WFTW Body: 

మన ఆధ్యాత్మిక విద్యలో మన భూసంబంధమైన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ముందు మనం ఉత్తీర్ణత సాధించవలసిన కోర్సులలో అనారోగ్యం ఒకటి. మనకు ముందు నడచిన యేసు కూడా ఈ కోర్సులో పట్టభద్రుడయ్యాడు. పక్షపాతం లేని మనస్సుతో మనం లేఖనాలను చూద్దాం:

యెషయా 53:3 ఇలా చెబుతోంది, "ఆయన మనుష్యులచే తృణీకరించబడ్డాడు మరియు తిరస్కరించబడ్డాడు, అనారోగ్యాన్ని ఎరిగి మరియు బాధ అనుభవించిన వ్యక్తి అయ్యాడు" (హోల్మన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్).

ఈ భూమిపై శాపం కారణంగా మనిషికి అనారోగ్యం వస్తుంది. ఫలితంగా మనకు చెమటలు పడతాయి, ముళ్ళు మొదలైన వాటితో బాధపడతాము (ఆది.కా. 3:17-19 చూడండి). యేసు పాపంతో శాపగ్రస్తమైన ఈ భూమికి వచ్చినప్పుడు, ఆయన శరీరానికి కూడా చెమటలు పట్టాయి, ఆయన శరీరం ముళ్ళతో గాయపడింది - మరియు ఆయన కూడా కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నాడు. యేసు "వ్యాధిననుభవించిన వాడు" అని బైబిల్ చెబుతోంది (యెషయా 53:3 - చివరలో ఉన్న గమనిక చూడండి).

మనం భౌతికంగా అనుభవించేవన్నీ అనుభవించాలంటే, యేసు కూడా అనారోగ్యాన్ని అనుభవించవలసి ఉంది. అలాంటి బాధ ఆయన భూసంబంధమైన విద్యలో ఒక భాగం (హెబ్రీ 5:8). యేసు కూడా మనలాగే అన్ని విషయాలలో శోధించబడ్డాడనే వాస్తవాన్ని తెలుసుకోవడం (హెబ్రీ 4:15) మనం తీవ్రంగా శోధించబడినప్పుడు మనకు ఓదార్పునిచ్చినట్లే, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మనకు ఎంతో ఓదార్పునిస్తుంది.

కాబట్టి మన ఆధ్యాత్మిక విద్యలో భాగంగా "అనారోగ్యమును అనుభవించుటకు" కూడా దేవుడు అనుమతిస్తాడు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, "ఆయన జయించినట్లు మనం జయించాలని" ప్రభువు కోరుకుంటున్నాడు - ఎటువంటి స్వీయ జాలి కలిగి ఉండకుండా, సానుభూతి కోసం వెతకకుండా, ఎవరిపై ఎలాంటి డిమాండ్ చేయకుండా, ఎప్పుడూ గొణుగుతు లేదా దిగులుగా ఉండకుండా, ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా మరియు ఉల్లాసంగా, ప్రభువును స్తుతిస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలని ఆయన కోరుతున్నాడు (ప్రక 3:21). మనం భూమిపై ఉన్నన్ని రోజులు అలానే జీవిద్దాం. అందుకు ఆయన కృప సరిపోతుంది.

యేసు కూడా కొన్ని సమయాల్లో జబ్బుపడ్డాడనే వాస్తవం, అనారోగ్యం ఎల్లప్పుడూ పాపం వల్ల కాదని నిశ్చయంగా రుజువు చేస్తుంది - ఎందుకంటే యేసు పాపం లేనివాడు. మన శోధనల పట్ల మాత్రమే కాకుండా మన అనారోగ్యాల పట్ల కూడా సానుభూతి చూపగల అద్భుతమైన మరియు మనకు ముందునడిచే యేసు మనకున్నందుకు ప్రభువును స్తుతిద్దాం!.

పౌలు మరియు అతని తోటి పనివారైన తిమోతి, ఎఫప్రొదితు మరియు త్రోఫిము కూడా భూమిపై వారి ఆధ్యాత్మిక విద్యలో ఈ "అనారోగ్యం" అనే కోర్సులో పట్టభద్రులయ్యారు (2కొరింథీ 12:7-9; 1తిమోతి 5:23; ఫిలిప్పి 2:27; 2తిమోతి 4:20).

ఒకసారి దేవుడు పౌలును అనారోగ్యంతో గలతీయ ప్రాంతంలో ఆపాడు. ఎందుకంటే అక్కడ పౌలు సువార్త ప్రకటించాలని మరియు సంఘాలను స్థాపించాలని ఆయన కోరుకున్నాడు. పౌలు మొదట్లో గలతీయ గుండా చిన్న ఆసియాకు వెళ్లాలని అనుకున్నాడు, కానీ గలతీయ నుండి వెళ్లకుండా "పరిశుద్ధాత్మచే నిరోధించబడ్డాడు" అని మనం చదువుతాము (అ.కా. 16:6). ఒక అతీంద్రియ దర్శనం ద్వారా ఈ ఆత్మయొక్క నిరోధం కలగలేదు, కానీ దేవుడు పౌలును గలతీయలో అనారోగ్యంతో ఉండుటకు అనుమతించాడు, తద్వారా అతను ప్రయాణం చేయలేక నిరోధించబడ్డాడు. అతను గలతీయ క్రైస్తవులకు రాసిన లేఖలో మనం దీనిని స్పష్టంగా చూస్తాము, అక్కడ గలతీయలో వారికి బోధించడానికి ఆగిపోవడానికి కారణం అతని అనారోగ్యమేనని చెప్పాడు (గలతీ 4:13-15).

దేవుడు మనకు అనారోగ్యమును (కొన్నిసార్లు) అనుమతించడానికి మరొక కారణం ఏమిటంటే, ప్రపంచంలోని అనారోగ్యంతో ఉన్న ఇతరుల పట్ల మనం మెరుగ్గా సానుభూతి చూపగలము. లేకుంటే ప్రపంచంలోని చాలా మంది దేనిగుండా వెలుతున్నారో మనకు ఏమీ తెలియదు.

దేవుడు తన దయతో మనలను స్వస్థపరుస్తాడు కూడా (ఫిలిప్పీ 2:25-27). దేవుడు యేసుపట్ల శ్రద్ధ వహించినట్లే మనపట్ల కూడా శ్రద్ధ వహిస్తాడు. కాబట్టి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థత కోసం అడగవచ్చు.

కానీ మనం పాపం నుండి సంపూర్ణ స్వేచ్ఛను పొందినట్లుగా అనారోగ్యం నుండి సంపూర్ణ స్వేచ్ఛను పొందలేము.

మన మొత్తం వ్యక్తి అంటే ఆత్మ, ప్రాణం మరియు శరీరం యొక్క విముక్తి కోసం యేసు మరణించాడా? అవును, ఆయన ఖచ్చితంగా చేశాడు.

కానీ మనం భ్రమ మరియు మాయ ప్రపంచంలో జీవించకుండా వాస్తవికతను ఎదుర్కోవాలి.

ఇప్పుడే క్రీస్తు విమోచన ప్రభావం తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క ఆత్మలో మాత్రమే ప్రారంభమైంది. మన ఆత్మలో, మనం మృతులలో నుండి లేపబడి ఒక క్రొత్త సృష్టిగా చేయబడ్డాము (ఎఫెసీ 2:1-6; 2కొరింథీ 5:17).

కానీ మన ప్రాణం (మనస్సు, భావోద్వేగం, చిత్తం) మరియు శరీరం ఇంకా కొత్తవి కాలేదు. ఈ రెండు విషయాలలో సిలువపై క్రీస్తు చేసిన పని యొక్క పూర్తి ప్రయోజనాన్ని మనం ఇంకా పొందవలసి ఉంది. మన విలువలను ప్రపంచ దృక్కోణం నుండి దేవునికి దృక్కోణంలోకి మార్చడానికి పరిశుద్ధాత్మను అనుమతించినట్లయితే మన మనస్సు నెమ్మదిగా మరియు క్రమంగా పునరుద్ధరించబడుతుంది (రోమా 12:2).

అయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మన శరీరం రూపాంతరం చెందుతుంది (ఫిలిప్పీ 3:21 దీనిని చాలా స్పష్టంగా పేర్కొంది). క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, మన శరీరం అనారోగ్యం మరియు మరణం లేని పూర్తి పునరుత్థాన జీవితాన్ని అనుభవిస్తుంది. దేవుడు మన శరీరంలో అప్పుడప్పుడు (హెబ్రీ 6:5) ఆయన అతీంద్రియ స్వస్థత శక్తిని రుచి చూపించటం ద్వారా "రాబోయే యుగం యొక్క శక్తులను" కొంచెం రుచి చూడడానికి తన దయతో మనకు అనుమతిస్తున్నాడు. ఈ విధంగా అనేకమంది విశ్వాసులు తమ అనారోగ్యాల నుండి అతీంద్రియంగా స్వస్థతను అనుభవించారు. అందుకే దేవుడు క్రీస్తు శరీరంలో కొందరికి స్వస్థత మరియు అద్భుతాలను చేయు వరాల్ని ఇచ్చాడు.

కానీ శరీరం యొక్క స్వస్థత పూర్తిగా దేవుని సార్వభౌమ సంకల్పంలో ఉంది. ఎవరిని స్వస్థపరచాలో మనం ఆయనకు నిర్దేశించలేము. పశ్చాత్తాపం, ఒప్పుకోలు మరియు మన కోసమైన క్రీస్తు మరణంపై విశ్వాసం ద్వారా మన పాపాలన్నిటికి క్షమాపణ పొందినట్లుగానే, మనకు నచ్చినప్పుడల్లా, ఒక హక్కుగా, ఇక్కడ ఇప్పుడు మనం స్వస్థతను పొందుకోలేము.

స్వస్థతను మనం హక్కుగా పొందుకోలేము మరియు మనం రక్షింపబడినప్పుడు మన శరీరాలపై శాపం యొక్క ప్రభావం తీసివేయబడలేదు అనేదానికి స్పష్టమైన రుజువు ఏమిటంటే, ప్రజలు ఎంత ప్రార్థించినా, స్వస్థత మరియు జీవం పొందారని చెప్పినప్పటికీ, విశ్వాసులందరూ చివరకు చనిపోతారు. చెమట, శారీరక అలసట మరియు నిద్రలేమి లాగా అనారోగ్యం మరియు మరణం భూమిపై శాపానికి సంబంధించిన ఫలితాలే. క్రీస్తు తిరిగి వచ్చే వరకు ఇవన్నీ మన శరీరాలను ప్రభావితం చేస్తాయి. మన ఆత్మలు ఇప్పటికే శాపం నుండి విమోచించబడినప్పటికీ (గలతీ 3:13,14), మన శరీరం ఒక ధూళిగా ఉండుటవలన, భూమి యొక్క ధూళిపై శాపం కారణంగా ఇప్పటికీ ప్రభావితమవుతుంది.

"అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది" అని చెప్పే యెషయా 53:5 గురించి ఏమిటి? ఆ వచనానికి మన స్వంత వివరణ ఇవ్వకుండా, క్రొత్త నిబంధనలో ఈ వచనానికి పరిశుద్ధాత్మ స్వయంగా ఇచ్చిన వివరణను చూద్దాం: 1 పేతురు 2:24లో మనం ఇలా చదువుతాము, "మనము పాపమునకు చనిపోయి నీతి కొరకు జీవించునట్లు ఆయన తానే మన పాపములను సిలువపై తన దేహములో భరించెను; ఆయన గాయాల ద్వారా మీరు స్వస్థత పొందారు."

ఇక్కడ ప్రస్తావించబడిన "స్వస్థత" "పాపం నుండి స్వస్థత" అని మరియు ఫలితంగా మనం పొందే "ఆరోగ్యం" "నీతి" అని ఈ వచనం నుండి స్పష్టంగా తెలుస్తుంది. పాపం చేయని యేసును అనుసరించడం గురించి మాట్లాడుతున్న వాక్యభాగ సందర్భంలో ఈ వచనం కనుకొనడం ఈ విషయాన్ని మరింత రుజువు చేస్తుంది.

మత్తయి 8:16,17లో ఎత్తి వ్రాయబడిన, "నిశ్చయంగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించెను" అని చెప్పే యెషయా 53:4 గురించి ఏమిటి: " సాయంత్రం అయినప్పుడు వారు దయ్యాలు పట్టిన అనేక మందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు;ఆయన ఒక్క మాటతో దురాత్మలను వెళ్ళగొట్టాడు,అనారోగ్యంతో ఉన్న వారందరినీ స్వస్థపరిచాడు.యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన 'ఆయన తానే బలహీనతలను తీసికొని మన రోగములను భరియించెను' అను మాట నెరవేరుటకు ఇది జరిగింది".

ఈ పేరాలోనే, యేసు పరిచర్య ప్రారంభంలో ఈ ప్రవచనం అప్పుడే అక్కడే నెరవేరిందని స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది వాదించినట్లుగా, తరువాత యేసు సిలువపై మరణించినప్పుడు అది నెరవేరలేదు. యేసు రోగులను స్వస్థపరచినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. ఇది యేసు సిలువపై మన రోగాలన్నింటినీ తీసివేసాడనే వాగ్దానం కాదు.

కాబట్టి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమి చేయాలి? మనం పౌలు మాదిరిని అనుకరిద్దాం. అతను తన "శరీరంలో ముల్లు" నుండి స్వస్థత కోసం ప్రార్థించాడు. ఆ ముల్లు తీసివేయబడదని, కానీ అతను దానిని అధిగమించడానికి దేవుని కృపను పొందుతాడనే విషయాన్ని దేవుడు తనతో చెప్పడం అతను విన్నాడు (2కొరింథీ 12:7-9). ఎపఫ్రొదితు విషయంలో, పౌలు ప్రార్థిస్తూనే ఉన్నాడు మరియు దేవుడు కనికరంతో అతన్ని పూర్తిగా స్వస్థపరిచాడు (ఫిలిప్పీ 2:27). అయితే త్రోఫిము విషయంలో, పౌలు ప్రార్థన చేసినప్పటికీ, అతను స్వస్థత పొందలేదు (2తిమోతి 4:20). తిమోతి విషయానికొస్తే, పౌలు అతని కోసం అనేకసార్లు ప్రార్థించి ఉండాలి. కానీ తిమోతి తన కడుపు వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి పౌలు చివరకు ద్రాక్షారసాన్ని ఔషధంగా తీసుకోమని చెప్పాడు (1తిమోతి 5:23).

కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రతి అనారోగ్యం నుండి స్వస్థత కోసం ప్రార్థించాలి, నయం చేయడం దేవుని చిత్తం కాకపోతే, ఆయన మనకు కృపను ఇవ్వాలి - ఈ రెండింటిలో ఆయన ఏది నిర్ణయించినా అదే మనకు మంచిది.

ఇది లేఖనాల సమతుల్యమైన బోధన. మనం సత్యాన్ని ప్రేమిస్తే, స్వస్థత విషయంలో వారు ఎటువంటి వేదాంత పరమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క క్రైస్తవ సమూహంలో అనారోగ్యం పాలైన విశ్వాసులు ఉన్నారని మనం గమనించవచ్చు. కానీ చాలా మంది పక్షపాతంతో ఉన్నందున ఈ వాస్తవానికి వారి కళ్ళు మూసుకున్నారు.

వినుటకు చెవులు గలవాడు వినునుగాక.

------------

*గమనిక: యెషయా 53:3లోని "దుఃఖములు(శోకాలు)" (చాలా ఆంగ్ల అనువాదాలలో) అని అనువదించబడిన హీబ్రూ పదం "ఖోలీ" (Choliy) వాస్తవానికి "అనారోగ్యం" లేదా "వ్యాధి" అని అర్ధమిస్తుంది. అదే పదం ద్వితీ 7:15, 28:61 మరియు యెషయా 1:5లో "అనారోగ్యం(వ్యాధి)" అని సరిగ్గా అనువదించబడింది. కానీ చాలా మంది అనువాదకులు బహుశా యేసు ఎప్పుడైనా అనారోగ్యం పాలవవచ్చు అన్న విషయాన్ని నమ్మలేకపోయారు కాబట్టి వారు యెషయా 53:3లోని పదాన్ని ఖచ్చితంగా అనువదించలేదు. బదులుగా, వారు ఈ హీబ్రూ పదాన్ని వారి స్వంత వేదాంతాన్ని అనుసరించి "దుఃఖములు(శోకాలు)" అని అనువదించారు!! కేవలం హోల్మన్ బైబిల్ మరియు యాంప్లిఫైడ్ బైబిల్ (పైన ఉదహరించినవి) మాత్రమే ఈ హీబ్రూ పదానికి సరైన అనువాదాన్ని "అనారోగ్యం"గా ఇవ్వడానికి సాహసించాయి. "ఖోలీ" (Choliy) అనే హీబ్రూ పదానికి అర్థం "అనారోగ్యం" అని స్పష్టమైన రుజువు అదే పదాన్ని తరువాతి వచనంలో (యెషయా 53:4) ఎలా ఉపయోగించారో చూసినప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ హీబ్రూలో, ఇది మళ్లీ "దు:ఖములు(శోకాలు)" అని అనువదించబడింది. కానీ ఈ వచనం కొత్త నిబంధన మత్తయి 8:17లో ఎత్తి వ్రాయబడినప్పుడు అది అక్కడ "అస్తెనియా"(astheneia; గ్రీకు పదం) అంటే వ్యాధులు/అనారోగ్యం అని అనువదించబడింది.