వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

యేసు అవగాహనలో, అన్ని ఆజ్ఞలకు సమానమైన ప్రాముఖ్యత లేదు. ప్రాధాన్యతలో ఒక క్రమం ఉంది. కొన్ని ఆజ్ఞలు మిగతా వాటికంటే ముఖ్యమైనవి. లేవీయకాండము 11లో వారు తినకూడని కొన్ని రకాల ఆహారాల గురించి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవి హత్య చేయకూడదు మరియు వ్యభిచారం చేయకూడదు అనే ఆజ్ఞలంత ప్రాముఖ్యమైనవి కావు. కాని అవి కూడా ఆజ్ఞలే. అవే దానియేలును దేవుడు అంగీకరించిన వ్యక్తిగా మార్చాయి, ఎందుకంటే అతను పాత నిబంధనలో ఆ చిన్న ఆజ్ఞలను పాటించాలని నిర్ణయించుకున్నాడు.

దానియేలు 1:8లో, "దానియేలు రాజు తిను ఆహారంతో తనను తాను అపవిత్రం చేసుకోకూడదని తన మనస్సులో నిశ్చయించుకున్నాడు". బహుశా ఆ బల్లపై పందిమాంసం లేదా లేవీయకాండము 11లో దేవుడు నిషేధించిన కొన్ని రకాల పక్షిమాంసం ఉండవచ్చు. దేవుడు వాటిని ఎందుకు నిషేధించాడో దానికి సంబంధించిన పూర్తి వివరణను దానియేలు ఇవ్వలేకపోవచ్చు, కానీ అతను ఇలా నిర్ణయించుకున్నాడు, "అది పదిఆజ్ఞలలో భాగం కాకపోయినా, మోషే ధర్మశాస్త్రంలో భాగం అయితే నేను దానిని పాటిస్తాను." అతను తనను తాను అపవిత్రం చేసుకోనందున, దేవుడు అతణ్ణి ఘనపరచి, బబులోనులో బలమైన సాక్షిగా చేశాడు అని వ్రాయబడింది. దేవుడు దానియేలులో తన ఆజ్ఞలన్నిటిని పాటించటానికి ఇష్టపడే వ్యక్తిని చూశాడు.

యుగయుగాలుగా ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంది. వారు ఇష్టపడే ఆజ్ఞలను ఎంచుకోవడం కాకుండా, దేవుడు తన ఆజ్ఞలను పాటించేవారి కోసం, యేసు బోధించినవన్నీ చేసేవారి కోసం ఎల్లప్పుడూ వెతుకుతున్నాడు. మత్తయి 5:19లో, యేసు ఇలా చెప్పాడు, "ఈ ఆజ్ఞలలో ఒకదానిని రద్దు చేసి, ఇతరులను అలాగే చేయమని బోధించేవాడు పరలోక రాజ్యంలో అల్పుడిగా పిలువబడతాడు". యేసు అతను నరకానికి వెళ్తాడని చెప్పలేదు, కానీ అతను పరలోకంలోని గుర్తింపు మరియు విలువల పరంగా అల్పుడిగా ఉంటాడు. భూమిపై అల్పుడిగా ఉండటం కొంచెంకూడా ప్రాముఖ్యమైనది కాదు. దానికి విలువలేదు. కానీ పరలోక రాజ్యంలో అల్పుడిగా ఉండటమంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మీ గురించి పెద్దగా ఆలోచించడని అర్థం. నేను ఆ గుంపులో ఉండాలనుకోవడం లేదు! లోకం నా గురించి పెద్దగా ఆలోచించకపోయినా నేను పట్టించుకోను, కానీ దేవుడు నా గురించి ఎక్కువగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.

బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఇలా చెప్పబడింది, గబ్రియేలు దేవదూత తన తండ్రి జెకర్యాతో, "నీ కొడుకు యోహాను ప్రభువు దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడు". ప్రభువు దృష్టిలో గొప్పగా ఉండటమనేది ఖచ్చితంగా కోరదగినది. నేను ప్రభువు దృష్టిలో అల్పునిగా, ప్రభువు ఎక్కువగా ఆలోచించని వ్యక్తిగా ఉండకూడదనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఇలా చెప్పబడింది, పరలోకరాజ్యంలో కొంతమంది వ్యక్తులు ప్రధాన ఆజ్ఞలను పాటించనందున కాదు, కానీ వారు చిన్న వాటిని పట్టించుకోనందున అల్పులుగా ఉండబోతున్నారని చెప్పబడింది.

నేటికీ చాలా మంది క్రైస్తవులలో ఆ వైఖరిని నేను గుర్తించాను. తాము కొత్త నిబంధన క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారు కొన్ని చిన్న కొత్తనిబంధన ఆజ్ఞలను విస్మరించి, "అది ముఖ్యమైనది కాదు, మీరు దానిని పాటించాల్సిన అవసరం లేదు" అని చెప్తారు. క్రీస్తుపై వారి విశ్వాసాన్ని నేను ప్రశ్నించడం లేదు. వారు పరలోకానికి వెళతారా లేదా నరకానికి వెళతారా అని నిర్ధారించడానికి నేను ఇక్కడ లేను. అది నా పని కాదు. దానిని నిర్ణయించేది దేవుడు. కానీ యేసు చెప్పినదాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను, యేసు బోధించిన అన్నింటిలో (మరియు యేసు తన పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలుల ద్వారా, లేఖనాలలో బోధించిన అన్నింటిలో) అతి చిన్న ఆజ్ఞను రద్దు చేస్తే, అప్పుడు అతను పరలోక రాజ్యంలో అల్పుడిగా పిలువబడతాడు. దానికి భిన్నంగా, పరలోక రాజ్యంలో గొప్పగా ఉండబోయేది ఎవరు? చిన్న ఆజ్ఞను పాటించేవాడు మరియు వాటిని పాటించమని ప్రజలకు బోధించేవాడు. మత్తయి 5:19 స్పష్టంగా చెప్తుంది. ఇది చాలా తేటగా ఉంది.

క్రొత్త నిబంధనలోని అతిచిన్న ఆజ్ఞల పట్ల మీ వైఖరి, దేవుని రాజ్యంలో మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో చూపిస్తుంది. "మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలను పాటించండి" అని యేసు చెప్పాడు. అదే మన ప్రేమకు గుర్తు. ఎవరూ "నేను యేసును ప్రేమిస్తున్నాను" అని చెప్పి ఆయన ఆజ్ఞలను విస్మరించలేరు. మీరు ఎంత వరకు యేసు యొక్క అతి చిన్న ఆజ్ఞలను విస్మరింస్తే, మీరు ఆయనను అంతవరకు ప్రేమించటం లేదు. బహుశా మీరు పెద్దవాటిని నెరవేరుస్తున్నారు, కానీ దేవుని రాజ్యంలో మీ స్థానాన్ని నిర్ణయించేది వాటిలో చిన్నవాటి పట్ల మీ వైఖరి.