యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత బోధించిన మొదటి విషయం ఏమిటంటే, దేవుడు చెప్పే మాటలను మనం స్వీకరించకపోతే మనం జీవించలేము. మనం కేవలం ఆయనను సేవించుట ద్వారా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేము మరియు ఆయన హృదయాన్ని సంతృప్తిపరచలేము. చాలా మంది క్రైస్తవులు "నేను ప్రభువు కోసం దీన్ని చేస్తున్నాను", "నేను ప్రభువు కోసం దాన్ని చేస్తున్నాను", "నేను అనాథాశ్రమాన్ని నడుపుతున్నాను", "నేను బైబిల్ పాఠశాల నడుపుతున్నాను మరియు నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను," "అవసరంలో ఉన్న వారికి నేను డబ్బు ఇస్తున్నాను" మరియు "నేను ఇక్కడకు వెళ్లి ఆ పని చేస్తున్నాను" అని చెప్తూ సంతృప్తి పడుతున్నారు. వారు ప్రభువు కోసం ఏమి చేస్తున్నారో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. నేను దానిని తృణీకరించటం లేదు. 1కొరింథీ 15:58 లో, "స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి" అని చెప్పబడినట్లు ఆయన వచ్చేవరకు మనము ప్రభువును సేవించాలి. నా జీవితాంతం వరకు, క్రీస్తు వచ్చే వరకు, "ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తుడనై" ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రభువును సేవించడం మానేయాలని ఎప్పుడూ అనుకోను. కాబట్టి నేను దానిని తృణీకరించడం లేదు.
మనం తప్పక సేవ చేయాలి అని నేను నమ్ముతున్నాను, అయితే సేవ కంటే దేవుని వాక్యాన్ని స్వీకరించడం చాలా ముఖ్యం అని నేను చెప్తాను. "మనుష్యుడు దేవుని సేవ చేయడం ద్వారా మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు". యేసు అభిషేకించబడిన తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవి, కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవై ఉండాలి. యేసు బోధించిన అన్నిటిలో, ఇక్కడ మొదటి విషయం ఉంది: ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని నిరంతరం స్వీకరించడం నేర్చుకోండి. ప్రతిరోజూ లేఖనాలు మీకు సజీవమైనవిగా ఉండాలి.
తొలినాళ్లలో ఈనాటిలాగా ప్రజల వద్ద బైబిల్ లేదు. బైబిల్‌ను కలిగి ఉండటం మనం కలిగి ఉన్న ఆధిక్యత. మనం ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని పొందాలంటే, మనం ప్రతిరోజూ బైబిల్ చదవాలి. ప్రారంభ రోజుల్లో వారి వద్ద బైబిల్ లేనప్పుడు, వారు అపొస్తలుల నుండి విన్న వాటిని గుర్తుచేయుటకు వారు పరిశుద్ధాత్మను పొందారు. తన విశ్వాసం కారణంగా జైలుశిక్ష విధించబడి జైలులో కూర్చున్న బైబిల్ లేని క్రైస్తవుడు, తన ముందు బైబిల్ తెరిచి ఉంచకపోయినా ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని పొందగలడు, ఎందుకంటే అతను జైలులో లేని రోజులలో దానిని చదివాడు. అందుకే దేవుని వాక్యాన్ని చదవడం మరియు ధ్యానించడం చాలా ముఖ్యం, ఎందుకంటే మనకు అవసరమైన క్షణంలో, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన సమస్యకు పరిష్కారంగా ఉండే సరియైన వచనాన్ని అనుగ్రహిస్తాడు. అది మన అవసరానికి సమాధానం మరియు మనం స్వతంత్రించుకోగల వాగ్దానంగా ఉంటుంది.
ఇది లూకా 10:38-42లోని సందర్భంలో వివరించబడింది. మరియ, మార్తల ఇంట్లోకి యేసు ప్రవేశించడం గురించి మనం అక్కడ చదువుతాము. మార్త ఆయనను ఇంట్లోకి చేర్చుకుని, ఆయనకు ఆహారాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళింది, అయితే ఆమె సహోదరి మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట వింటోంది. మనం ఇంతకు ముందు చదివిన దానితో దీన్ని అనుసంధానించండి, "మనిషి ఆహారంతో మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతో జీవించగలడు." ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి, ఆహారం మరియు యేసు పాదాల వద్ద కూర్చోవడం. ఆహారం ముఖ్యమా? అవును, అది ముఖ్యమే. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని నోటి నుండి వచ్చే మాటను స్వీకరించడం. ఈ ఇద్దరు సహోదరీలలో ఇది చాలా స్పష్టంగా వివరించబడింది.
మార్త ఆహారాన్ని సిద్ధం చేయటంలో మునిగిపోయింది. ఎవరి కోసం? తనకోసం కాదు. ఆమె చాలా చాలా నిస్వార్థంగా ఉంది. ఆకలితో ఉన్న 13 మందికి (యేసు మరియు ఆయన పన్నెండు మంది శిష్యులు) ఆహారం వండటం ఎంత కష్టమో మీకు తెలుసా? ఆమె తన కోసం కాదు, ప్రభువు కోసం వంటగదిలో దూరంగా కష్టపడుతూ ఉంది. ఆమె తన డబ్బును వెచ్చిస్తూ, ప్రభువుకు ఆహారాన్ని సిద్ధం చేయడానికి బజారుకు వెళ్లి వస్తువులను తెచ్చుకుంది. ఆమె ప్రభువు కోసం పని చేయడానికి సమయం, డబ్బు, శక్తి వెచ్చిస్తూ త్యాగం చేసింది. బహుశా మీరు అలా ఉండవచ్చు. బహుశా మీరు సమయం, డబ్బు మరియు శక్తిని త్యాగం చేస్తూ ప్రభువు కోసం అక్కడక్కడ చాలా పనులు చేస్తున్నారు. మంచిదే. మార్త అనుకున్నట్లుగా మీరు ఇలా అనుకోవచ్చు, "ఇదిగో, నేను ఇవన్నీ చేసి, నేను ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన, ’భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు గొప్ప పని చేశావు!’ అని చెప్తాడు". కానీ ఆమె వినేది అది కాదు. ఆమె యేసు వద్దకు వచ్చినప్పుడు, ఆమె తన సహోదరి మరియపై లోలోపల అసహనంతో ఉంది. ఒక వ్యక్తి తన హృదయంలో విశ్రాంతిలో లేనప్పుడు, ఏదో తప్పు జరిగిందని అర్థం. ఆమె విశ్రాంతిలో లేదు. "మరియ ఎందుకు వచ్చి నాకు సహాయం చేయడం లేదు?" అని ఆలోచిస్తూ ఉంది. యేసు ఆమెను మందలించాడు. ఆయన, "మార్తా, ఆహారం చాలా ముఖ్యమైన విషయం కాదు. నా మాట వినడం చాలా ముఖ్యమైనది, మరియ దానిని ఎంచుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు" అని చెప్పాడు (లూకా 10:42). "మనిషి ఆహారంతో మాత్రమే జీవించడు" అని యేసు అన్నదాని అర్థం ఏమిటో మీరు చూశారా? యేసు మొదట మార్త నుండి ఏమి కోరుకున్నాడు? ఆ సేవ అంతటినా? యేసు మీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? సేవ చేయటం మంచిదే. మరియ యేసు పాదాలపై పరిమళాన్ని పోయడం ద్వారా సేవచేసిందని మనం తరువాత చదువుతాము. సేవ ముఖ్యమని మనకు తెలుసు; కానీ మొదటి, అత్యంత ముఖ్యమైన విషయం దేవుని వాక్యాన్ని స్వీకరించడం. యేసు బోధించినది అదే.
మనం ముందుగా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి, అవసరమైనది ఒక్కటే. 25 విషయాలు కాదు. లూకా 10:42, ప్రతిరోజూ యేసు పాదాల దగ్గర కూర్చోవాలని, ఎల్లప్పుడూ ఆ వైఖరిని కలిగి ఉండాలని మరియు ఆయన మనకు వ్యక్తిగతంగా చెప్పేది స్వీకరించాలని చెబుతుంది.
ఆశీర్వాదకరమైన కొత్త సంవత్సరాన్ని మీరు కలిగి ఉందురు గాక.