వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు పురుషులు
WFTW Body: 

మొదటి రాజులు గ్రంథము దేవుని హృదయానుసారుడైన దావీదుతో ప్రారంభమై, ఇశ్రాయేలును పరిపాలించిన అతిదుష్టుడైన అహబు రాజుతో అంతమవుతుంది. ఇశ్రాయేలు ఒక శక్తివంతమైన రాజ్యముగా ప్రారంభమై చీలిపోయిన రాజ్యములుగా అంతమవుతుంది. ఈ చీలిన రాజ్యముపైన ప్రత్యేకంగా ఇశ్రాయేలుపైన అనేక దుష్టరాజులు పరిపాలన చేశారు.

దేవుని ప్రజల స్థితి వారి నాయకుల ఆత్మీయ స్థితిమీద గొప్పగా ఆధారపడి ఉంటుంది. ఇశ్రాయేలుకు ఒక భక్తిగల నాయకుడున్నప్పుడు వారు భక్తిగల మార్గములో ముందుకు సాగిపోయిరి. వారికి ఒక శరీరానుసారుడైన నాయకుడున్నప్పుడు వారు దేవునికి దూరముగా శరీరానుసారమైన క్రియలలోకి వెళ్ళిపోయిరి. భక్తిపరులైన నాయకుల అవసరత దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండెను.

యేసు తన కాలములో ఉన్న జన సమూహములను చూచినప్పుడు వారిని కాపరిలేని గొఱ్ఱెలవలె చూచెను. ఆయన ప్రజల మధ్యకు కాపరులను పంపించమని వారు దేవునికి ప్రార్థించవలెనని యేసు తన శిష్యులతో చెప్పాడు (మత్తయి 9:36-38). దేవుడు ఈ రోజున భారతదేశములో ఉన్న సంఘములను చూచినప్పుడు భక్తిపరులైన నాయకుల అవసరతను చూస్తున్నాడు. మనముందున్న సవాలు మన తరములో దేవుని హృదయమును సంతృప్తిపరచగల స్త్రీ పురుషులుగా ఉండటమే.

ప్రతి తరములోను దేవునికి భక్తిపరులైన నాయకులు కావలెను. ముందు తరముల నాయకుల యొక్క జ్ఞానముపై మనము ఆధారపడలేము. దావీదు ఇశ్రాయేలును ఎల్లకాలము పరిపాలించలేడు. అతడు మరణించును, మరియొకరు అతని స్థానమును తీసుకొందురు. ఇశ్రాయేలు దేశమునకు ఏమగునో తరువాత వచ్చే రాజుపై ఆధారపడి ఉండును.

ఒక తరములో ఆయన పనిచేయడానికి దేవుడు ఒక భక్తిపరుడిని లేవనెత్తును. అతడు ముసలివాడై మరణించును. తరువాత తరములో ఉన్న నాయకులు అతని భక్తిని మరియు అతనికున్న దేవుని జ్ఞానమును కాక, కేవలము అతనికున్న జ్ఞానమును, సిద్ధాంతములను కలిగియున్నారా? అప్పుడు ప్రజలు ఖచ్చితంగా దారి తప్పిపోవుదురు. మన తరములో దేవునికి అనేకమంది దావీదులు, దెబోరాలు కావలెను.