వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   పురుషులు Religious or Spiritual
WFTW Body: 

కయీను, బిలాము మరియు కోరహు అను ముగ్గురు వ్యక్తులు మతాసక్తి కలిగినవారేకాని ఆత్మీయులుకాదని యూదా పత్రికలో చెప్పబడినది (యూదా 11). ఒక్కొక్క ఉదాహరణ చూచెదము.

1. కయీను : కయీను దేవుని ఎరుగని వ్యక్తికాదు, కాని అతడు దేవునికి బలులర్పించుటను నమ్మిన లోతైన మతాసక్తి కలిగిన వ్యక్తి (ఆది 4:3). హేబెలు కూడా దేవునికి బలులర్పించాడు. కాని వారర్పించిన బలులకును, కయీను మరియు హేబెలుకు ఉన్న తేడా, పరలోకానికి మరియు నరకానికి ఉన్నంత తేడా ఉన్నది. అదే ఆత్మీయతకు మరియు మతాసక్తికి ఉన్న తేడా. ప్రజలు వెళ్ళుచున్న రెండు మార్గములకు అనగా ఆత్మానుసారత మరియు మతానుసారతకు కయీను, హేబెలు మాదిరిలుగా ఉన్నారు. దేవునికి కేవలము బాహ్యమైన వాటిని అనగా కానుకలిచ్చుట, పరిచర్యలుచేయుట, సమయమునిచ్చుట మొ||నవి చేయువారికి కయీను సూచనగా ఉన్నాడు. మరొకవైపు సూచన ప్రాయముగా గొఱ్ఱెపిల్లను బలిపీఠముమీద వధించి, హేబెలు తన్ను తానే బలీపీఠముమీద పెట్టుకొనియున్నాడు.

మతాసక్తి కలిగినవారు బహుమతులిస్తారు, ప్రార్ధన చేస్తారు మరియు అనేక మంచిపనులు చేస్తారు కాని తమ్మును తామే సజీవయాగముగా సమర్పించుకొనుటను ఎరుగరు. వారు దశమ భాగమును ఇవ్వచ్చునుగాని శోధన సమయములో తమ స్వంతమునకు చనిపోరు. క్రొత్త నిబంధన మరియు పాత నిబంధనకు ఇదే తేడా. స్వంతమునకు చనిపోకుండా పాత నిబంధనలోనికి ప్రవేశించవచ్చును. కాని స్వంతము(స్వచిత్తము)నకు చనిపోకుండా క్రొత్త నిబంధనలో ప్రవేశించలేము. ప్రభువైన యేసు దశమ భాగమిచ్చుటకు రాలేదుకాని తన్నుతానే దేవునికి ఇష్టమైన మరియు అంగీకారమైన బలిగా ఇచ్చుటకు వచ్చారు. దేవుని యొద్దకు వచ్చుటకు, ఇరుకుమార్గము మరియు విశాలమార్గములకు అనగా మతానుసారమైనదానికి మరియు ఆత్మానుసారమైనదానికి వీరిరువురు సూచనగా ఉన్నారు. స్వచిత్తమునకు చనిపోకుండా సేవకుడవు కాగలవు కాని కుమారుడవు కాలేవు.

హేబెలు అర్పణమీదకు పైనుండి అగ్ని వచ్చినదికాని కయీను అర్పణమీదకు ఏమియు రాలేదు. ఒకవ్యక్తి దినదినము తన స్వంతచిత్తమును ఉపేక్షించినయెడల, అతనిమీదకు మరియు అతని పరిచర్యమీదకు పరలోకమునుండి అగ్ని దిగి వచ్చును. ఆయన ఎవరి వేరునైతే నరుకునో వారిని, పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోను అభిషేకించునని, బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన నిజమైన బాప్తిస్మము. మరొకవైపు ఒక సహోదరుడు మంచి జీవితము కలిగియు మంచిపనులు చేయుచుండవచ్చునుగాని ఆ సహోదరుని జీవితములో పరలోకమునుండి అభిషేకము ఉండదు. ఉద్రేకములతో కూడిన సాతానిచ్చే నకిలీ "బాప్తిస్మము" (చాలామంది దానిలోనే ఆనందిస్తున్నారు), సిలువ మార్గమును ఎంచుకున్న ఆయన శిష్యులమీదకు పంపే నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పోలిస్తే అది పనికిరాని చెత్తగా ఉన్నది.

2. బిలాము: బిలాము మరియొక మతానుసారమైన వ్యక్తి. అతడు బోధకుడైయుండి దేవుని సేవించాలనుకుంటున్నాడుగాని డబ్బు సంపాదించాలని మరియు లోకములోని గొప్ప వారిని కలవాలని ఆసక్తి కలిగియున్నాడు (స.కా. 22 అధ్యాయము). ప్రభువు నామములో ధనము మరియు పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరియున్నాడు. ఈనాడు బిలాములాంటి అబద్ధప్రవక్తలు అనేకులు ఉన్నారు. అక్షరానుసారముగా వారి సిద్ధాంతములన్నియు మంచివే. కాని వారు బిలాము ఆత్మతో (ధనమును, ఘనతను ప్రేమించేవారు) ఉన్నారని, వివేచనలేని విశ్వాసులు గుర్తించుటలేదు. ఫిలిప్పీ 2:21 లో ఉన్నట్లు వీరు సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఇటువంటి బిలాము సిద్ధాంతముతో ఉన్నవారు పెర్గము సంఘములో ఉన్నారు (ప్రకటన 2:14). సంఘములో డబ్బును కోరుకొనుటకు మరియు ఘనతను కోరుకొనుటకు తేడా లేదు. ఇవిరెండు బిలాము ఆత్మకు చెందినవి.

3. కోరహు: కోరహు మాతాసక్తిగల వ్యక్తి. ఇతడు యాజకుడైన లేవీ గోత్రానికి చెందినవాడు(స.కా. 16 అధ్యాయము). ప్రభువు అతనికి ఇచ్చిన పరిచర్య విషయములో అతడు అసంతృప్తితో ఉన్నాడు. మోషేవలె ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలని ఆశించాడు. మతములో ఉండిన ఆ దురాశే అతనిని చివరకు నాశనమునకు నడిపించింది. అతడు మరియు అతని సహచరులైన దాతాను మరియు అబీరాము మరియు వారి కుటుంబములు సజీవముగా నరకములో పడిరని లేఖనములలో వ్రాయబడినది(స.కా. 16:32,33). దేవుడు తాను నియమించిన అధికారమునకు తిరుగుబాటుచేసినవారిని తీవ్రముగా (కఠినముగా) శిక్షించారు.

ఈనాడు అనేక సంఘపెద్దలు, బోధకులు మరియు పాస్టర్లు తమకు తామే నియమించుకొన్నారు. వారికి తిరుగుబాటు చేయుట పెద్దగా తీవ్రమయిన విషయముకాకపోవచ్చును. కాని దేవునిచేత నియమించబడినవారికి తిరుగుబాటుచేయుట, దేవునియొక్క తీవ్రమైన తీర్పును తెచ్చును. ఒక ఆత్మానుసారమైన వ్యక్తి కలలోకూడా అలా ఊహించడు. గనుక మతాసక్తి అటువంటి ఆత్మీయ బుద్ధిహీనత కలిగియుండును.

సంఘములో ఇతరులతో పోటీతత్వము కలిగిన వారికి ఇతడు సాదృశ్యముగా ఉన్నాడు. దేవునియెడల భయభక్తులు కలిగిన సహోదరుని నీవు మెచ్చుకొనలేనట్లయితే, నీవు కోరహు ఆత్మను కొంచెము కలిగియున్నావనుటకు ఋజువు. నీవు వారిని విమర్శించినయెడల, అప్పుడు నీవు పూర్తిగా కోరహు ఆత్మతో ఉన్నావు. ఇతరులు విమర్శించుటను నీవు వినుచున్నట్లయితే, అప్పుడు నీవు కోరహుతో కలసి దేవుని తీర్పునుపొందిన 250 మందిని పోలియుంటావు.

మతాసక్తి మరియు ఆత్మీయత అనువాటిని నీవు వివేచించనట్లయితే, నీవు ఎన్నటికీ ఆత్మీయుడవు కాలేవు. అది ఇప్పుడు ఎంతో అవసరము.