WFTW Body: 

"నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు... తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు" (యెహేజ్కేలు 22:30). ప్రపంచచరిత్రలో, ఇశ్రాయేలు మరియు సంఘచరిత్రలో తన సంకల్పములను నెరవేర్చుటకు దేవుడు ఏవిధముగా ఒక పరిస్థితిలో కేవలము ఒక వ్యక్తి మీద ఆధారపడెనో అనుదానికి ఎన్నో ఉదాహరణలు మనము చూచెదము. దేవుడు తోడున్న ఒక్క మనిషి ఎప్పటికి అధికమే.

నోవహు

లోకమంతయు దుర్మార్గతతోను, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటుతోను నిండియున్నప్పుడు భూమి మీద దైవ భక్తి కలిగిన ఎనిమిది మంది వ్యక్తులున్నప్పటికీ, దేవుని ఉద్దేశ్యము యొక్క నెరవేర్పు కేవలము ఒక వ్యక్తి యొక్క నమ్మకత్వము పైన పూర్తిగా ఆధారపడియుండెను. ఆ వ్యక్తి నోవహు. ఆ కాలములో దేవుని దృష్టిలో కృపపొందిన ఏకైక వ్యక్తి నోవహు (ఆదికాండము 6:8). ఒకవ్యక్తి దేవునికి నమ్మకముగా లేనియెడల మానవజాతి అంతయు తుడిచిపెట్టబడియుండెడిది మరియు మనలో ఏ ఒక్కరు ఈ రోజున సజీవముగా ఉండేవారిమి కాము. నోవహు నమ్మకముగా ఉన్నందుకు మనము నిశ్చయముగా దేవునికి వందనాలు చెప్పవలెను.

మోషే

ఇశ్రాయేలు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకు ప్రాతినిధ్యం వహించుటకు తగిన వ్యక్తిని కనుకొనే వరకు దేవుడు వారిని వారి బానిసత్వం నుండి విడిపించలేకపోయెను. అటువంటి వ్యక్తి సిద్ధమయ్యేవరకు దేవుడు వేచియుండుటకు సిద్ధపడెను. ఒకసారి మోషే ఇశ్రాయేలీయుల యొద్ద నుండి కేవలము 40 రోజుల పాటు వెళ్ళిపోయినప్పుడు, వారి 20లక్షల జనాభా దారితప్పిపోయెను (నిర్గమకాండము 32). ఒకసారి దైవజనుడు అక్కడనుండి వెళ్ళినప్పుడు, నిజమైన దేవున్ని విడిచిపెట్టి, విగ్రహారాధనలో తప్పిపోవుటకు ఒక దేశమునకు కేవలము కొద్ది రోజులే పట్టెను.

యెహోషువ

"యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రదికిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించిరి" అని మనము చదివెదము (న్యాయాధిపతులు 2:7). ఇశ్రాయేలీయులపైన యెహోషువ ప్రభావము ఎంత శక్తివంతమైనదంటే, అతని జీవితకాలములోను అతని తోటి పెద్దలయొక్క జీవిత కాలములోను ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయుటకు సాహసించలేదు. కాని యెహోషువ మరణించిన తరువాత, ఇశ్రాయేలు ఘోరముగా దిగజారిపోయెను. ఒక్క దైవజనుడి యొక్క జీవిత ప్రభావము అటువంటిది.

ఏలీయా

"నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉండును" అని బైబిలు ఏలీయా విషయములో చెప్పెను(యాకోబు 5:16,17). ఒక్క వ్యక్తి ఒంటరిగా దుష్టశక్తులను ఓడించి, బయలు ప్రవక్తలందరిని హతమార్చి, ఒక దేశమంతటిని తిరిగి దేవుని వైపుకు త్రిప్పెను.

ఎలీషా

ఏలీయా కాలములో, ఒక రోజు ఇశ్రాయేలులో ప్రవక్తలవుదామని ఆశించిన 50 మంది "ప్రవక్తల శిష్యులు" (బైబిలు కళాశాల విద్యార్థులు) ఉండిరి. కాని దేవుని ఆత్మ వారినందరిని దాటవేసి "ప్రవక్త శిష్యుడు" కాని ఎలీషా మీదికి వచ్చెను (2 రాజులు 2:7,15). ఎలీషా ఇశ్రాయేలులో కేవలము ఒక దాసునిగా "ఏలీయా చేతులమీద నీళ్ళు పోయువాడుగా" పేరు నొందెను (2 రాజులు 3:11).

దానియేలు

దేవుడు యూదులను బబులోనునుండి యెరూషలేమునకు తీసుకురావాలనుకొన్నప్పుడు ఆయనకు ఒక మనుష్యుడు అవసరమాయెను. ఆయన దానియేలును కనుగొనెను. దానియేలు తన యౌవన కాలమునుండి నమ్మకముగా ఉండి ప్రతి పరీక్షలో ఉత్తీర్ణుడాయెను. "తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని తన హృదయములో తీర్మానించుకొనెను" (దానియేలు 1:8). ఇది యౌవనస్థులందరు గుర్తుంచుకొనుటకు ఒక మంచి వచనము. రాజుకు భయపడి మిగిలిన యౌవన యూదులందరు రాజు భోజన బల్లపై వడ్డింపబడిన ఆహారమును (అది దేవుడు లేవీయకాండములో నిషేధించిన ఆహారము) వెంటనే తినగా, దానియేలు మాత్రము దానిని తినుటకు నిరాకరించెను. ఆ బల్ల యొద్ద ఆ దినమున ఇంకా ముగ్గురు యౌవనస్థులుండిరి. వారు దానియేలు తీర్మానము చేసుకొనుట చూచి అతనితో కలిసిరి. దానియేలు మరియు ఆ ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు బబులోనులో ఒక శక్తివంతమైన ప్రభావముగా మారిరి.

పౌలు

ఇతర సంఘముల కంటే పౌలు ఎఫెసులో ఎక్కువ సమయము గడిపెను. మూడు సంవత్సరముల పాటు అతడు ప్రతి దినము దేవుని సంకల్పమంతటిని అక్కడ బోధించెను (అపొ.కా. 20:31). సంఘములన్నిటిలో అది ఎక్కువ ఆధిక్యత గలదిగా ఉండెను. పౌలు వారికి వ్రాసిన పత్రికలో ఉన్న బోధనలయొక్క ఉన్నత ప్రమాణములు అది ఒక ఆత్మానుసారమైన సంఘమని కూడా సూచించుచున్నది. గనుక క్రొత్త నిబంధన జీవితములోనికి అనేకమంది విశ్వాసులు ప్రవేశించగలిగిన ఒక సంఘమున్నదంటే అది ఎఫెసులో ఉన్న ఈ సంఘమే. అయ్యో, కాని అలా కాలేదు. అక్కడున్న పెద్దలు కూడా అటువంటి జీవితములోకి ప్రవేశింపలేదు. వారిని విడిచి వెళ్ళుచున్నప్పుడు పౌలు ఆ పెద్దలతో ఇట్లనెను, "నేను వెళ్ళిపోయిన తరువాత కౄరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకు పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు"(అపొ.కా. 20:29,30). ఎఫెసులో ఉన్న సంఘములో పౌలు వ్యక్తిగతముగా ఉన్నంతకాలము, ఏ తోడేలు దానిలోనికి ప్రవేశింపలేకుండెను, ఎందుకనగా పౌలు మందయొక్క జాగ్రత్తవహించే కాపరిగా మరియు ప్రభువు మందిరము యొక్క మెలకువగల ద్వారపాలకునిగా ఉండెను.

కాని దేవునికి తన నామము కొరకు ఒక స్వచ్ఛమైన సాక్ష్యము ప్రతి తరములోను కావలెను. ఆయన మన తరములో కూడా తన కొరకు ఒక సాక్ష్యము లేకుండా ఉండడు. ఈ తరములో దేవునికి పూర్తిగా అందుబాటులో ఉండుటకు నీవు వెల చెల్లించెదవా?