WFTW Body: 

"అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమాయెనని" యోనా 3:1లో వ్రాయబడియుంది. మనమొకసారి తప్పినా ప్రభువు మనకు రెండవ అవకాశము ఇచ్చును. అందునుబట్టి దేవునికి స్తోత్రము. యోనా గ్రంథమునుండి మనకు వచ్చే గొప్ప సందేశమిదే. నీవు తప్పావా? దేవుడు నీకు మరో అవకాశాన్ని ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు. నీవు రెండవసారి తప్పావా? ఆయన నీకు మూడవ అవకాశమిస్తాడు. ఆయన రెండు అవకాశాలను మాత్రమే ఇవ్వడు. మనమందరము ఎప్పుడో రెండుసార్లు తప్పాము. నీవెన్నిసార్లు తప్పినా సరే ఆయన మరో అవకాశాన్నిచ్చే దేవుడు. నీవు హృదయమంతటితో మారుమనస్సు పొందితే దేవుడు నిన్ను ఇప్పుడు కూడా పునరుద్ధరించి ఆయన కొరకు ఒక పరిచర్యను నెరవేర్చడానికి నీకు సహాయపడగలడు.

నీనెవె 40 దినాలలో నాశనమగునని ప్రతివీధిలో ప్రకటన చేయడానికి అతనికి మూడు దినములు పట్టింది. ఆశ్చర్యకరంగా నీనెవె పట్టణస్థులు వెంటనే మారుమనస్సు పొందిరి. ప్రపంచ చరిత్రంతటిలో అతి త్వరగా జరిగిన అతిగొప్ప ఉజ్జీవము ఇదే. ఇక్కడ నన్ను ప్రోత్సహించే ఒక విషయమేమిటంటే నీనెవె వంటి దుష్టమైన పట్టణము మారుమనస్సు పొందినప్పుడు దేవుడు కనికరించెను. కొన్ని సంవత్సరాల తరువాత ఈ పట్టణము ఎంతో దుష్టమైనదగునని ఆయన దానిని నాశనము చేయవలసి వస్తుందని ఆయనకు తెలుసు. కాని దేవుడు అందరిని వారు ప్రస్తుతము ఉన్నట్టు చూచును. వారు ఇదివరకు ఏమైయున్నారో లేక భవిష్యత్తులో ఏమవుతారో అన్నదాన్ని బట్టి చూడడు. "ఉన్నవాడు" అనునది ఆయన నామము. "ఉన్నాను" లేక "ఉంటాను" అనునవి ఆయన నామములు కావు. దేవుడు మనకంటే ఎక్కువ కనికరము గలవాడు.

దేవుడు నీనెవెపై కనికరపడినప్పుడు యోనా సంతోషించియుంటాడని మనమనుకుంటాము. కాని అతడు సంతోషించలేదు. యోనాకు ఒక పాఠము నేర్పడానికి ఒక చెట్టును యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు మొలిపించెను. అది చూచి యోనా బాగా సంతోషించెను. కాని మరుసటి రోజు దేవుడు ఒక పురుగు ఆ చెట్టును తొలచునట్లు చేయగా అది వాడిపోయెను. ఎండకు తట్టుకోలేక యోనా మరలా కోపగించి బ్రదుకుటకంటే చచ్చుట మేలని చెప్పెను. "అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే 120,000 కంటే ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను" (యోనా 4:10,11).

పాత నిబంధనలో ఉన్న అన్ని వచనాలకంటే ఎక్కువగా యోనా 4:11 వచనము నశించుచున్న ఆత్మల పట్ల దేవునికున్న గొప్ప కనికరాన్ని చూస్తాము. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించెనంటే ఎవరూ నశింపకుండునట్లు ఆయన తన అద్వితీయ కుమారునిచ్చెను. ఈ విషయములో యోనాకు దేవునితో సహవాసము లేకుండెను. యోనా వలె ఈ రోజున కూడా ప్రకటించి ఉజ్జీవాలు చూచే అనేక బోధకులు ఉన్నారు. కాని యోనా వలెనే వారు దేవుని కనికరము గల హృదయముతో సహవాసము కలిగిలేరు. దేవుడు కోరుకున్నట్లు వారు తమ పరిచర్యలను నెరవేర్చలేరు. నీవు బోధించినప్పుడు ప్రజలు రక్షింపబడవచ్చు గాని చిట్టచివరకు యోనా వలె నీవు కూడా దేవునితో సహవాసము కలిగియుండకపోవచ్చు. సువార్త పరిచర్యకు సరియైన ఆధారము దేవుని హృదయముతో సహవాసమే. వెలుగు లేని వారి యెడల దేవుడు ఎంతో కనికరము కలిగియున్నాడు. "ఆయన మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై ఉండవలెనని యిచ్ఛయించుచున్నాడు" (1తిమోతి 2:4). ఆయన దానికొరకు ఆశ పడుచున్నాడు. మనము దేవుని హృదయముతో ఎంత సహవాసములోకి వస్తామో అంతగా ఆయన భారాన్ని మనము పంచుకుంటాము. దేవుడు నిన్ను ఒక సువార్తికునిగా ఉండుటకు పిలచినట్లయితే ఆయన నీకు నశించుచున్న ఆత్మల కొరకు కనికరాన్నిస్తాడు. దేవుడు నిన్ను ఒక బోధకునిగా ఉండుటకు పిలిచినట్లయితే గ్రుడ్డివారైన మోసపోయిన విశ్వాసుల కొరకు జయజీవితములోకి ప్రవేశించని విశ్వాసులకొరకు కనికరాన్నిస్తాడు. మనము మన పరిచర్యను ప్రభావంతముగా నెరవేర్చవలెనంటే దేవుని హృదయముతో సహవాసము కలిగి ఆయనకున్న కనికరాన్ని పంచుకోవడం అతిముఖ్యము.