యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు (సామెతలు 1:7).
ఇది మొదటి సామెత. ఇది మొదటి సామెతగా ఉండుట చాలా ముఖ్యమైనది. జ్ఞానమునకు ఆరంభము ఇదే అని చెప్పినప్పుడు, అది పునాదిని సూచిస్తుందని మనం చెప్పవచ్చు. తరువాత సామెతలు 9:10 లో, "యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు(తెలివికి) మూలము" అని చెబుతుంది. జ్ఞానం మరియు తెలివి నిజంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి, ఎందుకంటే జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం కాదు. దేవుని జ్ఞానమని అది అర్థమిస్తుంది. మనం జ్ఞానం గురించి చదివినప్పుడు, అది బైబిల్ యొక్క బోధన జ్ఞానం కాదు. ఎందుకంటే ఆ జ్ఞానం అపవాది దగ్గర కూడా ఉంది, అయినప్పటికీ అతనికి ప్రభువు యెడల భయం లేదు. కాబట్టి సామెతలు 1:7, బైబిల్ జ్ఞానాన్ని సూచించడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పబడిన జ్ఞానం దేవుని జ్ఞానం! అది బైబిల్ జ్ఞానానికి చాలా భిన్నంగా ఉంటుంది.
బైబిల్ జ్ఞానం ఉన్న చాలా మందికి దేవుని జ్ఞానం లేదు. ప్రభువుయందలి భయమే జ్ఞానానికి ఆరంభం. "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే నిత్యజీవము" (యోహాను 17:3). దేవుడు ఎలాంటివాడో మరింత ఎక్కువగా తెలుసుకోవడం. పౌలు తన జీవితంలో తనకు గల గొప్ప కోరిక అదే అని చెప్పాడు: "...నేను ఆయనను తెలుసుకొనుటకు (ఎరుగు నిమిత్తం)..." (ఫిలిప్పీయులు 3:10,11). దాని అర్థం, అతడు దేవుణ్ణి అంతకంతకు మరింత ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ప్రజలను ఎలా చూస్తాడో, దేవుడు పరిస్థితులను ఎలా చూస్తాడో, దేవుడు వస్తువులను ఎలా చూస్తాడో మరింత ఎక్కువగా తెలుసుకొని తద్వారా పౌలు తన మనసును ఆ ఆలోచనా విధానానికి మార్చుకోగలడు. ఇక్కడ చెప్పబడిన జ్ఞానం అదే.
దేవుణ్ణి తెలుసుకోవడానికి మొదటి మెట్టు ఆయనకు భయపడటం, ఆయన పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం అని మొదటి సామెత చెప్తుంది. పాపాన్ని ద్వేషించాలి మరియు నీతిని ప్రేమించాలి. ఇదే దేవునికి భయపడటం. అప్పుడు మనం ఆయనను అంతకంతకు ఎక్కువగా తెలుసుకోగలం. అందుకే మనకు ఎంతగా తెలివితేటలు ఉన్నాయనేది ప్రశ్న కాదు, మనకు ఎంతగా దేవుని భయం కలిగి ఉన్నామో అదే మనం ఆత్మీయ జ్ఞానంలో మరియు తెలివిలో ఎంతగా ఎదుగుతామో నిర్ణయిస్తుంది.
అందుకే అది ప్రారంభంలోనే ఉంది - పునాది, మూలరాయి, మీరు దానిని ఏ విధంగా పిలిచినా సరే - ప్రభువుయెడల భయభక్తులు కలిగి ఉండుట. ఇది పరుగు యొక్క ప్రారంభ రేఖ. మీరు అక్కడికి చేరుకోకపోతే, మీరు ఎక్కడికీ చేరుకోలేరు. ఇది జ్ఞానమంతటి యొక్క సారాంశం అని కూడా మనం చెప్పవచ్చు. జ్ఞానమంతటియొక్క ప్రధాన భాగం దేవుని భయం, నేను దేవుని భయాన్ని కోల్పోయిన రోజు, నేను దేవుని గురించి లేదా జ్ఞానం గురించి ఇకపై ఎటువంటి అవగాహన పొందలేను. జ్ఞానంలో పెరుగుదలకు మార్గం దేవుని భయాన్ని పెంచుకోవడం. దేవుని గూర్చిన తెలివిలో పెరుగుదలకు మార్గం ప్రభువు భయాన్ని పెంచుకోవడం.
ఈ వచనం నుండి మూర్ఖుడు ఎవరో కూడా మనకు అర్థమవుతుంది. బైబిల్ ఒక మూర్ఖుడి గురించి మాట్లాడినప్పుడు, అది గణితంలో పదిహేనుశాతం మరియు విజ్ఞానశాస్త్రంలో పదిశాతం పొందిన వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. ఆ మార్కులు పొందిన వ్యక్తి కూడా దేవుని భయాన్ని కలిగి ఉంటే వారు లేఖనాల ప్రకారం జ్ఞానవంతుడు కావచ్చు. బైబిల్ ఒక మూర్ఖుడి గురించి మాట్లాడినప్పుడు, అది చదువురాని వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. అది ప్రభువు భయం లేని వ్యక్తి గురించి మాట్లాడుతోంది - స్త్రీలను మోహించి, దాని గురించి దుఃఖించకుండా, దాని గురించి ఏడవకుండా ఉండే వ్యక్తి గురించి మాట్లాడుతోంది. గణితంలో మరియు విజ్ఞానశాస్త్రంలో తొంభై శాతం వచ్చినా అతను మూర్ఖుడే! పూర్తిగా మూర్ఖుడు. ఈ వ్యక్తి గురించి సామెతల పుస్తకంలో సొలొమోను అరవై ఆరు విషయాలు వ్రాశాడు. పాపం విషయంలో, అబద్ధాలు చెప్పడం లేదా తప్పుడు ప్రకటనలపై సంతకం చేయడం లేదా అన్ని రకాల ఇతర పాపాలు చేయడం విషయానికి వస్తే - దేవుని పట్ల భయం లేని వ్యక్తి ఇతనే. అలాంటి వాటి గురించి తన హృదయంలో కలత చెందడు. అలాంటి మూర్ఖుల గురించి సొలొమోను అరవై ఆరు విషయాలు వ్రాశాడు.
జ్ఞానాన్ని మరియు ఉపదేశాన్ని తృణీకరించే వారు మూర్ఖులు. దేవుని దృక్కోణం నుండి విషయాలను చూడగలిగే అవగాహన వారికి ఉండదు. దేవుడు ప్రజలను, వస్తువులను మరియు ప్రపంచాన్నంతటిని ఎలా చూస్తాడో ఆవిధంగా చూడడమే జ్ఞానం అని మనం చెప్పగలం. నాకు ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, దేవుడు వారిని ఎలా చూస్తాడో - సున్నితత్వంతో, కరుణతో, ప్రేమతో మరియు స్వచ్ఛతతో అలాగే నేనూ ప్రజలను చూడాలి . నేను ప్రజలను మృదుత్వముతో, కరుణతో, ప్రేమతో మరియు పవిత్రతతో చూడలేకపోతే, నేను ఎంతగా బైబిల్ జ్ఞానంలో ఎదుగుతున్నా నాకు జ్ఞానం లభించడం లేదు (ఏ సందర్భంలోనైనా అపవాది నాకంటే ఎక్కువ బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు). తన జీవితంలో దేవునికి భయపడని, దేవుని పట్ల గౌరవం లేని, పాపాన్ని ద్వేషించని, నీతిని ప్రేమించని మూర్ఖుని గురించే బైబిల్ చెప్తుందని మనం ఇక్కడ గమనించాలి.
దేవునికి భయపడమని జ్ఞాన గ్రంథం మొదటగా నొక్కి చెప్పుట ఎంతో ప్రాముఖ్యమైనది. వినుటకు చెవులు గలవాడు ఆత్మ చెప్తున్న మాటలను వినునుగాక.