WFTW Body: 

ఇశ్రాయేలీయుల శత్రువులపై యుద్ధము చేయడానికి గిద్యోను సైన్యాన్ని సమకూర్చినప్పుడు అతనితో పాటు 32,000 మంది ఉండిరి. అయితే వారందరు పూర్ణ హృదయులు కారని దేవునికి తెలియును. కాబట్టి దేవుడు వారిని వడకట్టెను. మొదటగా పిరికివారిని ఇంటికి పంపించివేసెను. అయితే ఇంకా 10,000 మంది మిగిలిరి. దేవుడు వీరిని నది యొద్దకు తీసుకువెళ్ళి పరీక్షించెను. ఆ పరీక్షలో 300 మంది మాత్రమే ఉత్తీర్ణులై, దేవునిచేత ఆమోదింపబడిరి (న్యాయాధిపతులు 7:1-8).

తమ దాహము తీర్చుకొనుట కొరకు ఆ పదివేలమంది నదిలోని నీటిని తాగిన తీరును బట్టి గిద్యోను సైన్యములో ఉండుటకు ఎవరు అర్హులులో దేవుడు నిర్ణయించెను. తాము పరీక్షించబడుతున్నామన్న సంగతిని వారు గ్రహించలేకపోయిరి. తమ దప్పిక తీర్చుకొనుటకు మోకాళ్ళ మీద ముందుకు వంగినప్పుడు 9700 మంది తమ శత్రువు గురించి పూర్తిగా మర్చిపోయిరి. కేవలం 300 మంది మాత్రమే మెళకువగా, అప్రమత్తంగా నిలబడి తన దోసిళ్ళతో నీటిని తీసుకొని త్రాగిరి.

జీవితములోని సామాన్య విషయాల్లోనే అంటే ధనము, సుఖము, భూసంబంధమైన ఘనత, సౌఖ్యము మొదలైన వాటి పట్ల మనకుండే వైఖరిని దేవుడు పరీక్షించును. గిద్యోను సైన్యములాగా మనలను కూడా తరచుగా దేవుడు పరీక్షిస్తున్నాడని గ్రహించుము.

ఐహిక విచారాల్లో మునిగిపోవద్దని యేసుప్రభువు మనలను హెచ్చరించారు. ఆయన "మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి" (లూకా 21:34) అని ఆయన చెప్పెను.

కొరింథులోని క్రైస్తవులను పౌలు ఇలా హెచ్చరించెను "ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది..." మీరు యోగ్యప్రవర్తనులై, తొందర ఏమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను" (1 కొరింథీ 7:29-35).

ఈ లోకంలో దేవునిమీద పూర్ణభక్తి చూపకుండా తప్పు దారి పట్టించే దేనికీ మనము అవకాశం ఇవ్వకూడదు. సమంజసంగా అనిపించే లోకవిషయాలు పాపపూరిత విషయాల కంటే ఎక్కువ ఉరిగా పరిగణిస్తాయి. ఎందుకంటే అవి మంచివిగానూ, హానికరము కానివిగానూ కనిపిస్తాయి.

మన దాహాన్ని మనం తీర్చుకోవచ్చు కాని మన దోసిళ్ళతో తగినంత మాత్రమే తాగాలి. మన మనస్సు భూసంబంధమైన వాటిమీద కాక పైనున్న వాటిపై ఉండవలెను. మనము యేసుయొక్క శిష్యులము కావాలంటే సమస్తమును విడిచిపెట్టాలి. సాగిన ఒక రబ్బరు బాండ్ లాగా అవసరమైన భూసంబంధమైన విషయాలపై మన మనస్సు ఉంచవచ్చు. పట్టు వదిలాక రబ్బరు బాండ్ ఎలాగైతే తిరిగి యధాస్థితికి సంకోచిస్తుందో, అలాగే మన మనస్సులు కూడా తిరిగి దేవుని విషయాల వైపు నిత్యత్వ విషయాలవైపు మళ్ళాలి. "పైనున్న వాటి మీదనే గాని, భూ సంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి" అంటే అర్థం ఇదే (కొలస్సీ 3:2). అయితే అనేకమంది విశ్వాసుల్లో ఈ రబ్బరు బాండ్ వ్యతిరేకంగా పనిచేస్తుంది! వారి మనస్సులు అడపా దడపా మాత్రమే నిత్యత్వ విషయాలవైపు సాగుతాయి. వదిలాక, తిరిగి యధాస్థానానికి, లోకవిషయాలవైపుకు వస్తాయి.