WFTW Body: 

సిలువను గూర్చిన వర్తమానము సానుకూలమైనదిగా ప్రకాశవంతమైన వైపు కూడా ఉన్నది. అది ఏమిటంటే, సిలువ దానితోనే ముగించబడలేదు. అది పునరుత్థాన జీవితమునకు మార్గము. సిలువ కార్యమును అంగీకరించిన ప్రతివారి యెదుట ఆనందము ఉంచబడినది (హెబ్రీ 12:2). భూమిలో పడిన గోధుమగింజ చనిపోయి అక్కడే ఎల్లకాలము ఉండదు. అది విజయవంతమైన ఫలములతో తిరిగి మొలుస్తుంది. సిలువ మార్గమును అంగీకరించిన విశ్వాసి, వేరే వారి చేత ఎంత తప్పుగా అర్థము చేసుకొనబడినప్పటికీ, అంతిమంగా దేవుని చేత న్యాయం తీర్చబడతాడు. స్వీయ మరణము ద్వారానే ఫలము వస్తుంది. ఆ ఫలమును మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే కొంత చూడవచ్చు, కాని దాని మొత్తమును, ప్రభువు తనకు నమ్మకముగా ఉన్నవారికి ప్రతిఫలము ఇచ్చునప్పుడు క్రీస్తు న్యాయసింహాసనము యొద్దనే చూడగలము.

సిలువ మార్గము విజయమార్గమే. అందుకే అపవాది, యేసు ఆ మార్గములో వెళ్ళకుండా ఆపుటకు శాయశక్తులా ప్రయత్నించాడు. అందుకే స్త్రీ, పురుషులు వారి జీవితములలో ఈ మార్గములో వెళ్ళకుండా అపవాది ఆపుటకు నిరంతరము ప్రయత్నిస్తున్నాడు. పేతురు ఎంతో ప్రేమతో, యేసు సిలువ శ్రమల గుండా వెళ్ళకుండా ఆపుటకు చూచాడు. అయితే యేసు వెంటనే ఇది సాతాను స్వరమని గుర్తుపట్టాడు (మత్తయి 16:21-23). మన మార్గము కష్టముగా ఉన్నప్పుడు, మన స్నేహితులు, బంధువులు కూడా ఇటువంటి సలహానే ఇవ్వవచ్చును. అయితే జ్ఞాపకముంచుకొనండి, మన హృదయములోనుండి గాని లేక వేరే వారియొద్ద నుండి గాని మనం వినే స్వరము, మనలను సిలువ మార్గము నుండి ప్రక్కకు మళ్ళించునది అయినట్లయితే అది ఎల్లప్పుడు అపవాది యొక్క గుసగుసలు మాత్రమే. ఆ విధముగా ఎప్పుడూ మనము వాటిని గుర్తించుచున్నామా?

ప్రకటన గ్రంథములో యేసు ప్రభువును వధించబడిన గొఱ్ఱెపిల్ల వలె మనము చూస్తాము. పరలోక దృష్టిలో కల్వరిని మనము అక్కడ చూస్తాము. మనుష్యుల దృష్టిలో, కల్వరి ఓడిపోయినదిగా ఉన్నది. యేసు పునరుత్థానుడైన తరువాత ఒక్క అవిశ్వాసి కూడా ఆయనను చూచినట్లుగా వ్రాయబడలేదు. కాబట్టి కల్వరి ఇంకా ఓడిపోయిన దానివలె మనుష్యులకు కనబడుచున్నది. కాని పరలోకపు దృష్టిలో, ఈ భూమిమీద ఎప్పటికి గొప్ప విజయము సాధించినదానివలె కల్వరి కనబడుచున్నది. భూమిమీద దేవుని యొక్క గొఱ్ఱెపిల్లను సిలువవేశారు, కాని పరలోకములో ఆయనను ఆరాధిస్తున్నారు. యేసును వెంబడించేటప్పుడు, మన హక్కులను మనము కోల్పోయినప్పుడు ఈ భూమి మీద నున్న ప్రజలు నీకు వెన్నెముక లేదని అనవచ్చును, కాని పరలోకములోనైతే అటువంటి విజయవంతమైన స్థానమును తీసుకొన్న దేవుని బిడ్డను బట్టి అక్కడ సంతోషముంటుంది. "వానిని (సాతానుని) జయించియున్నారు.. (సిలువ)మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.. అందుచేత పరలోకనివాసులారా ఉత్సహించుడి" (ప్రకటన 12:11,12).

కేవలము సిలువ మాత్రమే ఆ ఉచ్చును తీసివేసి మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. దీనికి వేరొక మార్గము లేదు. ఈ లోకానికి మరియు నీ స్వంతమునకు మరణమును నీవు అనుమతిస్తే, అపవాది యొక్క శక్తికి కూడా నీవు చనిపోతావు. నీ మీద అపవాదికి ఉన్న పట్టు విరుగగొట్టబడును, అప్పుడు పక్షివలె నిన్ను పైకి వెళ్ళకుండా ఏది ఆపివేయలేదు. అది నిజమైన స్వాతంత్ర్యము - మన జీవితములలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకొని రావాలనుకుంటున్నది కూడా ఇదే (2కొరింథి 3:17). స్వాతంత్ర్యమునకు గల ఏకైక మార్గము సిలువ మార్గమే. ఇంతకు మునుపటి అధ్యాయములవలె, మనము జీవిస్తున్న ఈ చివరి దినములలో ఈ వర్తమానములో కూడా ప్రత్యేకమైన అన్వయింపు ఉంది.

ఇటువంటి క్రైస్తవులను గురించి వారు వేరులేని వారని యేసు మార్కు 4:17లో చెప్పారు. వారి క్రైస్తవ్యం కేవలము ఉపరితలము పైనే ఉంటుంది. వారి వేరు బలపరచుటకు వారి జీవితములలో సిలువను అంగీకరించునట్లు అనేక పరిస్థితులను దేవుడు అనుమతించినప్పుడు, ఎల్లప్పుడు దానిని తప్పించుకున్నారు. సంపూర్ణమైన జీవములోనికి మనుష్యులను నడిపించగలిగిన మార్గము ఒక్కటే, అది క్రీస్తులో ఉంది. మనము కావాలంటే వేరే మార్గములలో కూడా వెళ్ళవచ్చు. కాని మరి ఏ మార్గములలో కూడా దేవునియొక్క ఉద్దేశ్యములను నెరవేర్చలేము. మన జీవితములలో సిలువ మార్గమును తప్పించుకున్నట్లయితే మన వరములు, తలాంతులు అన్ని కూడా వ్యర్థమైపోతాయి. మనము దీనిని అంగీకరించవచ్చు లేక తిరస్కరించవచ్చు - ఎన్నిక పూర్తిగా మనదే.

మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత యేసు కొరకు సిలువను మోసే రెండవ అవకాశము మనకురాదని సాధుసుందర్ సింగ్ చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు దీనిని మనము తిరస్కరించవచ్చు, కాని యేసు నడచిన రక్తము చిందిన మార్గములో మనము ఆయనను వెంబడించే అవకాశము పరలోకములో ఉండదు. మన ప్రభువును మనము కలుసుకున్నప్పుడు, తన చేతులకు మరియు పాదములకు ఇంకా మేకుల గుర్తులు ఉంటాయి. అప్పుడు మనము భూలోకములో జీవించిన మన జీవితములను ఒకసారి వెనుదిరిగి చూచుకొని ప్రతి అడుగులోను ఏ విధముగా మనము సిలువను తప్పించుకున్నామో కనుగొనినట్లయితే ఎలా ఉంటుంది? ప్రతి అడుగులోను మనము సిలువకు అప్పగించుకొనునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఆ విధముగా ఆ రోజున మనము పశ్చాత్తాపపడము.