WFTW Body: 

క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త ద్రాక్షారసపు తిత్తులలో పోయుట గూర్చి యేసు ప్రభువు చెప్పారు (లూకా 5:37). క్రొత్త ద్రాక్షారసము యేసుప్రభువు యొక్క జీవము మరియు క్రొత్త ద్రాక్షారసపు తిత్తులు యేసు కట్టుచున్న సంఘమైయున్నది. కానాలో యేసు ఉన్న వివాహములో పాత ద్రాక్షారసము అయిపోయెను. పాత ద్రాక్షారసము మానవ ప్రయత్నముతో ఎన్నో సంవత్సరములుగా తయారు చేయబడినది. కాని అది అవసరమును తీర్చలేకపోయినది. ఇది పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రానుసారమైన జీవితము గూర్చిన ఉపమానము. పాత ద్రాక్షారసము అయిపోయినది. ప్రభువు మనకు క్రొత్త ద్రాక్షారసమును ఇచ్చుటకు పాతది అయిపోవు వరకు ఎదురు చూడవలసి ఉండును.

మన వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో లేక మన సంఘ జీవితములో ద్రాక్షారసము అయిపోయినదా? అలా అయినట్లయితే మనము ప్రభువు ముఖమును వెదకుటకు మరియు మన అవసరత త్వరగా ఒప్పుకొనుటకు ఇదే సమయము. ఆయన మాత్రమే మనకు క్రొత్త ద్రాక్షారసమును ఇవ్వగలడు. కానాలో క్రొత్త ద్రాక్షారసము మానవ ప్రయత్నముతో తయారవ్వలేదు. అది దేవునియొక్క అద్భుత కార్యము. మన జీవితములో కూడా అలాగే జరగవచ్చు. ఆయన, ఆయనయొక్క ఆజ్ఞలను మన హృదయములపై మరియు మన మనసులపై వ్రాసి ఆయన సంపూర్ణ చిత్తమును చేయుటకు ఆశ కలిగియుండునట్లు చేయును (హెబ్రీ 8:10; ఫిలిప్పీ 2:13). మనము ఆయనను ప్రేమించునట్లును మరియు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచునట్లు ఆయన మన హృదయములను సున్నతి చేయును (ద్వితీయో.కా. 30:6; యెహెజ్కేలు 36:27). ఈ పని కానాలో క్రొత్త ద్రాక్షారసమును తయారు చేసినటువంటిది. కృపయొక్క అర్థమిదే. మన జీవితకాలమంతా మనము ప్రయత్నించినా మనము యేసుయొక్క జీవమును ఉత్పత్తి చేయలేము. కాని మనము మన శరీరములో "యేసుయొక్క మరణానుభవమును" (మనము ప్రతిదినము సిలువను ఎత్తుకొనుట, మన అహం విషయంలో, మన స్వంత యిష్టము విషయములో, మన హక్కుల విషయములో, మరియు మన కీర్తి విషయంలో చనిపోవుట) కలిగియుండినట్లయితే, మనలో యేసు యొక్క జీవము అనే క్రొత్త ద్రాక్షారసమును తయారు చేయుదునని దేవుడు వాగ్దానము చేసెను(2 కొరింథీ 4:10).

క్రొత్త ద్రాక్షారసమును సంపాదించుకొనుటకు మన పోరాటమంతా పాపమునకు వ్యతిరేకముగా ఉన్నది. కాని క్రొత్త ద్రాక్షారసపు తిత్తిని సంపాదించుకొనుటకు మన పోరాటము దేవుని వాక్యమును కొట్టివేయు మతపరమైన ఆచారములకు వ్యతిరేకముగా ఉన్నది. పాపమును విడిచివచ్చిన దానికంటె ఈ మానవుల యొక్క ఆచారములను విడిచి వచ్చుట ఎంతో ఎక్కువ కష్టముగా ఉండును. కాని బలత్కారులు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశింతురు (మత్తయి 11:12). మతపరమైన ఆచారములు బలవంతముగా వదిలించుకొంటే తప్పపోవు.

మనము క్రైస్తవులుగా, పాత యూదా మత ద్రాక్షారస తిత్తులను తీసివేసి క్రైస్తవ సంఘమను క్రొత్త ద్రాక్షరస తిత్తులను కలిగియున్నామని అనుకొనవచ్చును. కాని నీవు క్రైస్తవ సంఘముగా పిలిచేదానిని జాగ్రత్తగా చూచినట్లయితే, దానిలో ఉన్న పాత నిబంధనపు లక్షణములను చూచి నీవు ఆశ్చర్యపోవుదువు. అటువంటి ఎన్నో ఉండినా, కేవలం మూడు ఉదాహరణలను ఆలోచించండి.

అన్నిటికంటె మొదటిగా, యూదులలో యాజకత్వం చేసే ఒక ప్రత్యేక గోత్రము(లేవీయులు) మతపరమైన పనులన్నిటిని చేయుటకు ఉండేవారు. యూదులందరు యాజకులు కాలేరు. అయితే క్రొత్తనిబంధన క్రింద విశ్వాసులందరు యాజకులే (1 పేతురు 2:5; ప్రకటన 1:6). ఈ సత్యమును చాలామంది విశ్వాసులు వాక్యానుసారంగా అంగీకరించినా, దానిని పాటించేది మాత్రము కొద్దిమంది మాత్రమే. క్రైస్తవ గుంపులలో దాదాపు ప్రతి ఒక్కదానికి "ప్రీస్టు" లేక "పాస్టర్" లేక "దేవుని సేవకుడు" లేక "పూర్తి కాల సేవకుడు" ఉందురు. వీరు సరిగ్గా పాతకాలపు లేవీయులవలె దేవుని జనుల ఆరాధనను నడిపించుదురు. కేవలం ఈ లేవీయులు మాత్రమే క్రొత్తగా క్రీస్తును నమ్మిన వారికి బాప్తిస్మమిచ్చుట మరియు రొట్టెవిరచు కార్యక్రమము చేయుదురు. మరియు ఈ "లేవీయులు" దేవుని ప్రజల దశమ భాగములచే పోషింపబడుదురు. కూటములలో ఈ "లేవీయులే" అంతా అయియుండి శరీరము యొక్క పరిచర్యకు ఏ అవకాశము లేకుండా చేయుదురు. ఒకే బోధకుడు ఉండే పద్ధతి పాత ద్రాక్షరస తిత్తి పద్ధతులలో ఒకటిగా ఉన్నది. క్రొత్త నిబంధన క్రింద, ప్రతి విశ్వాసి క్రొత్త ద్రాక్షారసమును త్రాగవచ్చును అనగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆత్మయొక్క ఫలములను కలిగియుండవచ్చును. ఇద్దరు లేక ముగ్గురు ప్రవక్తలు కూటమును ప్రారంభించవలెను, ఒకరిద్దరు భాషతో మాట్లాడవచ్చును (ప్రతిదానికి అర్థము చెప్పవలెను), ప్రతివిశ్వాసి కూటములో ప్రవచించుటకు స్వేచ్ఛ కలిగి సంఘమును కట్టవచ్చును. ఇది క్రొత్త ద్రాక్షారసపు తిత్తి (1 కొరింథీ 14:26-31). క్రొత్త ద్రాక్షారసము 1 కొరింథీ 13లో ప్రేమగా చెప్పబడినది. క్రొత్త ద్రాక్షారసపు తిత్తి 1 కొరింథీ 12,14 అధ్యాయములలో వివరింపబడినది. కాని ఎంతమంది విశ్వాసులు దేవుని పద్ధతిలో చేయుటకు కోర్కె కలిగియున్నారు? అయ్యో! చాలా కొద్దిమంది మాత్రమే. చాలామంది వారి పాత ద్రాక్షరసపు తిత్తితోను మరియు వారి సొమ్ములు స్వీకరించే "లేవీయుల"తోను సంతృప్తిపడుతున్నారు.

రెండవదిగా, యూదులకు వేరు వేరు విషయములు గూర్చి దేవుని చిత్తమును తెలిసికొను ప్రవక్తలుండేవారు. వారు మాత్రమే దేవుని ఆత్మను కలిగియుండుటచేత అట్లు జరిగేది. కాని క్రొత్త నిబంధన క్రింద, ప్రవక్తలకు వేరైన పని ఉన్నది, అది క్రీస్తుశరీరమును కట్టుపని (ఎఫెసీ 4:11-13). ఇప్పుడు విశ్వాసులందరు పరిశుద్ధాత్మను పొందగలరు. కాబట్టి ఇప్పుడు వారి కొరకు దేవుని చిత్తమును తెలిసికొనుటకు ఎవరో ఒక ప్రవక్తయొద్దకు వెళ్ళనక్కర్లేదు (హెబ్రీ 8:11; 1 యోహాను 2:27). అయినప్పటికి చాలామంది విశ్వాసులకు ఇప్పటికిని ఒక దైవజనునియొద్దకు వారు ఏమి చేయవలెనో తెలుసుకొనుటకు లేక ఎవరిని వివాహము చేసికొనవలెనో మొదలైనవి తెలిసికొనుటకు వెళ్ళుట ద్వారా పాత ద్రాక్షారసపుతిత్తి జీవితమునే జీవించుచున్నారు.

మూడవదిగా, యూదులు ఒక పెద్ద జాతి ప్రజలైయుండి చాలా దూరముగా విస్తరించి ఉండినా వారికి యెరూషలేము ఒక కేంద్ర స్థానముగా ఉండి, వారికి ఈ లోకసంబంధమైన ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు. క్రొత్త నిబంధన క్రింద యేసుక్రీస్తు మాత్రమే మనకు ప్రధాన యాజకుడు మరియు మనకున్న ఒకే ఒక కేంద్రస్థానము దేవుని సింహాసనము మాత్రమే. యూదులకు ఒక స్తంభము నుండి ఏడు కొమ్ములు కలిగిన ఒక దీపస్తంభము ఉండెను (నిర్గమ 25:31, 32). ఇది పాత ద్రాక్షారసపుతిత్తి.

క్రొత్తనిబంధనలో, ప్రతి స్థానిక సంఘము కొమ్ములేమీ లేకుండా ఒక దీపస్తంభముగా ఉన్నది. దీనిని ప్రకటన 1:13,19లో తేటగా చూడవచ్చును. అక్కడ ఆసియా మైనర్ అను ప్రాంతములో ఉండిన ఏడు సంఘములు, యూదుల దీపస్తంభము వలె కాకుండా ఏడు వేరు వేరు దీపస్తంభములుగా చూపబడెను. యేసు ప్రభువు, సంఘములకు శిరస్సుగా ఆ దీపస్తంభము మధ్య నడుచుచుండెను. ఈ లోక సంబంధమైన పోపుగాని లేక సంఘముల అధ్యక్షుడుగాని ఆ దినాల్లో లేకుండెను. అలాగే ఏ విషయములోనైనా తనదే చివరి మాటగా ఉండే పెద్దగాని లేకుండెను. ప్రతి స్థానిక సంఘము స్థానిక పెద్దలచే నడిపింపబడుచుండెను. ఈ పెద్దలు ప్రభువే వారికి శిరస్సు గనుక ఆయనకే వారు లెక్క అప్పచెప్పవలసి ఉండెను. కాని మనము మనచుట్టూ జన సమూహములు ఈ రోజున ప్రత్యేకమైన పేరు పెట్టుకొని గాని, పేరు లేకుండాగాని సంస్థల పద్ధతిలో ఉండుటను చూడగలము. కొందరైతే పేరు ఏమీ లేకపోయినా ఒక మతశాఖకున్న లక్షణాలన్ని కలిగియుంటున్నారు. ఇదంతా పాతద్రాక్షారసపుతిత్తి పద్ధతి.

దేవుడు స్థానిక సంఘమనే క్రొత్త ద్రాక్షారసపుతిత్తిని దుష్టత్వము వ్యాపించకుండునట్లు ఏర్పాటుచేసెను. ఆసియా మైనర్ అను ప్రాంతములో ఉండిన సంఘములన్ని ఒకే సంస్థయొక్క శాఖలైనట్లయితే, బిలాము మరియు నికొలాయుతుల తప్పుడు బోధలు మరియు యెజెబెలుయొక్క తప్పుడు ప్రవచనాలు (ప్రకటక 2:14,15,20) ఆ ఏడు సంఘములకు వ్యాపించి ఉండేవి. కాని వారు వేరు వేరు స్తంభములైనందున, స్ముర్న మరియు ఫిలదెల్పియలో ఉన్న రెండు సంఘములు వారిని వారు పవిత్రముగా ఉంచుకొనగలిగారు. నీ సంఘమును నీవు పవిత్రముగా ఉంచుకొనవలెనని అనుకుంటే ఈ సంస్థలనే పాత ద్రాక్షారసపు తిత్తిని వదిలించుకో. మనదేశంలో అనేకమందిని బంధకాలలో ఉంచిన మానవ ఆచారములను వదిలించుకొనునట్లు బలాత్కారము చేయువారిని (మత్తయి 11:12) మరియు ప్రతి స్థలములో క్రీస్తు శరీరమైన సంఘమును కట్టువారిని అనేకమందిని దేవుడు లేపునుగాక.