వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పునాది సత్యము Religious or Spiritual
WFTW Body: 

యోబు గ్రంథము లేఖనాల యొక్క మొదటి గ్రంథము. ఇది ఆదికాండమునకు(ఆదికాండము క్రీస్తుకు 1500 సంవత్సరాల పూర్వము మోషేచేత వ్రాయబడినది) కొన్ని వందల సంవత్సరాల క్రితము వ్రాయబడినది.

దేవుడు లేఖనాలను వ్రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన వ్రాసిన మొదటి గ్రంథము సృష్టి గురించి కాకుండా ఒక భక్తిపరుడైన వ్యక్తి గురించియై యుండడం ఆసక్తికరమైన విషయం. దేవుడు దేనికొరకు ఎల్లప్పుడు చూస్తున్నాడో అది మనకు నేర్పిస్తుంది. ఆయన హనోకు కాలములోను, నోవహు కాలములోను, యోబు కాలములోను ఒక భక్తిపరుని కొరకు చూచెను. దేవుడు మనకు లేఖనాలలో 66 గ్రంథాలను ఇవ్వాలని మొదటినుండి యోచించెను. ఆ గ్రంథాలలో మొదటి దానిలోనే ఆయన తన హృదయములో నున్న అతి ముఖ్యమైన విషయమైన ఒక భక్తిపరుని గురించి వ్రాసెను. లేఖనాలలో మొదటి గ్రంథములో మొదటి వాక్యమును గమనించండి: "ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యదార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు" (యోబు 1:1). లేఖనాలలో మొదటి వాక్యములో ఉన్న దేవుని హృదయమును నీవు చూచావా? అది ఒక వ్యక్తి గురించి. అతడు తన పేరు ద్వారా అతడు నివసించిన ప్రదేశము ద్వారా గుర్తించబడెను. ఈ విధంగా అతడు మరో ప్రదేశములో ఉన్న మరియొక యోబుతో తారుమారవ్వలేదు. దేవుడు ఆ వ్యక్తి గురించి సాక్షమిచ్చినప్పుడు అతని తెలివితేటల గురించి లేక అతని సంపద గురించి లేక అతని పేరు ప్రతిష్టల గురించి చెప్పలేదు గాని అతని గుణము గురించి చెప్పెను. దేవుడు నిజంగా దేనికి విలువనిస్తాడో మనము చూస్తాము - యదార్థత, దేవుని యందు భయభక్తులు మరియు చెడుతనము విసర్జించుట. ఇది మనందరిని సవాలు చేస్తుందని నేను ఆశిస్తున్నాను.

సాతాను ప్రత్యేకముగా విశ్వాసులను గమనిస్తూ ప్రపంచమంతా తిరుగును. అతడు గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు (1పేతురు 5:8). "నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా?" అని దేవుడు సాతానును అడిగినప్పుడు, "నాకతని గురించి అంతా తెలుసని" సాతాను జవాబిచ్చెను. ప్రతి వ్యక్తియొక్క నిజమైన ఆత్మీయస్థితి సాతానుకు తెలియును. అతని దయ్యములు కూడా అన్ని చోట్ల తిరుగుచు ప్రజల జీవితాలను పరీక్షిస్తూ అతనికి వారి స్థితిని తెలియజేయును. గనుక సాతానుకు ప్రపంచములో అందరి గురించి అంతా తెలుసు. యోబులో ఉన్న అసాధారణమైన లక్షణాన్ని ప్రభువు సాతానుతో చెప్పాడు - "అతడు యదార్థవర్తనుడు న్యాయమంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడెవడును లేడు" (యోబు 1:18). లేఖనముల యొక్క మొదటి గ్రంథములో దేవునియందు భయభక్తులు ఎక్కువగా పేర్కొనబడినవి. దేవుడు యోబును భూమిమీదనున్న ఇతరులతో పోల్చినట్లు మనమిక్కడ చూస్తాము. ఈ రోజున కూడా దేవుడు ఆ విధముగా చేస్తాడు.

అప్పుడు సాతాను దేవునితో "నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా" అని చెప్పాడు(యోబు 1:10). సాతాను చెప్పిన దానినుండి మనము మూడు గొప్ప సత్యాలను నేర్చుకోగలము. దేవుడు ఒక భక్తిపరుని చుట్టూ ముడు కంచెలను వేసియున్నాడు. మొదటిగా అతని చుట్టూ, రెండవదిగా అతని కుటుంబము చుట్టూ, మూడవదిగా అతని ఆస్తి మరియు ఆర్థిక వనరుల చుట్టూ కంచెవేసియున్నాడు. సాతాను ఆత్మ ప్రపంచములోకి చూడగలడు గనుక ఆ విషయం అతనికి తెలుసు. మనము ఆ కంచెలను చూడలేముగాని అవి ఉన్నాయి. నేను భక్తిగల జీవితాన్ని జీవిస్తే నా చుట్టూ కూడా మూడు కంచెలున్నాయని ఎరుగుట నాకు గొప్ప ఆదరణను ఇస్తుంది. దేవుని అనుమతి లేకుండా ఈ కంచెలలో ఏవియు తెరువబడలేవు.

యోబు వీటన్నిటికీ ఎలా స్పందించాడో చూడండి. సమస్తమును పోగొట్టుకున్నాడని అతడు విన్నాడు. అతని దాసులు ఒకరివెంబడి ఒకరు వచ్చి అన్నిపోయాయని చెప్పారు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడెను (యోబు 1:20). లేఖనముల యొక్క మొదటి పేజీలో మనము చూచే మరొక విషయమిది. ఒక భక్తిపరుడు ఆరాధికుడు. బైబిలు జ్ఞానము కలిగియుండుట కంటే ప్రభువును సేవించుట కంటే ఎక్కువగా ఒక దైవజనుడు ప్రధానముగా ఆరాధికుడు. నీవు అన్ని కలిగియున్నప్పుడు ఆరాధికుడిగా ఉండవలెను. అన్నియు పోగొట్టుకున్నప్పుడు ఆరాధికుడిగా ఉండవలెను. "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుకొనుచున్నాడనియు" యేసు చెప్పారు(యోహాను 4:23, 24). దేవుని ఆరాధించుట అంటే ఆయనకు సమస్తమును ఇచ్చుట. "నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు" (యోబు 1:21, 22). ప్రభువు అతని జీవితములో అనుమతించిన వాటన్నిటిని అతడు అంగీకరించెను.

యోబు స్నేహితులు (ఎలీఫజు, బిల్దదు, జోఫరు) కూడా తనను నిందించినట్లుగా యోబు గ్రంథములో చదువుతాము. నాలుగో వ్యక్తి అయిన ఎలీహు తక్కువగా నిందించినప్పటికినీ అతడు కూడా యోబును నిందించాడు. నిందించుట(నిందారోపణ) సాతాను మరియు అతని దూతల యొక్క స్వభావము. కాని నిజమైన దైవజనుడు ఈ నిందలను బట్టి అభ్యంతరపడకుండా చూచుకుంటాడు. ఆత్మీయవివేచన కలిగినవారు ఇతరులు దైవజనుని గూర్చి ఏమి చెప్పినప్పటికినీ వారు అతనిని దైవజనుడిగా గుర్తిస్తారు.

బైబిలు యొక్క మొదటి గ్రంథములోనే "ఆరోగ్యము మరియు ధనము అనెడి సువార్త" యొక్క ఆరంభాన్ని చూస్తాము. యోబు దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకొనెను గనుక అతడు తన ఆరోగ్యమును ఆస్తిని పోగొట్టుకొనెనని ముగ్గురు బోధకులు అతనితో చెప్పారు. దేవుని దీవెన ఉంటే ఎల్లపుడు ఆరోగ్యముగా ధనికులుగా ఉంటారన్నది వారి సందేశమైయుండెను. దేవుని యొరుగని వారు మొట్టమొదటిగా ఇటువంటి సువార్తను ప్రకటించారని గుర్తుంచుకొనుడి. ఈ రోజున కూడా అంతే. తన ఆస్తినంతటిని మరియు ఆరోగ్యమును పోగొట్టుకున్న యోబు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉండెనని గమనించండి. కాని "ఆరోగ్యము, ఆస్తి" అనెడి సువార్తను ప్రకటించిన ముగ్గురు బోధకులు పూర్తిగా దేవుని చిత్తముకు బయట ఉండిరి. "నా కోపము మీ యందరి మీద మండుచున్నది. నేను మిమ్మును శిక్షింపకయుండునట్లు యోబును మీ కొరకు ప్రార్థన చేయుమని అడుగుడి" అని దేవుడు వారితో చెప్పిన మాటలలో ఇది స్పష్టమవుతుంది (యోబు 42:8).

సృష్టియంతటి మీద ఆయనకున్న సర్వాధికారమును నియంత్రణను దేవుడు యోబుకు చూపించెను. అంతమాత్రమే చెప్పవలసి వచ్చెను. యోబు దీనుడయ్యెను. నలుగురు బోధకులు గంటల తరబడి నేరుగా దాడిచేయుటద్వారా ఏమియు సాధించలేకపోయెను. దేవుని విధానము కొద్ది నిమిషాలలోనే అంతయు సాధించెను. మనము సమస్యలను, శ్రమలను, శత్రువులను ఎదుర్కొన్నప్పుడు ఆయన సృష్టియంతటిపై దేవునికున్న నియంత్రణను విశ్వసించుట మన హృదయాలకు కూడా సమాధానమును తీసుకువచ్చును. "నీవు ఇంకను సర్వశక్తిమంతునితో వాదించాలనుకొనుచున్నావా?" అని ప్రభువు యోబును అడిగెను (యోబు 40:2). ఇప్పటి వరకు ప్రతి వాదనకు వెంటనే ప్రత్యుత్తరమిచ్చిన యోబు మౌనముగా ఉండెను. "చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను" (యోబు 40:4, 5). అని యోబు చెప్పెను. మన జీవితాలలో ఆయనే సమస్తమగునట్లు మనము ఏమికాని వారమని గుర్తించాలని దేవుడు కోరుకొనుచున్నాడని లేఖనముల యొక్క మొదటి గ్రంథము మనకు నేర్పింస్తుంది. అప్పుడు మన జీవితాలు ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చి ఎందరికో దేవెనకరంగా ఉంటాయి. దేవుడొక వ్యక్తిని వాడుకొనే ముందు అతనిని ఏమి కానివానిగా చేయును.

లేఖనముల యొక్క మొదటి గ్రంథము నుండి మనము నేర్చుకోవలసిన కొన్ని మహిమకరమైన సత్యాలు ఇక్కడున్నవి.

1. ఆయనను ఆరాధించు భక్తిపరుల కొరకు దేవుడు భూమియందంతట చూస్తున్నాడు.

2. భక్తిపరులపైన వారి కుటుంబములపైన సాతాను దాడి చేయును.

3. దేవుని అనుమతి పొందిన తరువాత మాత్రమే సాతాను మనపై దాడిచేయగలడు.

4. ఒక భక్తిపరునికి కష్టపెట్టే భార్య ఉండవచ్చు. కాని దేవుడు ఆమెను మార్చగలడు.

5. భక్తిపరులను మతానుసారులు అపార్థము చేసుకుంటారు.

6. భక్తిపరులు చేయు క్రియలను దేవుడు మరియు సాతాను దగ్గరగా గమనిస్తుంటారు.

7. శ్రమల ద్వారా, అపార్థము చేసుకోబడుట ద్వారా మనము పరిపూర్ణులమవగలము.

8. ఆరోగ్యము మరియు ధనము దేవుని ఆశీర్వాదమునకు సూచనలు కావు.

9. దేవుడు ఏమైయున్నాడో మనము నిజంగా చూచినప్పుడు మనము ఏమికాని వారమని మనము చూడగలము.

10. దేవుడు మన మంచికొరకు సమస్తమును యోచించును.