WFTW Body: 

ఆయన మనలో ఎంత గొప్ప శక్తిని వ్యక్తపరచగలడో మీరు చూశారా? ఈ విశ్వంలో దేవుడు ఇప్పటివరకు వ్యక్తపరచిన తన గొప్ప శక్తి, సృష్టిలో కాదు యేసు పునరుత్థానంలో ఉంది (ఎఫెసీ 1:20).

మన చుట్టూ ఉన్న విశ్వంలో మనం చూసేది మొదటి సృష్టి. యేసు పునరుత్థానంలో, కొత్త సృష్టియైన రెండవ సృష్టి ప్రారంభమైంది. కొత్తసృష్టి పాతసృష్టి కంటే శక్తివంతమైనది. ఆదికాండము 1లో మీరు చదివిన దానికంటే యోహాను 20లో మీరు చదివినది శక్తివంతమైనది. ఈ విశ్వంలో ఇప్పటివరకు చూసిన శక్తి యొక్క వ్యక్తీకరణలలో క్రీస్తు పునరుత్థానమే గొప్ప వ్యక్తీకరణ. నైతికశక్తి భౌతికశక్తి కంటే గొప్పది.

దేవుడు మనం ఆ శక్తిని అనుభవించాలని కోరుకుంటున్నాడనే వాస్తవంపై మనకు ప్రత్యక్షత ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఆ శక్తిని మన అంతర్గత జీవితంలో ముందుగా అనుభవించాలని అతను కోరుకుంటున్నాడు. తరువాత మనం దానిని ఒక రోజు మన శరీరాలలో కూడా అనుభవిస్తాము. దేవుని పని ఎల్లప్పుడూ లోపలి నుండే ప్రారంభమవుతుంది. ఒక రోజు మన శరీరాలలో క్రీస్తు పునరుత్థాన శక్తిని అనుభవిస్తాము. నేడు మన ఆత్మలో ఆ పునరుత్థాన శక్తిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పునరుత్థాన శక్తి అనేది మనల్ని ఆత్మీయ మరణం నుండి పైకి లేపే శక్తి. పాప నియమం మనల్ని ఆత్మీయ మరణానికి కృంగదీస్తుంది. పునరుత్థాన శక్తి దానికి వ్యతిరేకంగా మనల్ని పైకి లేపుతుంది.

పాప నియమం నుండి పునరుత్థాన శక్తి మనల్ని పైకి లేపడం, నేను గురుత్వాకర్షణ నియమానికి వ్యతిరేకంగా ఒక పుస్తకాన్ని ఎత్తడం లాంటిది (ఇది దానిని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది). పునరుత్థాన శక్తి మనల్ని పరలోక ప్రదేశాలకు ఎత్తుతుంది. మనం మన పాపాలలో చనిపోయినప్పుడు, ఈ శక్తి మనల్ని పైకి లేపి, పరలోక ప్రదేశాలలో క్రీస్తుతో కూడా కూర్చోబెట్టిందని ఎఫెసీ 2:1-6లో మనం చదువుతాము. కొందరు ఇది ఊహాజనితమైనదని అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఇది ముమ్మాటికి నిజం. ఇది నిజమని మీరు నమ్మకపోతే, మీరు దీని ప్రయోజనాలను ఎప్పటికీ పొందలేరు - ఎందుకంటే మన విశ్వాసం యొక్క కొలత ప్రకారం మనం పొందుతాము. దేవుడు సత్యవంతుడు మరియు ప్రతి మనిషి అబద్ధీకుడిగా ఉండనివ్వండి. మన మనోభావాలన్నీ మోసపూరితమైనవి. మన దృష్టి కూడా మనల్ని మోసం చేయగలదు.

సూర్యుడు అస్తమించడాన్ని చూస్తున్న ఇద్దరు చిన్న పిల్లల కథ ఉంది. 12 సంవత్సరాల వయసున్న పెద్ద అబ్బాయి ఇలా అన్నాడు, "అదిగో, సూర్యుడు కదిలాడు. ఉదయం తూర్పున ఉన్నాడు, ఇప్పుడు పశ్చిమాన ఉన్నాడు." 6 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లవాడు ఇలా అన్నాడు, "లేదు. నాన్న మనకు చెప్పింది నీకు గుర్తుందా. కదులుతున్నది సూర్యుడు కాదు. భూమి దాని అక్షం మీద తిరుగుతుంది." పెద్ద పిల్లవాడు ఇలా అన్నాడు, "నేను చూసేదాన్ని మరియు నేను అనుభూతి చెందేదాన్నే నేను నమ్ముతాను. నేను తూర్పున సూర్యుడిని చూశాను, ఇప్పుడు అది పశ్చిమాన ఉంది. భూమి నా కాళ్ళ కింద తిరుగుతున్నట్లు నాకు అనిపించలేదు. అది స్థిరంగా ఉంది." చిన్న పిల్లవాడు ఇలా అన్నాడు, "నేను నాన్నను నమ్ముతాను."

ఎవరు సరైనవారు - తన తండ్రిని నమ్మినవాడా, లేదా తాను చూసిన మరియు అనుభూతి చెందిన దాన్ని నమ్మినవాడా? చాలా మంది క్రైస్తవులు కూడా వారు చూసే మరియు అనుభూతి చెందే దాని ప్రకారం జీవిస్తారు. కానీ మన ఇంద్రియాలు మనల్ని మోసం చేయగలవు. కాబట్టి నేను నా పరలోక తండ్రిని నమ్ముతాను; నేను దానిని చూడలేకపోయినా లేదా అనుభూతి చెందకపోయినా ఆయన చెప్పేది ఎల్లప్పుడూ సరైనదే.

కాబట్టి నేను క్రీస్తులో లేపబడి పరలోక ప్రదేశాలలో ఉంచబడ్డానని దేవుడు చెప్పేది నేను నమ్ముతాను. నా భావాలు నాకు ఏమి చెబుతున్నాయో నేను పట్టించుకోను. నా భావాలు నా చూపువలె మోసపూరితమైనవని నాకు తెలుసు. నా పరలోక తండ్రి చెప్పేది నేను నమ్మినప్పుడు, నా జీవితంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని నేను కనుగొన్నాను. మనం మన పరలోక తండ్రిని నమ్మనప్పుడు, మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ అద్భుతమైన పునరుత్థాన శక్తి అందరికీ అందుబాటులో లేదని, నమ్మేవారికి మాత్రమే అందుబాటులో ఉందని ఇక్కడ మనకు చెప్పబడింది. మీరు దీనిని నమ్మకపోతే, మీరు ఈ శక్తిని అనుభవించలేరు. యేసు తోమాతో, "చూడక నమ్మిన వారు ధన్యులు" అని అన్నాడు (యోహాను 20:29). నేను అలాంటి వారిలో ఒకడిని.