WFTW Body: 

హెబ్రీ 4:12లో "ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది" అని చదువుతాము.

దేవునివాక్యము ఒక ఖడ్గమువలె మన హృదయాలలోనికి దూసుకువెళ్ళి మన తలంపులను ఉద్దేశ్యాలను మనకు బయలుపరచును. క్రొత్తనిబంధనలో హృదయముయొక్క తలంపులు మరియు ఉద్దేశ్యములు అత్యంత ప్రధానమైనవి. అయితే పాతనిబంధనలో పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలీయులలో నివసించనందున చెడు తలంపులు ఉద్దేశ్యములు అంత తీవ్రముగా పరిగణింపబడి ఉండేవి కావు. చెడు తలంపులు లేక ఉద్దేశ్యములను కలిగియున్నందుకు ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని బయటపెట్టలేకపోయెను మరియు శిక్షించలేకపోయెను. ఒక వ్యక్తి బయటకు చేయవలసిన వాటినన్నింటిని చేసినంత కాలము ధర్మశాస్త్రము అతన్ని మెచ్చుకొనేది. కాని క్రొత్తనిబంధనలో అలా కాదు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు ఒక వైద్యుడు ఒక వ్యక్తిని బాహ్యముగా మాత్రమే పరీక్షస్తున్నట్టుగా దేవుని వాక్యము అతనిని మాత్రమే పరీక్షించేది. కాని క్రొత్తనిబంధనలో దేవుని వాక్యము ఒక ఎక్స్‍రే వలే హృదయములోనికి చొచ్చుకొనిపోతుంది. దేవుడు మన తలంపులు, వైఖరులు ఉద్దేశముల వంటి వాటియందు ఎక్కువ ఆసక్తి కలిగియున్నాడు. బయటకు ఆరోగ్యముగా కనిపించే అనేకులు లోపల ఏవిధంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగములు కలిగి ఉండవచ్చునో అలాగే బాహ్యముగా అంతబాగానే కనబడి లోపల గొప్ప దుష్టత్వముండవచ్చును.

గనుక నీవు ఈ దినములలో దేవుని వాక్యము చదివి నీ జీవితములో ఉన్న బాహ్య సంబంధమైన పాపములను బట్టి మాత్రమే ఒప్పింపబడియుంటే దేవుడు మీతో చెప్పాలనుకొనుచున్న వాటన్నింటిని నీవు వినలేదని అది సూచిస్తుంది. గనుక ఈ ప్రశ్నతో నిన్ను నీవు ఎల్లప్పుడు పరీక్షించుకొనుము: దేవుని వాక్యము నా హృదయముయొక్క తలంపులను ఉద్దేశ్యములను నాకు బయలుపరచెనా? ఇక్కడ ప్రాధాన్యత మెదడుకు కాక హృదయానికి ఇవ్వబడినట్లు గమనించండి. దేవుని వాక్యము అభిషేకముతో ప్రకటింపబడినప్పుడు వాక్యము నీ మనస్సు ద్వారా నీ హృదయములోనికి వెళ్ళి నీ అంతరంగ తలంపులను మరియు ఉద్దేశ్యములను బయలుపరచును.

1 కొరింథీ 14:25లో అభిషేకముతో ప్రకటించబడిన వాక్యము యొక్క ఫలితాన్ని గురించి చదువుతాము. ప్రజల హృదయ తలంపులు బయలుపరచబడినప్పుడు వారు సాగిలపడి దేవుడు ఆ కూడికలో ఉన్నాడని ఒప్పుకొనును. నీవు ఒక భక్తిపరునితో మాట్లాడుచున్నప్పుడు ఆయన నీతో అభిషేకముతో కూడిన ప్రవచనాత్మక మాటను మాట్లాడినప్పుడు అలా జరగవచ్చును. నీవు ప్రభువును సేవించాలనుకొంటే నీ హృదయములోను నీ నోటిలోను ఉన్న ఖడ్గము పదునుగా ఉండేటట్లు చూచుకొనుము. ప్రజలకు అంగీకారముగా ఉండేటట్లు దేవుని వాక్యమును మెత్తనిదానిగా చేసి ఆ ఖడ్గమును పదునులేని దానిగా చేయకుము. అది ప్రజలకు మంచి చేయదు. ఎందుకంటే అది లోనికి చొచ్చుకొనిపోదు. ఒక పదునులేని కత్తితో మాంసమును కోయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? నీవు ఎంత కోసినా ఆ మాంసము అలాగే ఉంటుంది. దేవుని వాక్యముయొక్క పదును విషయములో రాజీపడే బోధకుడు అతని సందేశము చివరలో ఎవరూ దేవుని నుండి వినలేదని కనుకొనును.

దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. అది తన స్వంత హృదయమును కోసి తన తలంపులను ఉద్దేశ్యములను బయలుపరచుటకు ఒక బోధకుడు మొదట దానిని అనుమతించవలెను. అప్పుడు మాత్రమే ఇతరుల హృదయాలను కోయుటకు అతడు దానిని వాడగలడు. దేవుని వాక్యము మొట్టమొదటిగా నీ హృదయములోనికి చొచ్చుకొని పోనియెడల దానిని ప్రకటింపకుము. అనేకమంది బోధకులు దేవుని వాక్యముతో తమ్మును తాము తీర్పుతీర్చుకొనరు. వారు ఇతరులకు మాత్రమే తీర్పు తీర్చుదురు.

దేవుని వాక్యము మనలోనికి చొచ్చుకొని పోయి మన ఉద్దేశ్యములను కూడా శోధించును. మనము ఎల్లప్పుడు దేవుని వాక్యములో ఉన్న ఆత్మ స్వరమును వినుచూ ఉంటే మనము చివరకు పూర్తిగా స్వచ్ఛమైన హృదయాన్ని కలిగియుండెదము. ఎందుకంటే మన హృదయపు తలంపులు ఉద్దేశ్యములు మనకు తెలియజేయబడుచూ ఉంటాయి. మరియు వాటినుండి మనలను శుభ్రపరచుకోవచ్చు. ప్రతి విశ్వాసి ప్రతి దినము ఈ విధంగా జీవించవలెను. ఏవిధంగా అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులు అనుదినము మన్నాను పొందుకొనిరో మనము కూడా దేవుని నుండి అభిషేకమున్న దేవుని వాక్యమును పొందుకోవలెను.