"పరిశుద్ధమైనదానిని కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల యెదుట వేయకుడి; వేసినయెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి, మీమీదపడి మిమ్మును చీల్చివేయును" (మత్తయి 7:6). ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి? యేసు సురోఫెనికయ దేశపు తూరు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సందర్భమే మరొకటి మనకు కనిపిస్తుంది (మత్తయి 15:21-28). యేసు తూరు ప్రాంతమునకు వచ్చినప్పుడు, దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరచమని వేడుకుంటూ ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు యేసు ఆమెతో, "పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు" అని సెలవిచ్చారు (మత్తయి 15:26). కొంతమంది ఈ మాటను చూసి అభ్యంతరపడుతుంటారు.
యేసు ఆమెను నిజంగా కుక్క అని దూషించారా? మీరు తృణీకరించే ఒక వ్యక్తి కోసం, అదీ ఒకేఒక వ్యక్తికి సహాయం చేయుటకు మీరు 150 కిలోమీటర్లు నడిచి వెళ్తారా? అసలు 150 కిలోమీటర్లు నడవడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం రెండు రోజులైనా పడుతుంది. దీనిని బట్టి ఆ స్త్రీ పట్ల క్రీస్తుకు ఉన్న గాఢమైన ప్రేమను మనము చూడవచ్చు. ఆమెను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారో ఎరిగినప్పుడు, ప్రభువు ఆమెను పరీక్షిస్తున్నారని గమనిస్తాము -తాను దేవుని యొద్ద నుండి దేనిని పొందుటకు యోగ్యత లేనిదానినని ఒప్పుకుంటూ, ఎటువంటి దీనస్థితినైనా అంగీకరించడానికి ఆమె సిద్ధంగా ఉందో లేదోనని ఆయన చూస్తున్నారు. అందుకనే ఆమె, "నిజమే ప్రభువా, నేను కుక్కనే. అయితే దయచేసి బల్లమీద నుండి పడు ముక్కలను నాకు దయచేయండి" అని మనవి చేసినప్పుడు, యేసు ఆమెతో, "అమ్మా, నీ విశ్వాసము గొప్పది" అని సెలవిచ్చారు. యేసుప్రభువు ఒకరి విశ్వాసాన్ని చూసి "గొప్పది" అని మెచ్చుకోవడం బైబిల్లో కేవలం రెండు సార్లు మాత్రమే చూస్తాము, ఆ రెండు సార్లు కూడా యూదులు కాని వారిని చూసే (అన్యులను చూసే) ఆయన అలా అన్నారు. ఒకటి రోమా శతాధిపతిని చూసి, రెండవది ఈ సురోఫెనికయ స్త్రీని చూసి. ఆయన ఆమెను ఎంతగా అభినందించారో చూడండి!
లేఖనాలలో యేసుప్రభువు కుక్కలను గురించి, పందులను గురించి మాట్లాడినప్పుడు, ఆయన మనుష్యులను తృణీకరించడం లేదనే సత్యాన్ని మనము గ్రహించాలి. మనం దేవుని యొద్ద నుండి దేనినైనా పొందుటకు యోగ్యులము కాదనే విషయాన్ని ఆయన మనకు గుర్తుచేస్తున్నారు. "దేవుడు నాకోసం ఏదో ఒకటి చేయు యోగ్యత నాకుంది" అని ఎవరైనా అనుకుంటే, దేవుని యెదుట మనుష్యుని అసలు స్థాయి ఏమిటో వారికి ఇంకా అర్థం కాలేదనే చెప్పాలి. నిజానికి మీరు, నేను పొందుకోవడానికి అర్హమైనది కేవలం నరకం మాత్రమే. మనము దేవుని యొద్దకు వెళ్ళి, "ప్రభువా, మా యోగ్యత చొప్పున మాకు ఇవ్వండి" అని అడిగితే, ఆయన మనకు నరకాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంతకంటే శ్రేష్ఠమైనది మనము పొందుకుంటున్నామంటే, అది కేవలం దేవుని కృప మాత్రమే! ఈ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు, మనము ఏమాత్రం యోగ్యులము కాకపోయినప్పటికీ దేవుని నుండి ఎంతో అపారంగా పొందుకుంటున్నామని అర్థమవుతుంది. కానీ చాలామంది ఈ దీనస్థితిని గుర్తించరు.
కాబట్టి, ఈ వాక్యాన్ని చూసి మనము ఇతరులను కుక్కలవలె లేక పందులవలె తృణీకరించాలని కాదు. మనమందరము పాపులమే. ప్రతి ఒక్కరూ పాపం చేసినవారే. మనలో కొందరము దేవుని కృప ద్వారా పాపక్షమాపణ పొంది రక్షించబడ్డాము, మరికొందరు ఇంకా వారి పాపములలోనే ఉన్నారు; కానీ ప్రాథమికంగా మనమందరము ఆదాము నుండి పాపస్వభావాన్ని పొందిన పాపులమే. కాబట్టి ఒకరు ఇంకొకరి కంటే శ్రేష్ఠులమని అనుకోవడానికి గానీ, ఎదుటివారిని కుక్కలాగనో, పందిలాగనో తృణీకారంగా చూడటానికి గానీ ఇక్కడ ఏ కారణమూ లేదు.
యేసుప్రభువు "పరిశుద్ధమైనదానిని కుక్కలకు పెట్టకుడి" అని సెలవిచ్చినప్పుడు... "మనుష్యులు దేనినైతే అభినందించలేరో (దేని విలువనైతే ఎరుగరో) దానిని వారికి ఇవ్వకండి" అని ఆయన ఉద్దేశం. ఒక కుక్కకు కావలసిందల్లా ఎముక మాత్రమే. దానికి పరిశుద్ధమైన విషయాలతో పనిలేదు. ఒక మనుష్యుడు దేవుని కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన భౌతిక విషయాలకే ప్రాధాన్యతనిస్తున్నప్పుడు, ఒక రకంగా అతను జంతువు కంటే ఏమాత్రం శ్రేష్ఠుడు కాడు. నీవు దేనికోసం జీవిస్తున్నావు? కేవలం మంచి ఆహారం తినడం, నిద్రపోవడం, సెక్స్, పిల్లలను కనడం... వీటన్నిటి కోసమేనా మీరు జీవిస్తున్నారు? అయితే, జంతువులు కూడా వీటి పైనే కదా ఆసక్తి కలిగి ఉన్నాయి! జంతువులు ఎల్లప్పుడూ భూసంబంధమైన వాటి పైనే మనస్సు ఉంచుతాయి. కుక్కలు ఎప్పుడూ భూమి వైపే చూస్తుంటాయి, పందులు కూడా అంతే. ఒక కుక్క గానీ, పంది గానీ ఎప్పుడైనా ఆకాశం వైపు (పరలోకం వైపు) చూడటం మీరు గమనించారా? జంతువులు ఎల్లప్పుడూ భూమి వైపే చూస్తాయి. ఇక్కడ ‘కుక్కలు’ అనే పదానికి -భూసంబంధమైన వాటిమీదనే మనస్సు ఉంచే మనుష్యులు" అని అర్థం.
అయితే నిజమైన క్రైస్తవుడు తన తల పైకెత్తి జీవిస్తాడు. అతను పైనున్న వాటి వైపే చూస్తాడు. పైనున్న వాటి మీద ఏమాత్రం ఆసక్తి లేని ప్రజలకు, పరిశుద్ధమైన విషయాలను అందించడం వ్యర్థం. అది పందుల యెదుట ముత్యాలు వేసినట్లే అవుతుంది. పందులకు కావలసిందల్లా కేవలం అశుద్ధమైన పెంట (కుళ్ళిన ఆహారం) మాత్రమే. దాన్నే అవి ఇష్టంగా తింటాయి, కాబట్టి వాటి యెదుట పరిశుద్ధమైన వాటిని ఉంచడం నిరర్థకం. యేసుప్రభువు ఇక్కడ కొండమీది ప్రసంగం గురించి మాట్లాడుచున్నారు — కొండమీది ప్రసంగంలోని బోధలు అవిశ్వాసుల కొరకు ఉద్దేశించినవి కావు. మత్తయి 7:6 యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే: తిరిగి జన్మించని వారికి ఈ వర్తమానాన్ని ఇవ్వకండి, ఎందుకంటే వారు దీని విలువను గ్రహించలేరు. ఏ వ్యక్తికి ఏ సత్యాన్ని అందించాలో మనము ఎరిగి ఉండాలి. ఈ వచనంలో క్రీస్తు సెలవిస్తున్నది ఇదే.
తిరిగి జన్మించని వారు వినవలసిన ముఖ్యమైన వర్తమానం -మారుమనస్సు. తాము పాపులమని, తాము నరక పాత్రులమని వారు ఎరగాలి. తాము నశించిపోయామని, దేవుని నుండి వేరుచేయబడ్డామని మరియు నిత్య నరకాగ్ని వైపు కొట్టుకుపోతున్నామని వారు గ్రహించాలి. క్రైస్తవేతరులు మాత్రమే కాదు, క్రైస్తవ కుటుంబాలలో జన్మించి ఇంకా నూతన జన్మ పొందకుండా, క్రీస్తుతో ఒక జీవముగల సంబంధంలోనికి రాకుండా ఉన్నవారు కూడా వినవలసిన వర్తమానం ఇదే.
ఏ మనుష్యుడైనా సరే, తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, అతను నిజంగా ఒక జంతువు లాంటివాడే. ఒక జంతువుకు దేవుని పట్ల ఆసక్తి ఉండదు, ప్రార్థన పట్ల ఆశ ఉండదు, దేవుడు మాట్లాడే మాటలను వినాలనే తపన అస్సలు ఉండదు. ఈ భూమి మీద జీవిస్తున్న ఒక మనుష్యుడికి ప్రార్థన మీద, దేవుని మీద, ఆయన మాటల మీద ఏమాత్రం శ్రద్ధ లేనప్పుడు, అతను ఒక జంతువు కంటే ఏ విధంగానూ శ్రేష్ఠుడు కాడు. జంతువులకు సెక్స్ మీదే ఆశ ఉంటుంది. మనుష్యుడు కూడా కేవలం సెక్స్‍కే ప్రాధాన్యతనిస్తే, అతను జంతువు లాంటివాడే అవుతాడు. ప్రతి జంతువు ఆహారం, సెక్స్ అనే వాటిలో ఆసక్తికలిగి ఉంటుంది. మనుష్యులు కూడా కేవలం ఆహారం, సెక్స్, నిద్ర, పిల్లలను కనడం కోసమే జీవిస్తే వారు మృగప్రాయులే. అయితే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఒక పెద్ద వ్యత్యాసాన్ని ఉంచారు. పందులను, కుక్కలను, సమస్త జంతువులను ఏ మంటి నుండి అయితే చేశారో, దేవుడు ఆదామును కూడా సరిగ్గా అదే మంటి నుండే చేసారు. అది ఖచ్చితంగా ఒకే రకమైన మన్ను.
మీరు కుక్కల యొక్క, పందుల యొక్క అంతర్గత అవయవాలను గమనిస్తే, మనుష్యుని అంతర్గత అవయవాలకు వాటికి ఎంతో పోలిక ఉంటుంది. అందుకే ప్రభువు సెలవిస్తున్నది ఏంటంటే — శారీరకంగా మీరిద్దరూ ఒకే పదార్ధము నుండి చేయబడ్డారు. దేవుడు జంతువులను, మనుష్యులను ఇద్దరినీ ఆరవ రోజే సృష్టించడానికి కారణం కూడా ఇదే. ఆరవ రోజు మొదటి భాగంలో ఆయన జంతువులను సృష్టించారు, ఆరవ రోజు రెండవ భాగంలో మనిషిని చేశారు. కానీ జంతువులకు, మనిషికి మధ్య దేవుడు ఒక గొప్ప వ్యత్యాసాన్ని ఉంచారు: దేవుడు జంతువులలోనికి జీవవాయువును ఊదలేదు. మంటి నుండి సృష్టించబడగానే వాటికి స్వయంచాలకంగా శ్వాస వచ్చింది, కానీ మనిషిని చేసిన వెంటనే దేవుడు వాని నాసికారంధ్రములలోకి జీవవాయువును ఊదాడు, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు (ఆదికాండము 2:7). ఆ దైవికమైన శ్వాసే మనిషిని జంతువుల నుండి వేరుచేసింది.
దేవుడు గనుక ఆదాములోనికి ఆ జీవవాయువును ఊదకపోయి ఉంటే, వాడు చూడటానికి మనిషిలా ఉన్నప్పటికీ ఒక జంతువులాగే మిగిలిపోయేవాడు. కానీ దేవుడు ఊదిన ఆ క్షణంలోనే అతను జీవాత్మ ఆయెను. జంతువుల లాగా కాకుండా, అతను ఒక నిత్యత్వపు జీవిగా మారాడు; జంతువులు నిత్యత్వం జీవించవు. ఒక జంతువు చనిపోతే అది తిరిగి మంటిలోనే కలిసిపోతుంది. కానీ దేవుడు నరునిలోకి జీవవాయువును ఊదినప్పుడు, అతను దేవునికి లెక్క అప్పగించవలసిన ఒక నిత్యత్వపు జీవిగా మారాడు. అయితే అతనికి అప్పుడే నిత్యజీవం కలగలేదు; ఎందుకంటే నిత్యజీవం అనేది ఆది అంతము లేని జీవము, అది కేవలం దేవునికి మాత్రమే ఉంది. కానీ మనం మన పాపముల విషయమై మారుమనస్సు పొంది, యేసుక్రీస్తు నొద్దకు వచ్చి, ఆయనను మన సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆ నిత్యజీవమును మనము స్వతంత్రించుకుంటాము. లేనియెడల, మనము దేవుని నుండి వేరుచేయబడి, నిరంతరము నరకాగ్నిలో యాతన అనుభవించే కేవలం నిత్యత్వపు జీవులముగానే మిగిలిపోతాము.
ప్రభువు సెలవిస్తున్నది ఏమిటంటే ఈ భూమి మీద రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. కొందరు కేవలం జంతువుల వలె (కుక్కల వలె, పందుల వలె) బ్రతుకుతున్నారు; మరికొందరు తాము దేవుని పిల్లలుగా జీవించవలసిన వారమని, దేవునికి లెక్క అప్పగించవలసిన నిత్యత్వపు జీవులమని గుర్తించి బ్రతుకుతున్నారు. దేవుడు నరునిలో జీవవాయువును ఊదినప్పుడు, వాడు మంటితో చేయబడినప్పటికీ వానికి ఒక మనస్సాక్షి ఇవ్వబడింది; తాను చేసే క్రియలకు, మాట్లాడే మాటలకు దేవునికి ఉత్తరవాదిని అనే స్పృహను ఆ మనస్సాక్షి వానికి కలిగిస్తుంది. జంతువులకు మనస్సాక్షి ఉండదు. అవి ఏదైనా తప్పు చేసినప్పుడు వాటిలో నేరం చేశాననే బాధ లేదా పాపభీతి ఉండదు. కానీ మనిషి అడవిలో బ్రతికే అనాగరికుడైనప్పటికీ (చదువురాని వాడైనప్పటికీ), వానికి మనస్సాక్షి ఉంది గనుక వాడు తప్పు చేసినప్పుడు వానిలో తప్పు చేశాననే భావన కలుగుతుంది.
అడవుల్లో ఉండే అనాగరికులు సైతం ఒక బండనో, రాతినో లేదా సూర్యుడినో చూసి మొక్కుతుంటారు, పూజిస్తుంటారు. తమను సృష్టించిన సృష్టికర్త ఒకరు ఉన్నారని, తాము ఆయనకు లెక్క అప్పగించాలనే అవగాహన వారి అంతరంగంలో ఎంతో కొంత ఉంటుంది. మీరు ఎక్కడైనా పూజలు చేసే కుక్కను గానీ, భక్తి గల కోతిని గానీ, పందిని గానీ చూశారా? ఎక్కడా చూడలేరు. మరి అనాగరికులకు సైతం నిత్యుడైనవానికి తాము లెక్క అప్పగించాలనే స్పృహ ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే వారికి ఒక మనస్సాక్షి ఉంది. ప్రతి మనిషి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు, ఆ మనస్సాక్షే మనిషిని పందుల నుండి, కుక్కల నుండి మరియు ఇతర జంతువుల నుండి పూర్తిగా వేరుచేస్తుంది.