లేఖనములలోని ఒక మహిమకరమైన ప్రత్యక్షత ఏమిటంటే భార్యభర్తల సంబంధం క్రీస్తుకు మరియు సంఘమునకు గల సంబంధమునకు సాదృశ్యముగానున్నది (ఎఫెసీ 5:22-23).
ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో భార్యలు, భర్తలకు లోబడవలెనని చెప్పబడ్డారు. ఎందుకంటే, భార్యకు శిరస్సుగా భర్తను దేవుడు నియమించాడు. సమస్త విషయములలో (క్రీస్తుకు సంఘము లోబడవలసిన విధముగా) భార్యలు భర్తలకు విధేయత చూపించి వారిని గౌరవించి, ఘనపరచాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మన దినములలో అటువంటి విధేయత అంగీకరించబడక పోవచ్చునేమో గాని అది దేవుని నియమం. ఏ గృహమైతే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తుందో, ఆ గృహము ఏదో ఒకవిధముగా అవిధేయత యొక్క పరిణామాలను ఎదుర్కోవలసివస్తుంది. తన వివాహ జీవితంలో ఏ క్రైస్తవురాలైతే దేవుని యొక్క ఈ ఆజ్ఞలకు విధేయత చూపించుటకు ఇష్టపడదో ఆమె వివాహం చేసుకోకపోవడమే మంచిది. వివాహము చేసుకొని దేవుని ఆజ్ఞలకు నిరంతరం అవిధేయత చూపించుట కంటె ఆమె వివాహము చేసుకోకపోవడమే అతి శ్రేష్ఠము.
దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు కదా అని ఏ భర్త కూడా భార్య నుండి నిర్హేతుకమైన కోర్కెలను(డిమాండ్‌లను) కలిగియుండకూడదు. క్రీస్తు సంఘమును ప్రేమించి తన్నుతాను అర్పించుకున్నట్లుగా భర్తలు కూడా వారి భార్యలను ఈవిధముగా ప్రేమించాలని ఈ వాక్యభాగంలో ఉంది. దీని అర్ధమేమిటంటే భర్తలు, భార్యలను త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమించి వారికి కేవలం వస్తువులను మాత్రమే కాక వారి జీవితములను కూడా వారి భార్యలను సంతోషపరచుటకు, క్షేమము కొరకు అర్పించవలసియున్నది. క్రీస్తు సంఘమును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక భర్త కూడా తాను, తన భార్యచేత తిరిగి ప్రేమిచంబడుతున్నాడా లేదా అని కాక తన భార్యను నిరంతరం ప్రేమించవలసియున్నది. తన శిష్యుల యెడల క్రీస్తు కలిగియున్న ప్రేమ, ఆయన వారి పాదములను కడుగునట్లు నడిపించిందని జ్ఞాపకముంచుకోండి (యోహాను 13:1; 5). వారి స్వంత శరీరములను ప్రేమించినట్లే తమ భార్యలను కూడా ప్రేమించవలెనని భర్తలు అదే వాక్యభాగములో ఆజ్ఞాపించబడ్డారు. తమ స్వంత శరీరములను ఉద్దేశ్యపూర్వకముగా ఏవిధముగా గాయపరచుకోరో అదేవిధముగా వారి భార్యల మనోభావములను కూడా భర్తలు ఉద్దేశ్యపూర్వకముగా గాయపరచకూడదు. అపాయము నుండి ప్రమాదము నుండి తమ స్వంత శరీరములను వారు ఏవిధముగా కాపాడుకుంటారో వారి భార్యలను కూడా భర్తలు అపాయము నుండి ప్రమాదము నుండి కాపాడవలసియున్నది. ఏ పురుషుడైతే ఇటువంటి లేఖనముల యొక్క బోధను అనుసరించుటకు కోరుకొనరో అటువంటి వారు వివాహము చేసుకోకపోవటమే శ్రేష్ఠము.
ప్రతి క్రైస్తవ భార్యాభర్తలు కూడ క్రీస్తు మరియు సంఘమునకు సాదృశ్యముగా ఉండవలెనని ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో దేవుడు తన ఉద్దేశ్యమును బయలుపరచాడు. వారిరువురు కలసి జీవిస్తున్న జీవితము ఈ బంధములోని సౌందర్యమును ప్రత్యక్షపరచాలి.
పరిశుద్ధాత్మ పూర్ణులైయుండుడి అనే ఆజ్ఞ (ఎఫెసీ 5:18) తరువార భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన వాక్య భాగం ఉంటుంది. ఇది మనకేమి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మతో నింపబడటం వలన ప్రాథమికముగా మనము ఇంటిలో క్రీస్తు వలె ప్రవర్తిస్తాము. మన వివాహ జీవితములో దేవుణ్ణి మహిమ పరచాలంటే మనము తప్పనిసరిగా పరిశుద్ధాత్మతో నింపబడాలని కూడా ఇది సూచిస్తుంది.
వివాహ భాగస్వామి కోసం చూడకమునుపే ప్రతి క్రైస్తవుడు కూడా పైన చెప్పిన విధముగా అటువంటి గృహమును కలిగియుండాలనే కోరికను కలిగియున్నానా లేదా అని తన్నుతాను ప్రశ్నించుకోవాలి. అటువంటి తృష్ణ లేకుండా ఎవరైనా తన వివాహంలో దేవుని నడిపింపును ఏవిధముగా ఆశిస్తారు. కాని నిజముగా నీవు ఇటువంటి లక్ష్యమును కలిగియున్నట్లయితే, తన సంపూర్ణచిత్తములో, నీవు వివాహము చేసికొనుటకు దేవుడు నిన్ను నడిపించుట మాత్రమే కాక అటువంటి ఇంటిని కట్టుటకు నిన్ను బలపరుస్తాడని నిశ్చయత కలిగియుండవచ్చు.