ఏ కుటుంబములో పుట్టాలనేది ఎంచుకో గలిగిన ఒకేఒకవ్యక్తి యేసు మాత్రమే. మనలో ఎవరికీ అటువంటి అవకాశములేదు.
యేసు ఎటువంటి కుటుంబాన్ని ఎంచుకొన్నాడు? "అక్కడ నుండి మంచిది ఏదైనా రాగలదా"? (యోహాను 1:46) అని ప్రజలు చెప్పుకొనే నజరేతులోని ఒక అనామకుడైన వడ్రంగి కుటుంబము నుండి ఆయన వచ్చాడు. యోసేపు మరియలు ఒకగొఱ్ఱెపిల్లను దహన బలి అర్పణగా తీసుకురాలేనంతటి బీదవారు (లూకా 2:22-24; లేవీ.కా. 12:8తో కలిపి చూడండి).
ఇంకా చూచినట్లయితే పుట్టిన వారిలో యేసు మాత్రమే ఎక్కడ తాను పుట్టవలెనో ఖచ్చితమైన స్థలమును ఎంచుకొన గలిగిన వాడు. అటువంటి అవకాశము కలిగియుండి కూడా ఆయన పుట్టుటకు ఎటువంటి స్థలమును పరిసరాలను ఎంచుకున్నాడు? ఒక చిన్న పశువులశాలలో పశువులకు గడ్డివేసే తొట్టెలో.
ఇంకా ముందుకు వెళ్తే యేసు ఎటువంటి వంశావళి ఎంచుకొనెనో చూస్తాము. మత్తయి 1:3-6లో యేసు యొక్క వంశవృక్షంలో నలుగురు స్త్రీల పేర్లు చెప్పబడెను. మొదటి స్త్రీ తామారు, తన మామ యూదాతో వ్యభిచరించుట ద్వారా కుమారుని కనినది. రెండవ స్త్రీ రాహాబు, యెరికోలో పేరెన్నికగన్న వ్యభిచారి. మూడవ స్త్రీ రూతు, లోతు తన స్వంత కుమార్తెతో వ్యభిచరించుట ద్వారా పుట్టిన మోయాబు వంశీయురాలు. నాల్గవ స్త్రీ దావీదు వ్యభిచరించిన ఉరియా భార్యయైన బెత్షెబా.
ఇటువంటి అవమానకరమైన వారుండిన వంశాన్ని యేసు ఎందుకు ఎంచుకొన్నారు? దాని ద్వారా ఆయన పూర్తిగా ఆదాము సంతతితో తనను తాను కనపరచుకొనుటకొరకే. ఈ విషయంలో ఆయన దీనత్వమును చూడవచ్చును. ఆయన వంశావళిని లేక కుటుంబమును బట్టి గర్వించాలని అనుకొనలేదు.
యేసు మానవునితో సంపూర్తిగా గుర్తింపబడెను. ఆయన మానవులలో నుండిన జాతి, కుటుంబము, జీవనస్థితి మొదలైన వాటితో సంబంధములేని సమానత్వాన్ని విశ్వసించెను, అందుచేతనే సమాజములో క్రిందినున్న వారిలో ఒకడుగా అయ్యెను. ఆయన అందరికి సేవకుడగునట్లు, ఆయన అందరికంటె తక్కువైన వానిగా వచ్చెను. ఎవరైతే ఇతరుల క్రింద ఉండునో వారే ఇతరులను పైకెత్తగలరు. యేసు ఆవిధంగా వచ్చెను.
పరిశుద్ధాత్ముడు మన మనస్సులను రూపాంతరము చేయుట ద్వారా మనలను మార్చును (రోమా 12:2). యేసు వంటి దీనత్వము అనే నిజమైన విత్తనము మన ఆలోచనలలో నాటబడుతుంది. మన క్రియల ద్వారా లేక ఇతరుల యెదుట మన ప్రవర్తన ద్వారా కాక మనతలంపుల (మనము ఒంటరిగా ఉన్నప్పుడు) ద్వారా మనము (అవి మనగూర్చి మరియు మనము ఇతరులతో ఎలా సరిపోల్చు కొనుచున్నాము అనే దానిని బట్టి) క్రీస్తు పోలికలోనికి మారుతున్నామో లేదో తెలుసుకొనవచ్చును.
మన మెప్పుడైతే నిజముగా మన ఆలోచనల్లో మన గూర్చి మనము తక్కువగా అంచనా వేసికొంటామో, అప్పుడు నిజముగా మనము ఇతరులను "మన కంటె యోగ్యమైన వారుగా ఎంచుదుము" (ఫిలిప్పీ 2:3), మనలను మనము "పరిశుద్ధులందరిలో తక్కువవానిగా" (ఎఫెసీ 3:8,11) ఎంచుకొందుము!
యేసు ఎప్పుడూ తన తండ్రి యెదుట ఆయన ఏ విలువ లేనివానిగా ఉండెను. కాబట్టి, తండ్రి మహిమంతయు ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడెను.
యేసు ముప్పై సంవత్సరములు అసంపూర్ణులైన పెంపుడు తండ్రికి మరియు తల్లికి లోబడెను, ఎందుకంటే అది దేవుని చిత్తమైయున్నది. ఆయనకు యోసేపు మరియల కంటె ఎన్నో విషయాలు ఎక్కువగా తెలియును. అంతేకాక ఆయన వారివలె కాక పాపములేని వానిగా ఉండెను. అయినప్పటికీ ఆయన వారికి లోబడెను.
ఒక వ్యక్తి తన కంటె తెలివి తేటలలోను మరియు ఆత్మీయముగా తక్కువగా ఉన్నవారికి లోబడుట సులువైనదికాదు. కాని దేవుని దృష్టిలో తనకు తాను నిజముగా విలువ లేనివానిగా చూచుకొనిన వానికి, దేవుడు తనపై ఏర్పాటు చేసిన వారెవరికైన లోబడుటలో కష్టము ఉండదు. నిజమైన దీనత్వమునకు ఈ విషయములో ఏ సమస్యా ఉండదు.
యేసు చూచుటకు ఏ మాత్రము గొప్పగా కనబడని వృత్తిని ఎంచుకున్నారు - అది వడ్రంగి పని. ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన పేరుకు ముందు గాని వెనుకగాని ఏ ప్రత్యేక గుర్తింపులు ఉంచుకొనలేదు. ఆయన "పాస్టరు యేసు" కాదు. "రెవరెండ్ డాక్టర్ యేసు" అంత కన్నా కాదు. ఆయన సేవ చేయుటకు వచ్చిన సామాన్య ప్రజల కంటే హెచ్చింపబడే ఏ బిరుదు గాని లేక ఈ లోక సంబంధమైన ఎక్కువైన స్థానాన్ని గాని ఎప్పుడూ ఆయన వెదకలేదు.
యేసు తండ్రి ముందు ఏమీ లేని ఈ స్థానాన్ని తీసుకున్నందున, ఆయన తన జీవితంలో తండ్రి ఆజ్ఞాపించిన దేనికైనా ఆనందంగా లోబడగలిగాడు మరియు తండ్రి ఆజ్ఞలన్నింటినీ హృదయపూర్వకంగా పాటించగలిగాడు.
"మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపెను" (ఫిలిప్పీ 2:8).
దేవునికి అటువంటి సంపూర్ణ విధేయత నిజమైన దీనత్వానికి స్పష్టమైన చిహ్నం. ఇంతకంటే స్పష్టమైన పరీక్ష మరొకటి లేదు.
వినుటకు చెవులు గలవాడు వినునుగాక.