మత్తయి 4:9లో, సాతాను యేసుకు ప్రపంచ రాజ్యాలన్నింటినీ వాటి మహిమలో ఒక క్షణంలో చూపించి, "నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నీకు ఇస్తాను" అని అన్నాడు. అదే అతను ఎల్లప్పుడూ కోరుకునేది, అదే అతన్ని అపవాదిగా చేసింది. అతను దేవదూతలకు అధిపతి, దేవునిచే సృష్టించబడినవాడు, అందమైనవాడు, జ్ఞానంతో నిండినవాడు, మానవుడు సృష్టించబడటానికి చాలా కాలం ముందు విశ్వంలో అత్యున్నత స్థానం కలిగినవాడు. ఈ అత్యున్నత దేవదూత చరిత్రను మనం యెషయా 14 మరియు యెహెజ్కేలు 28లో చదువుతాము. మనకు అతని పేరు తెలియదు, అతన్ని ఉదయ(తేజో) నక్షత్రం అని మాత్రమే పిలుస్తారు (యెషయా 14:12), దీనిని లాటిన్‌లో "లూసిఫర్" అని అనువదించారు. కాబట్టి ఆ పేరు అతనికి ఉండిపోయింది, కానీ అది అతని పేరు కాదు. మనకు అతని పేరు తెలియదు. ఈ దేవదూతల అధిపతి దేవదూతలు దేవుణ్ణి ఆరాధించకుండా, తనను ఆరాధించాలని కోరుకున్నాడు. యెషయా 14లో అతను అదే చెప్పాడు, "మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును". పాపం ఈవిధంగా ఉద్భవించిందని గుర్తుంచుకోండి: ఒకరు ఆరాధన కోరుకున్నప్పుడు, ఒకరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనుకున్నప్పుడు, ఒకరి హృదయం గర్వంతో పైకెత్తబడి దేవదూతలు తనను ఆరాధించాలని కోరుకున్నప్పుడు ఉద్భవించింది.
ఇదే పాపానికి మూలం. ప్రపంచంలో మొదటి పాపం హత్య లేదా వ్యభిచారం కాదు; అది ఇతరులు మిమ్మల్ని ఆరాధించాలని కోరుకోవడం. మీకు ఆ కోరిక ఉంటే, మీరు ఎవరైనా, మిమ్మల్ని మీరు క్రైస్తవుడిగా లేదా బోధకుడిగా పిలుచుకున్నా, ప్రజలు క్రీస్తును కాకుండా మిమ్మల్ని ఆరాధించాలని మీరు కోరుకుంటే, మీరు సాతాను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. ఇది ప్రమాదకరమైన స్థితి ఎందుకంటే ఇది చివరికి నరకానికి దారితీస్తుంది. సాతాను దానిని అప్పుడు పొందలేకపోయాడు; అతను పరలోకం నుండి వెళ్ళగొట్టబడ్డాడు, కానీ ఇప్పుడు అతను దానిని మళ్ళీ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. సాతాను, "సాష్టాంగపడి నన్ను ఆరాధించు" అని అన్నాడు. కానీ యేసు, "సాతానా, పొమ్ము. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను" అని వ్రాయబడింది (మత్తయి 4:10) అని అన్నాడు. మనం ఒకే ఒక వ్యక్తిని తప్పక ఆరాధించాలి. మనం మహిమాన్వితమైన దూతలను(శక్తులను) మరియు దేవుని గొప్ప సేవకులను ఆరాధించే పొరపాటు చేయవచ్చు. ప్రకటన 22:8లో, గొప్ప అపొస్తలుడైన యోహాను కూడా ఈ తప్పు చేశాడు. ప్రకటన గ్రంథంలో వెల్లడైన అద్భుతమైన విషయాలను చూసిన తర్వాత అతను దేవదూతను చూసి అతణ్ణి ఆరాధించడానికి సాగిలపడ్డాడు. 95 సంవత్సరాల వయస్సులో, ప్రభువును చాలా కాలంగా ఎరిగిన అపొస్తలుడైన యోహాను, దేవుని శక్తివంతమైన సేవకుడిని ఆరాధించే పొరపాటు చేయగలిగితే, మనలో ఎవరైనా ఆ తప్పు చేయగలరు. దేవునితో మన సంబంధం ఆ సేవకుడి ద్వారానే అయ్యేంతగా మనం దేవుని శక్తివంతమైన సేవకుడిని ఆరాధించకూడదు.
ఒక బోధకుడు లేదా పాస్టర్ దేవునికి మరియు మనుష్యులకు మధ్య రెండవ మధ్యవర్తిగా ఉండటానికి ప్రయత్నించేటప్పుడు, మీరు జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధన ప్రవక్తలు దేవుని చిత్తాన్ని మానవులకు తెలియజేశారు. కానీ కొత్త నిబంధనలో, దేవునికి మరియు మనుష్యులకు మధ్య ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు మరియు మీకు మధ్య రెండవ మధ్యవర్తిగా ఉండటానికి మీకు పాస్టర్ లేదా బోధకుడు లేదా దైవజనుడు అవసరం లేదు. మీకు మరియ అవసరం లేదు. మీకు మరెవరూ అవసరం లేదు. మీరు నేరుగా యేసు వద్దకు, ఆయన ద్వారా, తండ్రి వద్దకు వెళ్ళవచ్చు. కానీ యోహాను చేసినట్లుగా మనం కూడా తప్పు చేయవచ్చు. ప్రకటన 22లో, ఈ శక్తివంతమైన దేవదూత యొక్క విశ్వసనీయతను కూడా మనం చూస్తాము. అతను, "అలా చేయవద్దు; నన్ను ఆరాధించవద్దు" అని అన్నాడు.
ఇతర క్రైస్తవులను తమతో అంటుకట్టబడనివ్వని, వారిని తోసివేసి, "నాతో జతకట్టవద్దు; క్రీస్తుతో జతకట్టడానికి ప్రయత్నించు" అని చెప్పే బోధకులు, పాస్టర్లు మరియు క్రైస్తవ నాయకులు ఎక్కడ ఉన్నారు? మీరు ఎటువంటి భయం లేకుండా అనుసరించగల నిజమైన దైవజనుడు అతడే - మీరు అతనితో అంటుకట్టబడటానికి నిరాకరించి, మీ కోసం దేవుని చిత్తాన్ని కనుగొనడానికి నిరాకరించి, "దేవుడు మీ తండ్రి. ఆయన దగ్గరకు నేరుగా వెళ్ళు, ఆయన తన చిత్తాన్ని మీకు చూపిస్తాడు" అని అతను చెప్తాడు. ఎందుకంటే హెబ్రీ 8:11లో దేవుని కొత్త నిబంధన వాగ్దానం ఏమిటంటే, "వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు." అంటే కొత్తగా జన్మించినవాడు, క్రీస్తులో శిశువు మొదలు, గొప్పవాడు, దేవుని శక్తిమంతమైన సేవకుని వరకు అందరూ ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోగలరు. కాబట్టి దేవదూత, "నన్ను ఆరాధించవద్దు. నేను మీ సహోదరులలో ఒకడిని, నేను తోటి సేవకుడిని, నీవు దేవుణ్ణి ఆరాధించాలి" అని అన్నాడు.