ప్రకటన 14:1-5లో భూమి మీద తమ జీవితాల్లో ప్రభువును సంపూర్ణ హృదయంతో అనుసరించిన ఒక చిన్న శిష్యుల గుంపు గురించి మనం చదువుతాం. అంతిమ దినాన వారు యేసుతోపాటు విజేతలుగా నిల్చుంటారు ఎందుకంటే దేవుడు వారి జీవితాల్లో తన పూర్తి సంకల్పాన్ని నెరవేర్చగలిగాడు.
ప్రకటన 7:9,10లో మనం చూసినట్లయితే తమ పాపాలు క్షమించబడిన జనసమూహపు సంఖ్య ఏ మనుష్యుడు లెక్కించలేనంత విస్తారంగా ఉంది: "అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, ఎవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి".
అయితే ప్రకటన 14లో ప్రస్తావించబడిన శిష్యుల గుంపు చాలా చిన్నది. దానిని లెక్కించవచ్చు అది 1,44,000. (ప్రకటన గ్రంథం చాలా వరకు సాధృశ్యరూపంగా వ్రాయబడిన కారణంగా) ఈ సంఖ్య అక్షరార్థమైనదా లేక సాదృశ్యమైనదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. గొప్ప సమూహముతో పోల్చినట్లయితే ఇది చాలా చిన్న సంఖ్య అనేదే ఇక్కడ ప్రాముఖ్యాంశం.
భూమి మీద దేవునికి ఉన్న నిజమైన, నమ్మకమైన శేషం ఇదే. వారు పరీక్షించబడి, దేవుని యోగ్యతా పత్రాన్ని పొందారు. దేవుడే స్వయంగా, వారి గురించి ఇలా చెప్పాడు "వీరు ...అపవిత్రులు కానివారును...గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు....వీరినోట ఏ అబద్ధమును, కనబడలేదు, వీరు అనింద్యులు" (ప్రకటన 14:4,5).
వీరు దేవుని ప్రథమ ఫలాలు. క్రీస్తు యొక్క వధువు వీరితో కూడియున్నది. గొఱ్ఱెపిల్ల వివాహ దినానా, దేవునికి అన్ని విషయాల్లోనూ పెద్దవైనా, చిన్నవైనా అన్నింటిలోనూ పూర్తి యదార్థంగా నమ్మకంగా ఉండడం ఎంత శ్రేష్టమో ప్రతి ఒక్కరికీ స్పష్టమవుతుంది.
ఆ రోజున, పరలోకం ఈ గొప్ప శబ్దంతో మారుమ్రోగుతుంది, "గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొని యున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము" (ప్రకటన 19:7).
భూమి మీద తన స్వలాభం, స్వగౌరవం కోసం ప్రయాసపడినవారు ఆ రోజున నిజంగా తమ నష్టమెంత గొప్పదో పూర్తిగా గుర్తిస్తారు. తల్లిని లేక తండ్రిని, భార్యని లేక పిల్లల్ని, సోదరులనూ, సోదరీలనూ, తన స్వంత జీవితాన్ని లేక భౌతికమైన వాటిని ప్రభువుకంటె ఎక్కువగా ప్రేమించిన వారు ఆ రోజున తమ శాశ్వత లోటును కనుగొంటారు.
యేసు ప్రవర్తనను అనుసరించి నడవడానికి తమ హృదయమంతటితో ప్రయాసపడినవారు, ఆయన ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపిన వారే భూమి మీద అతి శ్రేష్టులూ, మహాజ్ఞానులూ అని స్పష్టంగా ఋజువవుతుంది. క్రైస్తవ్యంలోని ఘనతంతా అప్పుడు చెత్తలాగా కనిపిస్తుంది. మనం క్రీస్తు వధువుగా ఉండేందుకు అర్హులమో కాదో తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ధనం, వస్తువాహనాదుల ద్వారా పరీక్షించాడని అప్పుడు గ్రహిస్తాం.
ఆ రోజున మనం స్పష్టంగా చూడబోయే వాస్తవాలను కొంతమట్టుకైనా గ్రహించేందుకు ఇప్పటికైనా మన కళ్ళు తెరువబడును గాక!
దేవుని చేత స్వయంగా పరీక్షించబడి యోగ్యుడనిపించుకున్న వ్యక్తిగా, ఆ రోజున క్రీస్తు వధువులో స్థానం సంపాదించుకోవడమే ఏ మనిషి అయినా పొందగలిగే అతిగొప్ప ఘనత.
వినుటకు చెవులు గలవాడు వినునుగాక, ఆమేన్.