గత వారం, గొప్ప పనిని పూర్తిగా నెరవేర్చడం అంటే ఏమిటో మనం పరిగణించడం ప్రారంభించాము: చేరుకోని వ్యక్తులను చేరుకోవడం మాత్రమే కాదు, యేసు ఆజ్ఞాపించినవన్నీ జాగ్రత్తగా చేసే శిష్యులను తయారు చేయడం.
యేసు తన వెంట వస్తున్న గొప్ప జనసమూహాలను చూసినప్పుడు, ఆయన వారి వైపు తిరిగి ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పని కొన్ని కఠినమైన మాటలను చెప్పడం మనం చూశాము.
చాలా మంది బోధకులు మరియు పాస్టర్లు, వారు చెప్పేది వినడానికి ఒక గొప్ప గుంపు రావడం చూస్తే, ఇలాంటి మాటలు మాట్లాడాలని కలలో కూడా అనుకోరు, ఇది యేసు ఎలా భిన్నంగా ఉన్నాడో మనకు చూపిస్తుంది. ఆయనకు (ప్రజా)సంఖ్యలపై ఆసక్తి లేదు. సంఖ్యలపై ఆసక్తి లేని క్రైస్తవ బోధకులు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు; లూకా 14 చివరిలో యేసు నాణ్యతను నొక్కి చెప్పడం మనం చూస్తాము.
ఆయన శిష్యులను కోరుకున్నాడు. కాబట్టి ఆయన వారి వైపు తిరిగి, "మీలో ఎవరైనా నా దగ్గరకు వచ్చి, మీ తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నతమ్ములను అక్కచెల్లెండ్లను మరియు చివరకు మీ స్వంత జీవితాన్ని కూడా ద్వేషించకపోతే, మీరు నా శిష్యులు కాలేరు.." అని చెప్పాడు. మీరు రెండవ స్థాయి శిష్యులు అవుతారని కాదు; మీరు శిష్యులు కాలేరు, అది ఖచ్చితం.
ఇక్కడ మనం శిష్యరికం యొక్క మొదటి షరతును చూస్తాము. మనం మన తండ్రిని మరియు తల్లిని గౌరవించాలని బైబిలు చెబుతోంది. అప్పుడు మనం "ద్వేషించాలి" అని యేసు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? ఇది సాపేక్షమైన (పోల్చి చూసే) మాట.
యేసు కొన్నిసార్లు కొన్ని బలమైన మాటలను ఉపయోగించాడు - ఉదాహరణకు: "మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే, దాన్ని ఊడదీయండి". "నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే, దానిని నరికివేయండి". "ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది కన్ను గుండా వెళ్ళడం సులభం". "మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగకపోతే, మీకు నిత్యజీవం ఉండదు". ఆయన చాలా బలమైన మాటలు మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఆత్మ మరియు జీవంగా ఉన్నాయి. కాబట్టి, ఆయన చెప్పిన దాని అర్థం ఏమిటంటే, ఆయన పట్ల మనకున్న ప్రేమతో పోల్చితే, మన భూసంబంధమైన బంధువుల పట్ల మనకున్న ప్రేమ, వెలుగుతో పోలిస్తే చీకటిలా ఉండాలి.
ఒక దృష్టాంతం ద్వారా చెప్పాలంటే, మీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అన్నతమ్ములు, అక్కచెల్లెండ్ల పట్ల మీకున్న ప్రేమ నక్షత్రాల వెలుగు లాంటిదైతే, క్రీస్తు పట్ల మీకున్న ప్రేమ సూర్యుని వెలుగులా ఉండాలి. సూర్యుడు ఉదయించినప్పుడు, నక్షత్రాలు చీకటైనట్టుగా కనిపిస్తాయి. అవి ఇంకా ఉన్నాయి, కానీ మీరు సూర్యుని కాంతిలో వాటిని చూడలేరు. కాబట్టి, ఇక్కడ "ద్వేషం" అనే పదానికి మీ తండ్రి మరియు తల్లి పట్ల మీకున్న ప్రేమ దాదాపు కనిపించదని అర్థమిస్తుంది: మీరు ఇప్పటికీ వారిని ప్రేమిస్తారు, కానీ క్రీస్తు పట్ల ప్రకాశవంతమైన సూర్యుడిలా ఉన్న మీ ప్రేమ వెలుగుతో పోల్చి చుసినప్పుడు ఈ ప్రేమ చీకటి లాంటిది.
క్రీస్తు పట్ల మనకున్న ప్రేమతో పోల్చినప్పుడు మన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, ద్వేషం లాంటిది. ప్రభువు మనల్ని ఏమి చేయమని పిలిచినా దానిని అనుసరించకుండా మన కుటుంబ సభ్యులు అడ్డుపడుటకు అనుమతించ వద్దని కూడా దీని అర్థం.
కాబట్టి, క్రీస్తు పట్ల అత్యున్నతమైన ప్రేమను కలిగి ఉండుట శిష్యరికం యొక్క మొదటి షరతు, ఇక్కడ మనం మన తల్లిదండ్రుల కంటే, మన భార్యల కంటే, మన పిల్లల కంటే, మన రక్త సంబంధులైన లేక సంఘంలో ఉన్న ప్రతి సహోదరీసహోదరుని కంటే, మన స్వంత జీవితం కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమిస్తాము. మిషనరీ పని మరియు సువార్తీకరణ క్రైస్తవులను ఈ స్థితికి తీసుకువచ్చిందని మీరు చెబుతారా?
తిరిగి జన్మించిన క్రైస్తవునిగా చెప్పుకునే ప్రతి వ్యక్తి ఈ స్థితికి వచ్చారా? తిరిగి జన్మించిన క్రైస్తవునిగా మిమ్మును గూర్చి మీరు చెప్పుకుంటే, మీరు ఈ స్థితికి వచ్చారా? మీరు ఈ భూమిపై ఉన్న అందరికంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమిస్తున్నారని నిజాయితీగా చెప్పగలరా? గత అర్ధ శతాబ్దంలో అనేక దేశాల్లోని విశ్వాసులను నేను పరిశీలించినప్పుడు, అది నిజమని నేను గుర్తించలేదు. చాలామంది క్రీస్తుని అంగీకరించారు మరియు "నా పాపాలు క్షమించబడ్డాయి మరియు నేను పరలోకానికి వెళ్తున్నాను" అని పాడుతున్నారు, కానీ వారు శిష్యులుగా మారలేదు.
వచ్చే వారం, శిష్యరికం యొక్క రెండవ షరతును పరిశీలిద్దాం.