WFTW Body: 

ఇశ్రాయేలు దేశానికి పంపబడిన ప్రవక్తలలో బాప్తిస్మమిచ్చు యోహాను చివరివాడు. మత్తయి 3:2లో అతని ప్రాథమిక సందేశం వివరించబడింది, "పరలోకరాజ్యం సమీపించింది, మారుమనస్సు పొందండి". ఎంతో ముఖ్యమైన కారణాన్ని బట్టి, అతను ఈ సందేశంతో ఇశ్రాయేలు ప్రజల వద్దకు వచ్చాడు.

మారుమనస్సు పొందడం అంటే పూర్తిగా తిరగడం. దీనికి నేను పోల్చగలిగిన దగ్గరి విషయం సైనిక ఆదేశమైన "ఎబౌట్ టర్న్(About-turn)". పరేడ్ మైదానంలో ఒక సైనికుడు ముందుకు చూస్తున్నప్పుడు, సార్జెంట్ మేజర్ "ఎబౌట్ టర్న్" అనగానే సైనికుడు పూర్తిగా తిరిగి, తన వీపును తాను ఇంతకు ముందు చూస్తున్న దిశ వైపుకు తిప్పి, గతంలో తన వీపు ఉన్న దిశ వైపు తక్షణమే తిరుగుతాడు. ఇది మారుమనస్సు అనే పదానికి స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది - పూర్తిగా తిరగడం. మన మనస్సులో మనం తిరగాలి. ఆంగ్లంలో మరియు చాలా భాషలలో, మారుమనస్సు అనే పదం చాలా స్పష్టంగా అనువదించబడలేదు, కానీ తమిళ భాషలో ఇది చాలా స్పష్టంగా ఉంది. తమిళంలో మారుమనస్సును "మనం తిరుంబుదల్" అని అనువదించారు, అంటే మనస్సు తిరగడం. మనస్సులో పూర్తిగా తిరగడమే బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలు ప్రజలకు బోధించినది.

ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైన భూసంబంధమైన విషయాలు వాగ్దానం చేయబడ్డాయి. పాత నిబంధన అంతటిలో, వారు దేవుని దైవిక స్వభావాన్ని పొందవచ్చని, లేదా పరలోకంలో నిధిని కలిగి ఉండవచ్చని లేదా భూమిపై పరలోకపు జీవితం జీవించవచ్చని ఎటువంటి వాగ్దానం లేదు. అంతా భూసంబంధమైనదే.

ద్వితీయోపదేశకాండము 28లో, వారికి భౌతిక సంపద, భౌతిక శ్రేయస్సు, శారీరక ఆరోగ్యం, అనేక మంది పిల్లలు, మరియు వారి వ్యాపారాలు, పంటలు మరియు పశువులపై ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడ్డాయని మనం స్పష్టంగా చూస్తాము. వారు చాలా సంపన్నులుగా ఉంటారని, వారు ఎప్పటికీ అప్పుల్లో ఉండరని, వారి భూసంబంధమైన శత్రువులందరూ నాశనం చేయబడతారని, వారు గొప్ప దేశంగా ఉంటారని మరియు వారికి ఒక ప్రదేశం, ఇశ్రాయేలు అని పిలువబడే కనాను దేశం ఉంటుందని వారికి వాగ్దానం చేయబడింది.

ఈ సమయం వరకు ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలన్నీ భూసంబంధమైనవే, మరియు వారి ముఖం ఎల్లప్పుడూ పూర్తిగా భూసంబంధమైన వస్తువుల వైపు ఉంచబడింది. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, "ఇప్పుడు తిరగండి, దీని నుండి పూర్తిగా తిరగండి. భూసంబంధమైన విషయాల వైపు చూడటం మానివేసి తిరగండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త రాజ్యం వస్తోంది. అది పరలోక రాజ్యం, అక్కడ భూసంబంధమైన అవసరాలు ద్వితీయమవుతాయి, శారీరక ఆరోగ్యం కూడా ద్వితీయమవుతుంది. దేవుడు మన భౌతిక అవసరాలను అందిస్తున్నందున భౌతిక శ్రేయస్సు ముఖ్యం కాదు. తిరగండి, ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీకు ఆత్మీయ సంపదను, అంటే పరలోక సంపదను ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు భౌతిక పిల్లలనే కాక ఆత్మీయ పిల్లలను ఇస్తాడు. మీకు ప్రధానంగా భూసంబంధమైన భూమి కాక, ఆత్మీయమైన పరలోకపు భూమి స్వాధీనంగా కలిగి ఉంటారు". పరలోకరాజ్యం ఇంకా రాలేదు, అది సమీపంలో ఉంది. కాబట్టి వారిని తిరగమని అతడు చెప్తున్నాడు. అది పెంతెకోస్తు రోజున రాబోతోంది.

బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తుకు ముందు వచ్చినవాడు. యేసు, దేవుడు మానవునితో చేస్తున్న కొత్త నిబంధనకు మార్గాన్ని తెరవబోతున్నాడు, ఈ నిబంధన అన్ని దేశాల ప్రజలను దేవుణ్ణి వారి తండ్రిగా కలిగి ఉండే సంబంధంలోకి తీసుకువస్తుంది. మత్తయి 4:12-13లో యోహానును హేరోదు బంధించాడని మనం చదువుతాము. యేసు ఈ మాట విన్నప్పుడు, గలిలయ నుండి వెళ్ళిపోయి, తాను పెరిగి ముప్పై సంవత్సరాలు జీవించిన నజరేతును వదిలి, సముద్ర తీరాన ఉన్న కపెర్నహూములోని ఒక ఇంట్లో నివసించాడు. ఆ క్షణం నుండి, యేసు బాప్తిస్మమిచ్చు యోహాను బోధించిన సందేశాన్నే ప్రకటించడం ప్రారంభించాడు. "పరలోకరాజ్యం సమీపించింది, మారుమనస్సు పొందండి" (మత్తయి 4:17). రిలే పరుగుపందెంలో వలె యోహాను మొదటి దశను పరిగెత్తి, దండాన్ని(బేటన్) యేసుకు అప్పగించాడు, ఆయన అదే సందేశాన్ని కొనసాగించాడు - "మారుమనస్సు పొందండి". యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు, అపొస్తలుడైన పేతురు యేసు చేతిలో నుండి దండాన్ని తీసుకొని అదే సందేశాన్ని బోధించాడని మనం చదువుతాము - "మారుమనస్సు పొందండి" (అపొ.కా. 2:38). పెంతెకొస్తు రోజున అతను ప్రజలకు ఇలా ప్రకటించాడు, "మీరు మారుమనస్సు పొందండి, పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. మనలో ఉండు పరిశుద్ధాత్మయే దేవుని రాజ్యము". చివరకు పరలోకరాజ్యం వచ్చింది.

బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు దేవుని రాజ్యం గురించి మాట్లాడినప్పుడు, అది రాబోతుందని లేదా అది దగ్గరలో ఉందని వారు చెప్పారు. క్రీస్తులో దేవుని రాజ్యం ఇప్పటికే ఉందనే వాస్తవాన్ని సూచిస్తూ, దేవుని రాజ్యం మీ మధ్య ఉందని యేసు ఒకసారి చెప్పాడు. కానీ అది తన చుట్టూ ఉన్న ప్రజలలో లేదు. అది పెంతెకొస్తు రోజున మాత్రమే, ఆ 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కోసం వేచి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు దేవుని ఆత్మ వారిని నింపింది మరియు దేవుని రాజ్యం వారిలో నివసించుటకు వచ్చింది. వారు ప్రకటించిన, పరిశుద్ధాత్మ మనలో నివసించు పరలోక రాజ్యం (లేదా దేవుని రాజ్యం) అదే. దురదృష్టవశాత్తు, నేడు చాలా మంది క్రైస్తవ బోధకులు ప్రకటిస్తున్నట్లుగా, ఇది శారీరక స్వస్థత మరియు భౌతిక శ్రేయస్సు యొక్క బాహ్య రాజ్యం కాదు. స్పష్టంగా చెప్పాలంటే, అది మోసం, దేవుని రాజ్యం కాదు.

అయితే అది ఖచ్చితంగా ఏమిటి? రోమా 14:17లో, దేవుని రాజ్యం తినడం మరియు త్రాగడం కాదు అని చెబుతుంది. ఇది శ్రేయస్సు లేదా స్వస్థత వంటి భూసంబంధమైనది కాదు - ఇది అస్సలు భూసంబంధమైన ఆశీర్వాదమే కాదు.

రోమా 14:17 ప్రకారం, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో నీతి, సంతోషం మరియు సమాధానం:

నీతి: మనం క్రీస్తును మన రక్షకుడిగా మరియు ప్రభువుగా స్వీకరించినప్పుడు మొదట దేవుని నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆపై పరిశుద్ధాత్మ ద్వారా మనకు అంతరంగంలో ఇవ్వబడుతుంది. ఆవిధంగా దేవుని నీతి మన జీవితంలో వ్యక్తమవుతుంది.

సంతోషం: నిరుత్సాహం మరియు నిరాశ నుండి మనల్ని పూర్తిగా విడిపించే పరిశుద్ధాత్మలోని అంతర్గత సంతోషం.

సమాధానం: ప్రధానంగా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన అంతర్గత సమాధానం. ఆందోళన, భయం, ఉద్రిక్తత, నిరుత్సాహం, దిగులు, చెడు మానసిక స్థితి మొదలైన వాటి నుండి విముక్తిచేసి మరియు బాహ్యంగా మనుష్యులందరితో సమాధానంగా ఉండి ప్రజలతో లేదా దేనితోనైనా పోరాడటానికి నిరాకరిస్తాము.

ఇదే దేవుని రాజ్యం. ఇది అంతర్గత విషయం. దేవుని రాజ్యం మనలో ఉంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా లోపలికి వచ్చే క్రీస్తు జీవం. ఇది ఈ భూమిపై, మన హృదయాలలో, పరలోక జీవితం.

మనం ముందుకు చూస్తూ, బాప్తిస్మమిచ్చు యోహాను మాటలను జాగ్రత్తగా విందాం: "భూమికి సంబంధించిన వాటిని ఎదుర్కోవడం మానేసి తిరగండి ఎందుకంటే ఇప్పుడు కొత్త రాజ్యం వస్తోంది, ఇక్కడ భూసంబంధమైన అవసరాలు ద్వితీయమవుతాయి, శారీరక ఆరోగ్యం కూడా ద్వితీయమవుతుంది. దేవుడు మన భౌతిక అవసరాలను అందిస్తున్నందున భౌతిక శ్రేయస్సు ముఖ్యం కాదు. తిరగండి - ఈ లోకం వైపు మీ ముఖం పెట్టుకోకుండా మారుమనస్సు పొందండి - ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీకు ఆత్మీయ సంపదను ఇవ్వబోతున్నాడు".

మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశిద్దాం.