"పరలోకంలో మరియు భూమిపై నాకు సర్వాధికారం ఇవ్వబడింది" (మత్తయి 28:18). మనం వెళ్లి గొప్పపనిని నెరవేర్చాలంటే మనం దీనిని ఖచ్చితంగా నమ్మాలి. సమస్త అధికారం యేసుకు ఇవ్వబడిందని నేను నమ్మకపోతే, కొంతకాలం తర్వాత ఆ పనిని విడిచిపెడతాను, ఎందుకంటే క్రైస్తవ పని చాలా నిరుత్సాహపరిచే పని. మీకు వెంటనే ఫలితాలు కనిపించవు. సువార్తికులు లేదా ప్రవక్తలు లేదా అపొస్తలులు వెంటనే ఫలితాలను చూడలేరు. పిల్లలను యుక్తవయస్సు వరకు తీసుకురావడం లాంటిది. నేను అనేక సంవత్సరాలనుండి సంఘాలను నాటడం, విశ్వాసులను స్థిరపరచడం మరియు వారిని దైవభక్తి వైపు నడిపించడానికి ప్రయత్నించాను కాబట్టి నేను దీనిని ధృవీకరించగలను. నన్ను ఈ పరిచర్యలోనికి పంపుతున్నది పరలోకంలో మరియు భూమిపై సర్వాధికారం ఇవ్వబడిన వ్యక్తి అని మనం గ్రహించకపోతే నిరుత్సాహపడటం చాలా సులభం. ఆ అధికారంతో ఆయన నన్ను బలపరుస్తున్నాడు.
కాబట్టి నేను గొప్పపని యొక్క రెండవ భాగాన్ని ఇలా చూస్తున్నాను: ఇది యేసు చెప్పిన రెండు అద్భుతమైన ప్రకటనల మధ్య అది నిక్షిప్తం చేయబడింది. మొదటిది 18వ వచనం, "పరలోకంలో మరియు భూమిపై సర్వాధికారం నాకు ఇవ్వబడింది". రెండవది 20వ వచనం, "ఇదిగో, నేను యుగసమాప్తి వరకు ఎల్లప్పుడూ మీతో ఉంటాను". ఈ రెండు వాస్తవాలలో దేనిపైనైనా నాకు సందేహం ఉంటే, నేను గొప్పపని యొక్క రెండవ భాగాన్ని పూర్తి చేయబోవడం లేదు. ఈ క్రింది విషయాలలో మీకు నమ్మకం లేకుంటే అది చాలా నిరుత్సాహకరంగా ఉంటుందని నేను యాభై సంవత్సరాల క్రైస్తవ పరిచర్యలో కనుగొన్నాను: - మిమ్మల్ని పంపిన వ్యక్తి, పరలోకంలో (ఆకాశాలలో, దయ్యాలు నివసించే రెండవ ఆకాశంలో) మరియు భూమిపై (భూమిపై ఉన్న ప్రజలందరిపై) సర్వాధికారం కలిగి ఉన్నాడు. క్రీస్తుకు ఈ అధికారం ఉంది. - గొప్పపని యొక్క ఈ భాగాన్ని నెరవేర్చడానికి నేను ముందుకు వెళ్ళినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడని ఆయన నుండి నాకు ఒక నిర్దిష్టమైన వాగ్దానం ఉంది.
ఈ రెండు అద్భుతమైన వాగ్దానాలకు సంబంధించి ఒక పెద్ద ప్రమాదం ఉంది. షరతులను నెరవేర్చకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నించే చాలా చెడ్డ అలవాటు క్రైస్తవులకు ఉంది. ఉదాహరణకు, "ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించండి మీరు రక్షింపబడతారు" అని మీకు చెప్పబడితే, "నేను ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించే షరతును నెరవేర్చను, కానీ నేను రక్షింపబడబోతున్నాను" అని మీరు చెప్పినట్లయితే, అది వెఱ్ఱితనమని మీరు అనుకోరా?. "మనము మన పాపాలను ఒప్పుకుంటే, ఆయన మన పాపాలను క్షమించుటకు నమ్మకమైనవాడు మరియు నీతిమంతుడు". మీ పాపాన్ని ఒప్పుకునే షరతును మీరు నెరవేర్చకపోతే, ఆయన మీ పాపాన్ని క్షమించబోతున్నాడని మీరు ఎలా నమ్మగలరు?
దేవుని వాగ్దానాలు షరతులతో కూడినవి. దేవుడు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ ఇచ్చే భౌతిక వాగ్దానాలు ఉన్నాయి, ఆయన మంచివారిపై మరియు చెడ్డవారిపై సూర్యుడిని ఉదయింప చేస్తాడు మరియు నీతిమంతులపై మరియు అవినీతిపరులపై వర్షం కురిపిస్తాడు. కానీ దేవుని ఆత్మీయ వాగ్దానాల విషయానికి వస్తే, వాటిని పొందడానికి షరతులు ఉన్నాయి. ఇది పాప క్షమాపణతో ప్రారంభమవుతుంది. మారుమనస్సు మరియు క్రీస్తుపై విశ్వాసం లేకుండా, ఎవరూ పాప క్షమాపణ పొందలేరు. నీతిమంతులుగా తీర్చబడటం విశ్వాసం ద్వారా జరుగుతుంది మరియు పరిశుద్ధపరచబడటం విశ్వాసం ద్వారా జరుగుతుంది. అలాగే, దేవుడు తన కృపను షరతులు లేకుండా అందరికీ ఇవ్వడు. ఆయన తన కృపను దీనులకు మాత్రమే ఇస్తాడు. ప్రతి ఆత్మీయ వాగ్దానానికి ఒక షరతు ఉంది.
నేను ఇప్పుడు ప్రస్తావించిన ఈ ఇతర అన్ని విషయాలలో వాగ్దానంతో జతచేయబడిన షరతును నెరవేర్చడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న చాలా మంది క్రైస్తవులు, "ఇదిగో నేను యుగసమాప్తి వరకు ఎల్లప్పుడూ మీతో ఉంటాను" అనే ఈ వాగ్దానానికి వచ్చేసరికి, షరతును నెరవేర్చకుండా స్వతంత్రించుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. మీరు పశ్చాత్తాపపడి నమ్మకపోయినా క్షమించబడతారని నేను బోధించినట్లయితే వారు ఆశ్చర్యపోతారు. మీరు మీ పాపాలను ఒప్పుకోకపోయినా మీరు క్షమించబడతారని నేను చెబితే, వారు దానిని హాస్యాస్పదమైనదని అంటారు. మీరు మీ పాపాలను ఒప్పుకుంటే, ఆయన మిమ్మల్ని క్షమించడానికి నమ్మకమైనవాడు మరియు న్యాయవంతుడు అని బైబిలు చెబుతోంది, అవునా? మీరు వెళ్లి శిష్యులను చేసి, వారికి బాప్తిస్మమిచ్చి, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేయమని వారికి బోధిస్తే, యుగాంతం వరకు ప్రభువు ఎల్లప్పుడూ మీతో ఉంటాడని అదే బైబిలు చెబుతుంది. ఇది ప్రభువు చెప్పిన మాట. అప్పుడు ఆయన, "ఇదిగో, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను."
కాబట్టి అది యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయమని ఇతరులకు బోధించడానికి వెళ్లేవారికి ప్రత్యేకంగా ఇవ్వబడిన వాగ్దానం. సీడీలు, ఇంటర్నెట్ మరియు సాహిత్యం ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయాలని ప్రజలకు బోధిస్తూ, దానిని నెరవేర్చడానికి నేను 50 సంవత్సరాలు గడిపాను. నాతో ప్రభువు ఉనికిని మరియు అధికారాన్ని నేను నిజంగా అనుభవించానని నేను సాక్ష్యమివ్వగలను. కాబట్టి దేవుని వాగ్దానాలు నిజమని నమ్మమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయమని ప్రజలకు బోధించడానికి మీరు ముందుకు వెళితే, మొదట మీరే వాటిని చేయడం ద్వారా ఆయన అధికారం మీకు మద్దతు ఇస్తుంది మరియు ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండటం వల్ల కలిగే ఫలితాలలో ఒకటి -మనల్ని నిరుత్సాహం, దిగులు, చెడు మనోభావాలు మరియు అలాంటి అన్ని రకాల విషయాల నుండి విముక్తి చేస్తాడు. యేసు నాతో ఎల్లవేళలా ఉంటే నేను చెడు మనోభావంలో ఎలా ఉంటాను? యేసు నాతో ఎల్లవేళలా ఉంటే నేను ఎలా నిరుత్సాహపడగలను లేదా భయపడగలను? క్రీస్తు తమతో లేనప్పుడు ఉన్నాడని చాలా మంది ఊహించుకుంటారు. వారు యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయాలని కోరుకోవడం లేదు; వారు యేసు ఆజ్ఞాపించిన దానిని ఇతరులకు బోధించుటకు ప్రయత్నించరు. కాబట్టి మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ముందు నెరవేర్చాల్సిన షరతు ఉంది మరియు దానిని స్పష్టంగా చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.