WFTW Body: 

విశ్వములో దేవుడే అన్నింటికి పైనున్న అధికారము. దాని గూర్చి ఎటువంటి సందేహము లేదు. అయితే దేవుడు కూడా అధికారమును ఇతరులకు బదలాయించును. ప్రభుత్వ పరిపాలకులు, తల్లిదండ్రులు మరియు సంఘ నాయకులకు సమాజములో, గృహములో మరియు సంఘములో అధికారముండును.

సంఘము, కొందరనుకొనునట్లు, ప్రతి ఒక్కరూ దేవునికి మాత్రమే బాధ్యులుగా ఉండే ఒక ప్రజాస్వామ్యము కాదు. అలా కాదు. శరీరములో మనము లోబడి విధేయత చూపుటకు దేవుని చేత నియమింపబడిన నాయకులుందురు. ఇది లేఖనములలో స్పష్టముగా చెప్పబడిన దేవుని చిత్తమై యున్నది.

దేవుని వాక్యము ప్రజలను వారి పరిపాలకులకు, భార్యలు భర్తలకు, బిడ్డలు తల్లిదండ్రులకు మరియు సేవకులు వారి యాజమానులకు లోబడమని ఆజ్ఞాపించెను. అదే విధముగా సంఘములో పెద్దలకు కూడా లోబడమని ఆజ్ఞ యివ్వబడినది.

స్థానిక సంఘములలో నాయకత్వము కొరకు దేవుడు పెద్దల నుంచెను. దేవుడు నిజముగా ఒక సంఘములో పెద్దలను నియమించినప్పుడు, వారు దేవుని ప్రతినిధులుగా ఉండి, ఆయన అధికారమునుకొంత ప్రయోగించుదురు. ప్రభువు, ఆయన పంపిన శిష్యులతో, "మీమాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును" (లూకా 10:16) అని చెప్పెను.

దేవుని యొక్క వాక్యములో ఇటువంటి ఆజ్ఞలున్నవి: "మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారివలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దు:ఖములో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దు:ఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడి యుండుడి" (హెబ్రీ 13:17).

దేవుడు మనలను క్రీస్తు యొక్క శరీరములో అవయవములుగా సహవాసపు గుంపులలో (సంఘములు లేక క్రైస్తవ పనివారి గుంపులు) ఉంచెను. అక్కడ దేవుడు మనపై నియమించిన ఆత్మీయ నాయకులకు లోబడుటకు మరియు వారితో ఒక జట్టుగా కలసి నడుచుటకు పిలువబడితిమి.

దేవుడు మనలను ఒక సంఘ సహవాసములో, లేక ఒక క్రైస్తవ పని వారి జట్టులో ఉంచినట్లయితే, మనము అక్కడ మనపై దేవుడు ఉంచిన నాయకత్వమునకు లోబడుటకు మరియు జట్టుకు సంబంధించిన అన్ని విషయములలో వారిని అనుసరించుటకు యిష్టపడవలెను. మనము ఖచ్చితముగా తెలుసుకొనవలసిన ఒకే ఒక విషయము, దేవుడు మనలను ఆ జట్టులో ఉంచెనను విషయము. ఒకసారి ఆ విషయము స్థిరముగా తెలిసిన తరువాత, మన యొక్క నాయకులకు లోబడి విధేయత చూపుటను దేవుడు చూచుచుండెనని విషయము గూర్చి ఏ ప్రశ్న లేదు. ఈ ఆత్మీయ నియమము ఒకమారు అర్థము చేసికొనినట్లయితే క్రైస్తవ పనిలో ఎన్నో సమస్యలు పరిష్కారమగును.

దేవుని కుమారుని యొక్క మాదిరిని గూర్చి ఆలోచించండి. చిన్న పిల్లవాడుగా ఆయన యోసేపు మరియలకు లోబడి జీవించెనని మనము చదువుదుము (లూకా 2:51). యేసు పరిపూర్ణుడు, కాని యోసేపు మరియలు కాదు. అయినప్పటికీ ఆయన విషయములో దేవుని చిత్తము అట్లుండుట చేత పరిపూర్ణుడైన వాడు పరిపూర్ణులుకాని మానవులకు ఎన్నో సంవత్సరములు లోబడియుండెను. తండ్రి చిత్తము అన్ని విషయములను పరిష్కరించెను. యోసేపు మరియలకు లోబడి జీవించవలెనని తండ్రి కోరినట్లయితే, ఆయన అది చేశారు. అంతే కాకుండా, తన తండ్రి కోరినంత కాలం అలా లోబడి ఉండెను.

కనుక పరిపూర్ణుడైన దేవుని కుమారుని మాదిరి విషయములో కూడా మనము చూచినది, ఒకే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, "నేను ఈ సహవాసములో ఉండుట దేవుని చిత్తమా?" అనునది. దానికి జవాబు "అవును" అయినట్లయితే అప్పుడు దేవుడు నియమించిన నాయకత్వమునకు లోబడియుండుట మన విధి.

అధికారమునకు తిరుగుబాటు చేయుట విశ్వములో మొదటి పాపము. అది దేవదూతలకు ప్రధానుడైన లూసిఫరు, అతడిపై ఉండిన దేవుని యొక్క అధికారమునకు తిరుగుబాటు చేసినప్పుడు జరిగినది.

లోకములో యిప్పుడు రెండు ఆత్మలు పని చేస్తున్నాయి - ఒకటి దైవికముగా ఏర్పాటు చేయబడిన అధికారమునకు జనులను లోబడునట్లు చేయు క్రీస్తు ఆత్మ మరియు అటువంటి ఆధికారముపై తిరుగుబాటు చేయుటకు నడిపించు సాతాను ఆత్మ.

తిరుగుబాటు ఆత్మ ఈనాడు సమాజములో గృహములో మరియు సంఘములో కూడా సర్వసాధారణమై పోయింది. లోకము దేవుని నుండి త్వరితగతిని తొలగిపోయి, సాతానుచే క్రమేపి అదుపు చేయబడుతున్నది అను దానికి ఇది స్పష్టమైన సూచనగా ఉన్నది. ఈ సాతాను నియమమునకు వ్యతిరేకముగా నిలువబడి, లోబడు విషయములో క్రీస్తు మాదిరిని చూపుటకు క్రీస్తుశరీరము యొక్క అవయవములుగా మనము పిలువబడితిమి.

మనము దేవుడు నియమించిన నాయకత్వమునకు లోబడుట వలన ఏది పోగొట్టుకొనము. దానికి వేరుగా, మనము తిరుగుబాటు ద్వారా ఎంతో పోగొట్టుకొందుము.

దైవికముగా ఏర్పాటు చేయబడిన నాయకత్వమునకు లోబడుట మనలను ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించుటకు దేవుని పద్ధతి. దేవుడు మనలను పిలిచిన చోట మనము లోబడకపోయినట్లయితే మనము ఆత్మీయముగా కుంగిపోవుదుము.

అనేక మంది విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ నాయకులకు దీనులుగా లోబడిన ఫలితముగా, వారి ప్రణాళికలు నిరోధించబడుట మరియు అడ్డగింపబడుట అనే అనుభవము లేకపోవుటచేత, వారు దేవునియొక్క సార్వభౌమాధికారమును నిజముగా వారి అనుభవములో తెలుసుకొనరు. ఒకరి జీవితములో ఏదొక సమయములో ఇతరులకు లోబడుట ఎప్పుడు తెలియని ఎవ్వరు కూడా దేవునిని ప్రయోజనకరముగా సేవించలేరు లేక వారు ఎప్పటికీ ఆత్మానుసారుడైన నాయకుడు కాలేరు.

లోబడుట అనేది, అపవాది మన చెవులలో గుసగుసలాడునట్లు ఏదో అవమానకరమైనది మరియు అణచివేయునది కాదు. దానికి వ్యతిరేకముగా, అది దేవుడు మనలను ఆత్మీయముగా కాపాడు విధానమై యున్నది. మనము మన యొక్క ఆత్మానుసారులైన నాయకులకు లోబడినట్లయితే మన క్రైస్తవ జీవిత ప్రారంభ సంవత్సరములలో మనకు దేవుని మార్గములు గూర్చి సరిగా తెలియనప్పుడు, మనము అనేక ప్రమాదకరమైన గోతుల నుండి కాపాడబడుట మాత్రమే కాకుండా, మన యవ్వన ఆసక్తితో యితరులను ప్రక్కత్రోవ పట్టించు ప్రమాదము నుండి కాపాడబడుదుము. లోబడుచు గడిపిన సంవత్సరములలో దేవుడు మనకు ఆయన రాజ్యము యొక్క నియమములను నేర్పించి దాని ద్వారా మనలను ఆత్మీయముగా సంపన్నులనుగా చేయును. అందువలన మనము యితరుల కొరకు ఒక పరిచర్య కలిగియుండవచ్చును.

లోబడుట అను మార్గమును తప్పించుకొనినప్పుడు మన మెంత కోల్పోవుదుము!