WFTW Body: 

మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయములో కానాను దేశము సరిహద్దున ఉన్న కాదేషు బర్నేయకు ఇశ్రాయేలీయులు వచ్చారని మనము చదువుతాము. ఇది దేవుడు వారికి వాగ్ధానము చేసిన దేశము. వారు ఐగుప్తును విడచి ఇప్పటికి రెండు సంవత్సరములాయెను (ద్వితీయో.కాండము 2:14,7). దేవుడు వారిని వెళ్లి ఆ దేశమును స్వతంత్రించుకోమని చెప్పాడు. ఆ దేశమును చూడడానికి ఇశ్రాయేలీయులు 12 మంది వేగువారిని పంపిరి.

ఆ 12మంది తిరిగి వచ్చి ఆ దేశము అద్భుతమైన దేశమని చెప్పారు. అయితే వారిలో పదిమంది అక్కడ పెద్దపెద్ద అజానుబాహులున్నారు మనము వారిని జయించలేమని చెప్పారు (సంఖ్యాకాండము 13:27-29).

కాని వారిలో ఇద్దరు (యెహోషువ, కాలేబులు)-మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ ఆజానుబాహులను జయించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడని సమాధానమిచ్చారు (సంఖ్యాకాండము 14:6-9). కాని ఆ ఆరు లక్షల మంది ఇశ్రాయేలీయులు ఎక్కువమంది చెప్పిన దాన్ని విన్నారు.

మనం దీనినుండి ఏమి నేర్చుకుంటాము? మొట్టమొదటిగా అధిక సంఖ్యాకులు చెప్పిన దానిని అనుసరించడం ప్రమాదకరం - ఎందుకంటే అధిక సంఖ్యాకులు ఎప్పుడూ తప్పే. జీవమునకు పోవు దారి సంకుచితమైనది దాని కనుగొను వారు కొందరేనని యేసు చెప్పారు (మత్తయి 7:14). అధిక సంఖ్యాకులు విశాలమైన దారిలో నాశనమునకు పోవుదురు. నీవు అధిక సంఖ్యాకులను వెంబడిస్తే నీవు ఖచ్చితంగా వారితోకూడా విశాల మార్గమున నాశనమునకు పోవుదువు. ఒక పెద్ద సంఘము ఆత్మానుసారమైన సంఘమని ఎప్పుడూ ఊహించుకోవద్దు. యేసుని సంఘములో 11 మంది సభ్యులే ఉండిరి. పదిమంది నాయకులు ఒకమాట చెప్పి ఇద్దరు వేరొక మాట చెప్తే నీవు ఎవరి పక్షాన ఉంటావు? దేవుడు ఇక్కడ ఇద్దరి పక్షమున (యెహోషువ, కాలేబుల పక్షమున) ఉండెను.

సాతాను మరియు అవిశ్వాసము మిగతా పదిమంది పక్షమున ఉండెను. కాని ఇశ్రాయేలీయులు మూర్ఖంగా అధిక సంఖ్యాకులనే వెంబడించారు. అందుచేతనే వారు తరువాత 38 సంవత్సరాలు అరణ్యములో సంచరించవలసి వచ్చింది. దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడో చూచే వివేకమును వారు కలిగియుండలేదు. దేవుడు ఒక్క వ్యక్తితో ఉన్నా కూడా వారే ఎంతోమంది కంటే గొప్పవారు. గనుక నేనెప్పుడు దేవునితో నిలబడాలనుకుంటున్నాను. మనము నిర్గమకాండము 32వ అధ్యాయములో ఇశ్రాయేయులందరు బంగారపు దూడను పూజిస్తున్నప్పుడు దేవుడు ఒక్క వ్యక్తియైన మోషే పక్షమునుండెను. ఆ 12 గోత్రాలలో లేవీ గోత్రము మాత్రమే దానిని చూడగలిగెను. ఇప్పుడు దేవుడు యెహోషువ, కాలేబుల పక్షమున ఉన్నాడు. కాని ఆ లేవీ గోత్రము కూడా దీనిని గుర్తించలేకపోయెను.

ఇదంతా కూడా మనకు ఈ రోజున పాఠాలు నేర్పిస్తుంది. క్రైస్తవలోకం సాధారణంగా రాజీపడటంతోను, లోకానుసారతతోను నిండికొనియుంది. అక్కడక్కడ దేవుని వాక్యములో ఉన్న సత్యము కొరకు ఎటువంటి సర్దుబాటులేకుండా నిలబడే కొందరిని దేవుడు లేవనెత్తుతాడు. నీకు వివేచన ఉంటే దేవుడు ఆ కొందరితో ఉన్నాడని గుర్తించి వారితోపాటు అధిక సంఖ్యాకులకు వ్యతిరేకంగా నిలబడతావు. వారితో పాటు నీవు వాగ్ధాన దేశములోనికి ప్రవేశిస్తావు.

దేవుడు ఎవరితో ఉన్నాడో నీవెలా కనుగొంటావు? అతడు విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడతాడు. యెహోషువ కాలేబులు విశ్వాసంతో "మనము జయించగలము" అని చెప్పారు. "కోపము, మోహము, అసూయ, సణుగుడు, ధనాశ అనే అజానుబాహులను మనము జయించగలము. మనము సాతానుని జయించగలము. మన పాదముల క్రింద దేవుడు సాతానును చితుకత్రొక్కును" అను మాటలు దేవుని పక్షమున ఉన్న వ్యక్తి మాటలాడును.