వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు Religious or Spiritual
WFTW Body: 

మీరు ప్రభువుని గట్టిగా పట్టుకొనియున్నారు గనుక మీరు ఎదుర్కొనే ఎటువంటి పరిస్థితి అయినా మిమ్మల్ని నిరాశపరచనివ్వకండి. ప్రతి పరిస్థితిని, అది ఎటువంటిదైనా, దానిని జయించుటకు ఆయన సహాయం చేస్తాడు. మనము మరి ఎక్కువగా ఆయనను తెలుసుకొనే విధంగా ప్రతి పరిస్థితిని ఆయన ఏర్పరచాడు. అవిశ్వాసులు మరియు లోకానుసారులైన విశ్వాసులు ఈ విషయంలోనే ఓడిపోవుదురు. వారు ఓడిపోయినప్పుడు లేక నిరాశపడినప్పుడు, దేవునివైపు తిరుగుటకు బదులుగా, విశ్రాంతిని శాంతిని పొందుటకు లోకములో ఉన్న నిషేధించబడిన వాటి వైపు తిరుగుచున్నారు. అటువంటి వాటిని మీరు ప్రయత్నించవద్దు. ప్రారంభంలో కీడుగా కనిపించకపోయినా, వాటికి సులువుగా బానిసలు అయ్యే అవకాశం ఉన్నది.

పరిపూర్ణత అనేది ఎప్పుడు ఓడిపోనివారు సంపాదించుకునేది కాదు, ఎవరైతే యథార్థవంతులై, తమ ఓటములను ఒప్పుకొని మరియు పడిపోయిన వెంటనే లేచి ముందుకు సాగిపోవుదురో అటువంటివారే పరిపూర్ణులు అగుదురు.

ఆత్మీయత అనుకొని మతస్థులుగా మారే అపాయం మనం ఎప్పటికీ ఎదుర్కొంటాము. మతానుసారులు కేవలం బయటకు కనిపించే వాటితోనే నింపబడి ఉంటారు - ప్రభువు కొరకు బయటకు కనిపించే త్యాగాలు, వారు చర్చిలో ఆ మంచి స్థితిని కొనసాగించడానికి వారు చేయవలసిన కనీసమైనవి ఏమిటో వాటికి సంబంధించిన పనులు, చర్చి పనులు, బయటకు కనబడే వారి బట్టలు, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా కేవలం పరిజ్ఞానం కోసం చదవడం, ఉద్రేకపూరితమైన సమావేశాలు (ఈ ఉద్రేకాలే పరిశుద్ధాత్మ శక్తికి నిదర్శనమనుకొనెదరు) మొదలగునవి. ఇవన్ని తప్పనికాదు, లేక ప్రాముఖ్యత లేనివని కాదు. కాని మతానుసారులకు ఈ క్రియలే ప్రాముఖ్యమైయుండి అవియే ఆత్మీయతకు గుర్తులు అనుకొని మోసపోవుదురు.

కాని ఆత్మానుసారులు - దేవునిని మరిఎక్కువగా ఎరుగుటలోను, యేసుప్రభుని మరియు సహవిశ్వాసులను మిక్కుటముగా ప్రేమించుటలోను, దేవుడు వారిని ఏమి చేయవలెనని కోరుచున్నాడో దాని కనుగొనుటలోను, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనుటలోను, స్వార్థముతో కూడిన వారి క్రియలనుండి తమ్మును తాము శుద్ధిపరచుకొనుటలోను నింపబడి ఉంటారు. మతానుసారులు సమాజములను నిర్మించెదరు. ఆత్మానుసారులు క్రీస్తు శరీరమును నిర్మించెదరు.

ఈ లోకములో తన కొరకు నిలిచియుండే వారికొరకు దేవుడు చూచుచున్నాడు కాని దోమను వడగట్టి, ఒంటెను మ్రింగువారైన పరిసయ్యుల కొరకు దేవుడు చూచుటలేదు. ఏలీయా, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ఎరిక్ లిడిల్ వలె వారు నమ్మిన దాని కొరకు ఎంత వెలైనా చెల్లించే వారికొరకు, దేవుని వాక్య ప్రమాణాలకొరకు నిలబడే వారికొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రమాణాలు కలిగిన అటువంటి మనుష్యులతో దేవుడు పరలోకమును నింపును. అటువంటి వారిలో మీరుండవలెనని ప్రార్థిస్తున్నాను. కాలేజీలో ప్రభువు కొరకు నిలబడుటకు ఎంతో అవకాశమున్నది. మీరు ఎల్లప్పుడు ఆ విధముగా చేయుదురు గాక.

గత శతాబ్ధములో సువార్త వర్తమానము కాపాడుటకు మరియు బైబిలును ఇంగ్లీషులోకి తర్జుమా చేయుటకు అనేకమంది దైవజనులు వారి ప్రాణములను కోల్పోయారు. కాని దురదృష్టం ఏమంటే, అనేకమంది విశ్వాసులు రోజుకు ఐదు నిమిషాలు కూడా బైబిలును చదువుట లేదు; ధ్యానించుట లేదు. ఈనాడు సిద్ధాంతములను మనము అర్థము చేసుకొన్న రీతిగా, గత శతాబ్ధములోని దైవజనులు అర్థము చేసుకొనలేకపోయిరి. కాని ఈరోజు అరుదుగా కనిపించే ప్రభువుయెడల మిక్కుటమైన ప్రేమను వారు కలిగియున్నారు. చివరి విశ్లేషణలో సరియైన సిద్ధాంతము కాదు కాని ప్రభువును మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుటయే ముఖ్యమైయున్నది.

మరిచిపోవుట, పాపమువలె తీవ్రమైనది కాదు కాని దానిని జయించుట మనను ఎన్నో అననుకూలమైన వాటినుండి కాపాడును. మనమందరము మరచిపోయే వారుగా ఉన్నాము. నేను దానిని జయించుటకు నేను చేయవలసిన ముఖ్యమైన విషయములను నేను జేబులో ఉంచుకొనే ఒక చిన్న పుస్తకము మీద వ్రాసుకొందును. ప్రభువు నాతో మాట్లాడిన మాటలను కూడా వ్రాసుకొందును. నేను వాటిని వ్రాయనట్లయితే, కొన్నిసార్లు ప్రభువు చెప్పినవాటిని మరచిపోవుదును.