వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

ఈ భూమి మీద దేవునియొక్క మహిమను మాత్రమే నిజమైన ఐశ్యర్యముగా మనం కలిగియుండవచ్చునని 2కొరంథి 4:5లో పౌలు చెప్పుచున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయములో వెలుగు కలుగమని పలికిన దేవుడే మంటిఘటములైన మన హృదయములలో కూడా వెలుగు ప్రకాశించుమని పలుకుచున్నాడు (2కొరంథి 4:7). జీవితాంతం మనం మంటి ఘటములవలె ఉంటాము. దేవుని మహిమయే ఈ పాత్రలో ఉన్న ఆకర్షణీయమైన విషయము.

పాతనిబంధనలో అబ్రాహాము మరియు దావీదు సిరి సంపదలు కలిగియున్నారు. అది ఈ లోక మహిమ. ఎందుకనగా మనుష్యులందరు దానిని బట్టి అతిశయిస్తారు. కాని క్రొత్త నిబంధనలో పౌలులాంటి బీదవారిని మరియు ఆకర్షణలేని వారిని దేవుడు వాడుకున్నాడు. పౌలు 4అడుగుల 11అంగుళాల ఎత్తనియు, బట్టనెత్తి గలవాడనియు, పొడుగాటి ముక్కును కలిగి, ఎల్లప్పుడు జబ్బుతో ఉండేవాడనియు చెపుతుంటారు. అతడు నిలవబడి మాట్లాడుచున్నప్పుడు ఎక్కువ ఆకర్షణీయముగా కనబడేవాడు కాదు. కాని అతడు అభిషేకం పొందియున్నాడు కాబట్టి "భూలోకమును తలక్రిందులు చేయునట్లు"గా దేవుడు అతనిని వాడుకొన్నాడు (అపొ.కా. 17:6). నిజానికి ఆదాము కాలమునుండి తలక్రిందులుగా ఉన్న లోకమును పౌలు సరిచేసియున్నాడు. అతడు బలహీనమైన పాత్రయేగాని క్రీస్తు మహిమతో నింపబడియున్నాడు. నీకు కూడా నీలో ఏమి కలిగియున్నావనునది చాలా ముఖ్యమైయుంది. ఈనాడు దైవజనులమని చెప్పుకుంటూ సినీతారల వలె స్టేజీమీదనుండి మాట్లాడువారిని చూచి అనేకులు ప్రభావితము చేయబడుచున్నారు. కాని అపొస్తలుడైన పౌలునుండి నిజమైన దేవుని సేవకుని గూర్చి ఆ విధముగా చూడము. అతడు బంగారు పాత్రకాదు. అతడు మట్టిపాత్రయే. కాబట్టి మీలో ఉన్న బలహీనతలను బట్టిగాని లేక పరిమితులనుబట్టిగాని నిరాశపడవద్దు. కాని నీవు దేవునియెదుట మంచి మనసాక్షి కలిగి ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి, అభిషేకం కలిగి క్రీస్తుతో నింపబడునట్లు చూచుకొనుము. ఇదియే నిజముగా విలువైనది.

మట్టి పాత్రలలో ఉన్న వెలుగు (2కొరంథి 4:6,7), గిద్యోను సైన్యములో ఉన్న వెలుగుతో నిండిన 300 మందిని గుర్తుచేయుచున్నది. 32000 మందిలోనుండి దేవునిచేత ఏర్పరచబడిన ఈ 300 మంది కడవరి దినములలో ఉన్న జయించువారికి సాదృశ్యముగా ఉన్నారు. ఈ సైనికులవలే వారు సాతానుతో పోరాడుటకు దేవుని వాక్యమనే ఖడ్గము వారికి ఉన్నది. అయితే వారు దేవుని వెలుగుతో నిండిన మట్టి పాత్రలుగా ఉన్నారు. వారిలో ఉన్న వెలుగు ప్రకాశించునట్లు, గిద్యోను సైనికులు వారి మంటి ఘటములను పగులగొట్టమని వారికి చెప్పబడింది. నీవు ఒక ఒత్తిని వెలిగించి కుండలో పెట్టినట్లయితే దాని వెలుగు సరిగా ప్రకాశించదు. కాని ఆ కుండను పగులగొట్టినట్లయితే వెలుగు ప్రకాశిస్తుంది. మనలో యేసుయొక్క జీవపు వెలుగు ప్రకాశించునట్లు, మన మంటి ఘటములు ఎలా పగులగొట్టబడాలో పౌలు చెప్పుచున్నాడు. వారు శ్రమలోను, అపాయములోను, తరుమబడువారుగాను, పడద్రోయబడువారుగాను వెళ్ళవలసివచ్చింది (2కొరంథి 4:8-12). కాబట్టి అతని మంటి ఘటము పగులగొట్టబడింది. మరియు అతనిలో ఉన్న ప్రభువైన యేసు జీవపువెలుగును ఇతరులు చూడగలిగియున్నారు. చాలామంది విశ్వాసులు దీనిని గ్రహించరు మరియు ఆసక్తి కూడా కలిగియుండరు. కాని ఈ సిలువమార్గమే దేవుని జీవాన్ని సమృద్ధిగా అనుభవించే విధానం.

నీవు ఒక గోధుమగింజను భూమిలో నాటినప్పుడు దానిపైపొర పగులగొట్టబడుతుంది. ఆ విధంగా ఆ గింజలో ఉన్న జీవము విడుదలవుతుంది. క్రొత్తగా జన్మించిన మనకు కూడా ప్రాణము మరియు శరీరమనే టెంక ఉంటుంది. మనలోని దేవుని జీవము విడుదల కావాలంటే, అది విరుగగొట్టబడాలి. ఆ విధంగా దేవుని జీవపువెలుగు మనలోనుండి అనేకులలోనికి ప్రకాశిస్తుంది.

లేఖనములలో ఈ నియమాన్నే మనం చూస్తాం. ఒక స్త్రీ ప్రభువైన యేసు యొద్దకు ఒక అత్తరు బుడ్డి తెచ్చినప్పుడు దానిలో అద్భుతమైన అత్తరు ఉన్నది. కాని ఆ బుడ్డి పగులగొట్టేవరకు దానిలో అద్భుతమైన సువాసన ఎవరును అనుభవించలేదు. అలాగే మనం కూడా విరుగగొట్టబడుటకు దేవుడు అనేక పరిస్థితులగుండా నడిపిస్తాడు. అప్పుడు మనం ఇతరులకు ఆకర్షణీయంగా ఉండము. నీవు ఇతరులకు చాలా అందమైన వాడుగా కనబడాలని కోరవచ్చును. కాని దేవుడు "నీ కోరికను విరుగగొట్టనిమ్ము" అని అంటాడు. మనుష్యుడు ఆత్మ, ప్రాణం మరియు శరీరమనే మూడు భాగములు కలిగియుంటాడు. క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు మనలో గొప్ప మహిమ నివసిస్తుంది. ఈ మహిమ ప్రకాశించకుండునట్లు మన ప్రాణం ఆటంకపరుస్తుంది. కాబట్టి దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా మనలను విరుగగొట్టి, ఆయన నిత్యసంకల్పము మనము నెరవేర్చునట్లు ఆయన మనలో పని చేస్తాడు.

2కొరంథి 4:10, 11 వచనాలను అనేకమంది క్రైస్తవులు అపార్థం చేసుకొనియున్నారు. శరీరసంబంధమైన అద్భుతాలను కలిగించే సువార్తను వినాలని అనేకమంది విశ్వాసులు ఆశపడుచున్నారు. కాని ప్రభువైన యేసు యొక్క జీవము నీలో బయలుపరచబడాలంటే దానికి జవాబు ఇక్కడ ఉన్నది. ప్రభువైన యేసు యొక్క మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడు వహించుకొని పోవాలి. "యేసు యొక్క మరణానుభవము అనగా ఏమిటి?". ప్రభువైన యేసు యొక్క జీవమును సమృద్ధిగా అనుభవించునట్లు మన స్వచిత్తమును మరియు మన స్వజీవాన్ని ఉపేక్షించాలి (యోహాను 6:38). అనగా ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలో ఎలా స్పందిచాడో ఆ విధముగా మనము కూడా స్పందించాలి. ప్రజలు ఆయనను బయల్జెబూలని పిలిచినప్పుడు, ఇస్కరియోతు యూదా తన డబ్బును దొంగిలించినప్పుడు, ప్రజలు ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, పురుషుని ఎరుగని మరియ కుమారుడని ఆయనను పిలిచినప్పుడు, ఆయనను బోధించవద్దని చెప్పినప్పుడు, ప్రజలు ఆయనను అవమానపరచినప్పుడు, మరియు సమాజమందిరములో నుండి ఆయనను వెలివేసినప్పుడు ఆయన ఏవిధముగా స్పందిచాడు? మానవ ఘనతకును, గౌరవమునకును, గుర్తింపునకును, పేరు ప్రతిష్టలకును మరియు తన స్వచిత్తమునకును ఆయన చనిపోయాడు. ఇదియే "యేసు యొక్క మరణానుభవము". ప్రభువైన యేసు కలువరిలో సిలువ మీద చనిపోవుటలో మనకు భాగము లేదు. అనగా లోక పాపముల కొరకు మనము మరణించలేము. కాని ఆయన యొక్క భూలోక జీవితములో ప్రతిదినము ఆయన స్వజీవానికి చనిపోవుచు జీవించారు. ఈ విధముగా ఆయన యొక్క మరణానుభవములో మనము జీవించాలి.

"యేసు యొక్క మరణానుభవము" అని ఎందుకు పిలువబడింది. ఎందుకనగా తన స్వజీవానికి మరియు లోక విషయములోను మరణిస్తూ జీవించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే కాబట్టి. మానవ సంబంధమైన అన్నిటికి ఆయన చనిపోయి మరియు దేవుని జీవమును, మహిమను బయలు పరచియున్నాడు. ప్రభువైన యేసు అడుగుజాడలలో నడుచుటకు నీవు మరియు నేను పిలువబడియున్నాము. 2కొరంథి 4:17, 18లో "మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు" అని పౌలు చెప్పుచున్నాడు. మనము అదృష్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక శ్రమలను మనము మనుష్యుల దృష్టితో కాక దేవుని దృష్టితో చూస్తాము. మనము శ్రమలలో గుండా వెళ్ళే కొలది మనలో దేవుని మహిమ విస్తరించి మరియు ప్రభువైన యేసుతో సన్నిహిత సహవాసము కలిగియుందుము. ఆ విధముగా ప్రోత్సహించబడి మరియు పరిచర్య కలిగియుందుము. కేవలము దేవుని వాక్యము చదువుట ద్వారా పరిచర్యను పొందలేము.