WFTW Body: 

యోబు విషయములో, అతడు ఆస్తి, బిడ్డలు చివరకు ఆరోగ్యము పోగొట్టుకొనుట ద్వారా ఏవిధముగా అతడు చిట్టచివరకు వచ్చునట్లు దేవుడు చేసేనో మనము చూచెదము. ఒక విధముగా అతడు తన భార్యను (ఎప్పుడూ నిష్టూరముగా మాట్లాడినది), తన ముగ్గురు స్నేహితులను (తనను తప్పుగా అర్థము చేసికొని విమర్శించిన వారిని) కూడా పోగొట్టుకొనెను. తన స్నేహితులు స్వనీతిపరులైన బోధకులుగా మారి అతడు "పడిపోయినప్పుడు తన్నుట" యందు సంతోషించువారుగా అయ్యిరి. దేవుడు తన కనికరము చొప్పున ముగింపు పలికేంత వరకు వారు అతడిని "తన్నుతూనే" ఉండిరి. ఆ పరిస్థితులన్నిటిలో కూడా యోబు తనలో తప్పేమీ లేదని తనను తాను సమర్థించుకొనెను. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడెనో, యోబు తనలో ఉన్న భ్రష్టత్వమును - స్వనీతిని చూచి పశ్చాత్తాపపడెను. అతడు ఒక నీతిపరుడు. అది మంచిదే. కాని అతడి నీతిని బట్టి అతడు గర్వించెను. అది మంచిది కాదు. యోబు విషయంలో దేవుడు ఆ అనుభవాలలో నుండి తీసుకువెళ్ళిన తరువాత, అతడు ఒక విరిగిన వానిగా అయ్యెను. అప్పటినుండి అతడు కేవలము దేవునియందే అతిశయించెను. ఆ విధముగా యోబు యెడల దేవుని ఉద్దేశ్యము నెరవేరెను.

యోబు విరిగిన వానిగా అయిన తరువాత "ఇప్పటి వరకు (బోధకుల ద్వారా) నీ గూర్చి వింటిని కాని, ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను" (యోబు 42:5) అని దేవునితో చెప్పెను. అది యోబు యొక్క పెనూయేలు! అతడు కూడా దేవుని కన్నులారా చూచియు జీవించెను. దాని ఫలితమేమిటి? అతడు ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడెను (యోబు 42:6). నలుగురు బోధకులు రోజుల తరబడి బోధించినా యోబు విషయంలో సాధించలేనిది, దేవుడు ఒక్క క్షణంలో ఆయన అనుగ్రహము ప్రత్యక్షపర్చుట ద్వారా పూర్తి చేసెను. అక్కడ దేవుని అనుగ్రహము యోబును విరుగగొట్టి పశ్చాత్తాపములోనికి నడిపించినది.

మనము దేవుని గూర్చి కూటములలో వినుచుందుము. మనకు కావాల్సింది ఆయన అనుగ్రహమును చూడగల్గునట్లు ఆయనను ముఖాముఖిగా కలుసుకొని దాని ద్వారా మనము విరుగగొట్టబడవలెను. పేతురు విషయంలో అదే జరిగినది. పేతురు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకి మరియు కోడి రెండుమార్లు కూసిన తరువాత జరిగిన దేమిటో మీకు జ్ఞాపకం ఉందా? అతడు ప్రభువు ముఖము చూచెను. పేతురుకు కూడా అక్కడ పెనూయేలు అనుభవమైనది. "ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను" అని మనము చదువుదుము (లూకా 22:61). దాని ఫలితమేమిటి? "పేతురు బయటకు వెళ్ళి సంతాపపడి ఏడ్చెను" (లూకా 22:62). ఆ దయగల, క్షమించే చూపు మొరటుగా ఉన్న చేపలు పట్టేవాని హృదయాన్ని విరగగొట్టినది. పాత నిబంధనలో దేవుడు ఆరోగ్యమును, ఆస్తిని మరియు అనేక వస్తురూపకమైన ఆశీర్వాదములను ఇశ్రాయేలీయులకిచ్చెను. అయితే వాటన్నిటిలో ఒక ఆశీర్వాదము వాటన్నిటికంటె గొప్పది. అది సంఖ్యాకాండము 6:22-26 వచనములలో ఉన్నది. అక్కడ అహరోను ఇశ్రాయేలీయులను "యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక" అని దీవింపమని ఆజ్ఞాపింపబడినట్లు మనము చదువుదుము.

మన జీవితాలను పూర్తిగా మార్చివేసి గొప్ప దీవెన పొందునట్లు దేవునిని కన్నులారా చూచే అనుభవానికి బదులు అనేక మంది విశ్వాసులు ఈనాడు ఆరోగ్యము, సంపద (వీటిని అవిశ్వాసులు కూడా ప్రార్థించకుండా పొందుతున్నారు) మరియు ఉద్రేకము కలుగజేసే అనుభవాలు (అందులో ఎక్కువగా కృత్రిమమైనవి) వంటి తక్కువైన దీవెనల కొరకు వెదకుట విచారకరము కాదా? మనమొక వేళ ఎప్పటికిని ధనికులము కాకపోయినా, ఎప్పటికిని స్వస్థత పొందకపోయినా, మనము ప్రభువు యొక్క ముఖాన్ని చూచినట్లయితే, అది మన అవసరాలన్నిటిని తీర్చును.

యోబు దేవునిని కలుసుకొన్నప్పుడు అతడి ఒళ్ళంతా పుండ్లతో నిండియున్నది. కాని అతడు దేవునిని స్వస్థత కొరకు అడుగలేదు. "నేను దేవునిని కన్నులారా చూచితిని, నాకదే చాలును" అనెను. యోబు స్నేహితులుగా వచ్చిన ముగ్గురు బోధకులు, వారికి వివేచన కలిగియున్నట్లుగాను మరియు దేవుని నుండి వారికి వాక్యము వచ్చినట్లుగాను కనబరచుకొని అతడి జీవితములో ఉండిన ఏదో రహస్య పాపమును బట్టియే ఈ శిక్ష వచ్చినదని చెప్పిరి. ఈనాడు కూడా తనకు తానుగా ప్రవక్తలమని చెప్పుకొని "యెహోవా వాక్కు ఈలాగు సెలవిచ్చెను" అని దేవుని ప్రజలపై దోషము మోపే ప్రసంగములు చేసే వారున్నారు. కాని ఆ ముగ్గురు బోధకులు బోధించునట్లు దేవుడు యోబును తీర్పులతో భయపెట్టలేదు.

దేవుడు యోబు యొక్క ఓటముల గూర్చి కాని లేక అతడు ఒత్తిడికి లోనయినప్పుడు దేవునికి విరోధముగా అతడు నిష్టూరముగా మాట్లాడిన మాటలనుగాని జ్ఞాపకము చేయలేదు. కేవలము దేవుడు ఆయన అనుగ్రహమును ప్రత్యక్షపరచెను. మానవుని సంతోషము కొరకు ఆయన సృష్టించిన సృష్టిలో సౌందర్యమును, మానవునికి లోబడుటకు దేవుడు సృష్టించిన జంతువులలో కనబడే దేవుని అనుగ్రహమును ఆయన ప్రత్యక్షపరచెను. దేవుని అనుగ్రహము యొక్క ప్రత్యక్షత యోబు మారుమనస్సు పొందునట్లు చేసినది. చాలా మంది దేవుని అనుగ్రహమును అవకాశముగా తీసుకొని దానిని దుర్వినియోగపర్చుదురు. కాని యోబు విషయంలో అది మారుమనస్సు పొందునట్లు చేసినది. అప్పుడు దేవుడు యోబునకు అంతకు ముందు ఉన్న దానికి రెండింతలుగా దీవించెను.

మనము యాకోబు 5:11లో చదివినట్లు దేవుడు మనలను విరుగగొట్టుటలో ముఖ్య ఉద్దేశ్యము మనలను సమృద్ధిగా దీవించుటైయున్నది. యోబు విషయములో దేవుని మనసులో ఉండిన ఉద్దేశ్యము అతడి యొక్క స్వనీతిని, గర్వాన్ని చెదరగొట్టి, అతడు ఒక విరిగినవానిగా అగుటచేత దేవుడు అతడికి ముఖాముఖిగా కనపరచుకొని అతడిని సమృద్ధిగా దీవించుటైయున్నది. దేవుడు మనకు ఇచ్చిన వస్తురూపమైన మరియు భౌతికమైన దీవెనల వెనుక దేవుని ముఖమును మనము చూడనట్లయితే అవి కూడా మనలను ఆయన నుండి దూరముగా తీసుకొని పోయి మనలను నాశనము చేయును. వస్తురూపమైన అభివృద్ధిని బట్టి ఎంతమంది విశ్వాసులు ఈరోజు దేవుని నుండి దూరముగా జరిగిపోయిరి.

దేవుని ముఖము యొక్క ఒక్క దర్శనము ఈలోకము మనకు ఇవ్వజూపే అన్నిటి కొరకు ఆశపడుట నుండి మనలను విడుదల చేయును.