WFTW Body: 

దేవుడు మన బలాన్ని, గర్వాన్ని విరుగగొట్టే మరొక మార్గం నాయకుల ద్వారా మనల్ని సరిదిద్దడం. దిద్దుబాటును స్వీకరించటం విశ్వాసులందరికీ కష్టమైన విషయమే. రెండు సంవత్సరాల బిడ్డకు కూడా దిద్దుబాటును స్వీకరించుట కష్టమే - బహిరంగముగా దిద్దబడటం ఇంకా కష్టము.

నీవు బహిరంగ దిద్దుబాటును సంతోషంగా స్వీకరించి ఎంతకాలమైంది? కనీసం ఒక్కసారైనా నీ జీవితంలో దానిని అంగీకరించావా? లేని పక్షంలో, నీవు ఆత్మీయ అధికారలోపం కలిగి ఉండుట ఆశ్చర్యమేమి కాదు.

పేతురు, ఇస్కరియోతు యూదాల మధ్యగల ఒక పెద్ద వ్యత్యాసము ఇదే. సిలువను తప్పించుకొనమని పేతురు అవివేకముగా ప్రభువుతో చెప్పిన మాటలకు ఆయన బహు కఠినముగా గద్దించాడు, "సాతానా నా వెనుకకు పొమ్ము". యేసుప్రభువు ఎన్నడైనా ఏ మనిషినైనా ఇంత గట్టిగా గద్దించలేదు. పరిసయ్యులు కూడా "సర్పములారా" అని మాత్రమే పిలువబడ్డారు. కాని పేతురు "సాతానా" అని పిలువబడ్డాడు. ఆయన అతి సన్నిహితులకోసమే ఎంతో కఠినమైన గద్దింపులు దాచబడి ఉన్నాయి. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారినే ఎక్కువగా గద్దిస్తాడు (ప్రకటన 3:19).

దాని తర్వాత వెంటనే చాలా మంది శిష్యులు ప్రభువు బోధకు అభ్యంతరపడి ఆయన్ను విడిచి వెళ్తుండగా మిగిలిన శిష్యులను "మీరుకూడా వెళ్ళిపోతారా" అని యేసు అడిగాడు. అప్పుడు యేసుప్రభువుకు జవాబిచ్చింది పేతురే, "ప్రభువా, ఎవరియొద్దకు వెళ్ళెదము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు" (యోహాను 6:60,66-68). పేతురు విన్న నిత్యజీవపు మాటలు ఏవి? "సాతానా నా వెనుకకు పొమ్ము"!.

దిద్దుబాటు కోసం వినియోగించిన మాటలు నిత్యజీవానికి నడిపే మాటలుగా మనం చూస్తున్నామా?

దిద్దుబాటును పేతురు ఆ విధంగా చూశాడు. అదే తనను తర్వాత అతను ఏమయ్యాడో అలా అయ్యేటట్లు చేసింది.

ప్రభువు నుండి దిద్దుబాటు అంగీకరించిన మరో సందర్భంకూడా పేతురు జీవితంలో ఉంది. చివరి ప్రభురాత్రి భోజన బల్ల దగ్గర పేతురు ప్రభువుతో మిగిలిన శిష్యులందరు వెళ్ళిపోయినా తాను మాత్రం ప్రభువును విడిచి వెళ్ళనని చెప్పాడు. ప్రభువు వెంటనే, మరో 12గంటల్లో పేతురు ప్రభువును మూడుసార్లు ఎరుగనని చెబుతాడని జవాబిచ్చాడు. యేసుప్రభువు చెప్పిన ఆ మాటకు పేతురు మనసులో నొచ్చుకోలేదు. ఇటువంటి మనిషినే చివరకు ప్రభువు తన ప్రధాన అపొస్తలునిగా, పెంతెకోస్తు రోజు ప్రభువు రాయబారిగా తయారు చేశాడు.

దిద్దుబాటు ప్రక్రియకు పేతురు దీనుడైనందుచేత దేవుడతణ్ణి హెచ్చించాడు. తన సొంత అనుభవం ద్వారా నేర్చుకున్న పేతురు ఇప్పుడు మనం కూడా ఎల్లప్పుడు దీనులముగా తగ్గించుకోవాలని 1పేతురు 5:5-6లో మనకు హెచ్చరిస్తున్నాడు. మనల్ని మనం తగ్గించుకోవటం వలన మనకు వచ్చే నష్టమేమి లేదు. ఒకానొక రోజున దేవుడు మనలను హెచ్చిస్తాడు.

దిద్దుబాటుకు పేతురు ప్రదర్శించిన వైఖరికి విరుద్ధమైన ఇస్కరియోతు యూదా వైఖరి చూడండి. ఖరీదైన అత్తరును ఒక స్త్రీ యేసుప్రభువు తలమీద పోసినప్పుడు, డబ్బును అలా వృధాచేయక ఆ అత్తరును అమ్మి వచ్చిన సొమ్మును పేదలకు ఇవ్వవచ్చును గదా అని ఇస్కరియోతు యూదా అన్నాడు (యోహాను 12:5; మత్తయి 26:10-13). యేసుప్రభువు యూదాను అతి మృదువుగా సరిదిద్దాడు - ఆ స్త్రీ చేసిన పని చాలా మంచిదని ఆమెను ఏమీ అనవద్దని చెప్పాడు. అయితే యూదా నొచ్చుకున్నాడు.

వెంటనే యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో కలిసి యేసుప్రభువును అప్పగించుటకు ఒప్పుకున్నట్లు ఆ క్రింది వచనంలోనే మత్తయి 26:14 చదువుతాము. ఈ సమయ సందర్భము అతిప్రాముఖ్యము. యేసుప్రభువు తనను బహిరంగంగా సరిదిద్దినందుకు యూదా అభ్యంతరపడ్డాడు.

యేసుప్రభువు యూదాతో చెప్పిందల్లా ఆ స్త్రీ చేసిన పని గురించి అతని అంచనా సరియైనది కాదని మాత్రమే. అయితే అతణ్ణి నొప్పించుటకు అది చాలు. నీవు విరిగిన అనుభవానికి రాని పక్షంలో నిన్ను నొప్పించేందుకు ఒక చిన్న విషయం చాలు.

అయితే యూదా ప్రతిచర్యకు ఫలితంగా కలిగిన నిత్యత్వ పర్యవసానాలు గమనించండి. అదే సమయంలో పేతురు ప్రతిచర్యకు లభించిన నిత్యత్వ ఫలితాలు చూడండి. ఇద్దరూ దిద్దుబాటు ద్వారా పరీక్షించబడ్డారు - ఒకరు ఉత్తీర్ణులయ్యారు, మరొకరు తప్పిపోయారు.

ఇదేవిధంగా ఈనాడు మనం కూడా పరీక్షించబడుతున్నాము.

బహిరంగ దిద్దుబాటు మనల్ని నొప్పింపజేస్తే మనం మనుషుల ఘనత కోరుకుంటునట్లు అది రుజువు. అలాంటప్పుడు అటువంటి తప్పుడు ఘనతను ఆశించే గుణము నుండి మనల్ని మనం శుద్ధి చేసుకునేందుకు ఈ సత్యాన్ని మనం ఇప్పుడే తెలుసుకొనుట మంచిది. మనుష్యుల అభిప్రాయాలకు మనమెంతగా దాసులమైపోయామో చూపించుటకు అటువంటి పరిస్థితిని దేవుడే అనుమతించి ఉండొచ్చు. ఇప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకొని విడుదల పొందవచ్చు.

ప్రభువు తన ఆత్మ ద్వారా నేరుగా మనల్ని సరిదిద్దినా, మరొకరి ద్వారా సరిచేసినా అన్ని సమయాల్లోను మనం దిద్దుబాటుకు పేతురులాంటి వైఖరి కలిగి ఉందాము. ఇది మనందరికీ నిత్యజీవమార్గం. మనల్ని మనం తగ్గించుకుంటే మనం దేవుని కృప పొందుతాము మరియు సరియైన సమయంలో దేవుడు మనలను హెచ్చిస్తాడు.