర్ణయించాము. ఎందుకంటే ప్రభువు అన్ని కానుకలు రహస్యముగా ఇవ్వాలని చెప్పెను (మత్తయి 6:1-4). ఆ విధంగా మా ఆర్థిక విధానము భారతదేశములో ఉన్న దాదాపు అన్ని సంఘములకంటే ప్రాథమికంగా వేరుగా ఉండెను.

6. స్వయంపోషణ: భారతదేశములో ఎక్కువ మంది క్రైస్తవ పరిచారకులు క్రైస్తవ పరిచర్య ఒక జీవనోపాదిగా చూచారు, అంతేకాని దేవుని పిలుపుగా చూడలేదు. వారిలో చాలామంది జీతం కోసం పాశ్చాత్య క్రైస్తవ సంస్థలలో చేరారు. క్రైస్తవ పరిచర్య వారికి బాగా లాభాలను సమకూర్చే ఒక వ్యాపారం! తన రోజుల్లో ఉన్న అటువంటి బోధకులనుండి వ్యత్యాసముగా ఉండుటకు అపోస్తులుడైన పౌలు తన స్వహస్తాలతో పని చేసి స్వయంపోషణ చేసుకొన్నాడు (2 కొరింథి 11:12). పూర్తి కాలపు సేవలో నున్న సంఘపెద్దలు వారి సంఘాలలో ఉన్న విశ్వాసుల చేత పోషింప బడుటలో ఎటువంటి తప్పులేదు. కాని భారత దేశములోనున్న పరిస్థితిని బట్టి పెద్దలమైన మేము స్వయంపోషణ చేసుకోవాలని ఉద్దేశించాము. పౌలు తన రోజుల్లో ఉన్నట్టు మేము కూడా ఇతర పరిచారకులకన్న వ్యత్యాసముగా ఈవిధంగా ఉండగలము. ఈ విషయములో కూడా మా ఆలోచనలు భారతదేశములో ఉన్న దాదాపు అన్ని సంఘముల కంటే వేరుగా ఉండెనని కనుగొన్నాము.

7. పాశ్చాత్య దేశములపై ఆధారపడుట: భారతదేశములో అనేక సంఘములు పాశ్చాత్య క్రైస్తవులపై పరిచర్య కొరకు, డబ్బుకొరకు ఎక్కువగా ఆధారపడెను. భారతదేశములోని క్రైస్తవేతరులకు మేము సాక్షులుగా ఉండుటకు ఇది ఆటంకముగా ఉన్నదని మేము కనుగొన్నాము. అనేకమంది భారతీయ బోధకులు గుడ్డిగా అమెరికా పద్ధతులను అనుకరించుట మరియు ప్రశ్నించకుండా అమెరికా వేదాంతమును అనుకరించుట (స్వీకరించుట) మేము చూచాము. కాబట్టి ఏ విదేశీయ సంస్థతో కలవకూడదని, ఏ విదేశీయ మూలముపైన ఆధారపడకూడదని (డబ్బు కోసమైనా పరిచర్య కోసమైనా) నిర్ణయించుకొన్నాము. మా పరిచర్య నిజముగా భారతదేశమునకు సంబంధించినదై, భారతీయ నాయకత్వంతో ఉండాలని కోరుకొన్నాము. అదే సమయములో అన్ని దేశాల విశ్వాసులను స్వీకరించుటకు మేము సిద్ధ మనస్సుతో ఉన్నాము. ఈ విషయంలో కూడా భారతదేశములోని అనేక సంఘముల కంటే మేము వేరుగా ఉంటిమి.

దేవుడు భారతదేశములో ఒక క్రొత్త సంఘమును ప్రారంభించుటకు ఇవే కారణములు. మన దేశములో ఇటువంటి సాక్ష్యము దేవునికి అవసరమని మేము చూడగలిగాము. కాబట్టి మేము దేవునికి లోబడి ఆయన చిత్త ప్రకారము మాతో పని చేయునట్లు అనుమతించితిమి.

ప్రతి సంఘమునకు ప్రారంభములో అద్భుతమైన సూత్రాలుండును. కాని సమయము ఆ సూత్రాలన్నిటిని పరీక్షించును. కొన్ని దశాబ్ధాల తరువాత పరిస్థితులు ఎలావున్నాయి? 49 సంవత్సరాల తరువాత వెనుకకు తిరిగి చూచినప్పుడు ఇంకా అనేక ఇతర విషయములలో మా కొదువను మేము చూడగలిగినప్పటికీ, పైన చెప్పబడిన ఏడు విషయాలలో ఏ సర్దుబాటు, రాజీ లేకుండా దేవుడు మమ్మును సంరక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఆయన నామమునకే మహిమంతయు కలుగునుగాక!