వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు శిష్యులు
WFTW Body: 

క్రొత్త నిబంధనలో ఒక నిజమైన దేవుని సేవకుడెవరో మనకు తెలియజేసే మూడు లేఖనభాగములు ఉన్నవి. మనము ఆ మూడు వాక్యభాగాలను ముందుగా ఏర్పరచుకొన్న ఎటువంటి అభిప్రాయాలు లేకుండా మనము చదివినప్పుడు, ఈనాడు, ఈ యుగములో, మనము కావాలనుకుంటే మనమందరము దేవుని సేవకులుగా ఉండవచ్చని మనము కనుగొనెదము. పాత నిబంధనలో, లేవీయులు మాత్రమే దేవుని సేవకులుగా ఉండగలిగిరి. వారు ఎటువంటి భూసంబంధమైన పనిని చేయకుండా నిషేధించబడిరి మరియు ఇశ్రాయేలీయుల యొక్క ఇతర గోత్రముల దశమ భాగములచేత వారు పోషించబడిరి. బబులోను సంబంధమైన క్రైస్తత్వము ఈనాడు క్రొత్త నిబంధనలో కూడా తమ లౌకికపరమైన ఉద్యోగాలను విడిచిపెట్టిన వారు మాత్రమే దేవుని సేవకులుగా ఉండగలరని బోధించును. కాని ఇది మనుష్యుని పారంపర్యాచారము యొక్క బోధయేగాని లేఖనముల యొక్క బోధకాదు.

1. పాపమునుండి విమోచన

"ఇప్పుడు పాపమునుండి విమోచించబడి దేవునికి దాసులైనందున" (రోమా 6:22).

ఇది మొదటి అవసరత- పాపమునుండి విమోచింపబడుట. పాపమునుండి విమోచించబడుట కంటే ఒకరి భూసంబంధమైన ఉద్యోగమును విడిచిపెట్టుట తేలిక. యేసు ఒక లౌకికపరమైన ఉద్యోగములో పనిచేసెను. కాని అప్పుడు కూడా ఆయన దేవుని సేవకునిగా ఉండెను.

కోపపడి తన నిగ్రహమును కోల్పోయే వ్యక్తి దేవుని సేవకుడు కాలేడు. అతడు ఒక బోధకుడై ఒక ముఖ్య కాపరియై ఉండవచ్చును కాని అతడు దేవుని సేవకునిగా ఉండలేడు. అనేకమంది కాపరులు "అన్యభాషలలో" ఆదివారపు ఉదయమున దేవునికి బిగ్గరగా స్తుతులు చెల్లింతురు. ఆ తరువాత అదే మధ్యాహ్నమున తమ మాతృభాషలో తమ భార్యల మీద కోపముతో అరిచెదరు. మనము అన్య భాషలలో మాట్లాడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మనలను నియంత్రించగలడా? కాని మన మాతృభాషలో మనము మాట్లాడినప్పుడు నియంత్రించలేడా? అది మోసము. నేను భాషలలో 22 ఏళ్ళపాటు మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెప్పుదును. అది నాకు క్షేమాభివృద్ధి కలుగజేసి, ఈ సంవత్సరములన్నియు నన్ను నిరాశ నుండి, నిరుత్సాహమునుండి దుఃఖము నుండి పూర్తిగా విడుదల చేసెను. కాని నేను నా మాతృభాషలో నా భార్యతో, నా సహోదరులతో, అపరిచితులతో, బిక్షగాళ్ళతో మాట్లాడునప్పుడు కూడా పరిశుద్ధాత్మ నా భాషను నియంత్రించుటను బట్టి నేను దేవునికి వందనాలు చెప్పుచున్నాను.

తన కళ్ళతో స్త్రీలను మోహించువాడు సువార్తను ప్రకటించువానిగా లేక దేవుని సేవకునిగా కాలేడు. పాపమును చేయకుండుటకు తన కంటిని సహితము పెరికివేయుటకు సిద్ధముగానున్నంత తీవ్రముగా నుండేవాడే దేవుని సేవకుడు కాగలడు. మీరు చివరిసారిగా మీ కళ్ళ విషయంలో పాపముచేసినందున రాత్రిపూట మీ దిండు మీద కన్నీళ్ళు విడచినది ఎప్పుడు? మీరు ఈ విషయమును తేలికగా తీసుకొన్న యెడల, మీ అంతరంగములో మీరు కొద్ది కొద్దిగా దిగజారి ఒక రోజు బహిరంగముగా పడిపోవుదురు.

తన కొరకు కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించుకొనుటకో లేక కొద్ది ఘనతను సంపాదించుకొనటకో అబద్ధము చెప్పు ఒక వ్యక్తి నిజానికి అపవాది యొక్క సేవకుడు - ఎందుకనగా అపవాది అబద్ధమునకు జనకుడైయున్నాడు. అతడు దేవుని సేవకుడు కాలేడు.

తన శత్రువులందరినీ ప్రేమించలేనివాడు లేక తనకు హాని చేసినవారికి మంచిచేయలేనివాడు సువార్తను ప్రకటించుటకు పూర్తిగా అనర్హుడు. మీకు ఎవరికి వ్యతిరేకముగానైనా కొంచెమైనా కోపముగాని క్షమించలేనితనముగాని మీ హృదయములో నున్నయెడల, మీరు చేయగలిగిన ఉత్తమమైన పని మీ నోరు మూసుకొని, ఇంటికివెళ్ళి, మారుమనస్సు పొంది, ఆ పాపములనుండి మీ హృదయములను శుభ్రపరచుకొనుటయే. మీరు దేవుని సేవకులుగా ఉండలేరు.

2. సిరినుండి విడుదల

"ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను" (లూకా 16:13).

ఇది రెండవ అవసరత - సిరి నుండి (డబ్బునుండి సమస్త భౌతికమైన వాటినుండి) విమోచించబడుట. మరలా చెప్పాలంటే, సిరినుండి విడుదల పొందుటకంటే ఒకరి లౌకికపరమైన ఉద్యోగమునుండి విడుదల పొందుట తేలిక. మీరు ఎవరిని సేవించబోవుచున్నారో అనుదానిని మీరు ఎన్నుకోవలెను - దేవుడు లేక సిరి. అనేకమంది "పూర్తికాల సేవకులు" దేవునిని మరియు సిరిని సేవించాలని చూచుచున్నారు. వారు ఒక లౌకికమైన ఉపాధిలో ఉండి దాని ద్వారా సంపాదించగలిగిన దానికంటే ఈ రోజున వారు "దేవుని సేవకులు"గా పిలువబడుచు ఎక్కువ సంపాదించుచున్నారు. దేవుని సేవించుటకు భూసంబంధమైన సుఖాలను, డబ్బును, భౌతికపరమైన వస్తువులను త్యాగము చేయనివాడు నిజముగా దేవునిని సేవించుటలేదు. ఏ విశ్వాసియైనా దేవుని సేవకుడు కాగలడు- కాని అతడు సిరిని ప్రేమించుట నుండి విడుదల పొందవలెను. నిజానికి, మీరు పై వచనమును జాగ్రత్తగా చదివినట్లయితే, దేవుని సేవకులుగా ఉండుటకు మనము సిరిని ద్వేషించి, తృణీకరించవలెనని యేసే చెప్పెనని మీరు కనుగొందురు. సిరి యెడల మీ వైఖరి అలా ఉన్నదని లేక అటువంటి వైఖరిని మీరు కలిగియుండగోరుచున్నారని మీరు దేవుని యెదుట చెప్పగలిగిన యెడల, అప్పుడు దేవుని సేవకులుగా ఉండుటకు మీకు అర్హత ఉన్నది- లేనియెడల లేదు. యేసు ఇక్కడ చెప్పిన ప్రమాణము ప్రకారము ఎంతమంది పూర్తికాల సేవకులకు అర్హత ఉన్నది? బహు కొద్దిమందికే!

మనము ఎవరి ఆజ్ఞలను గైకొనుచున్నామో అనుదాని ద్వారా మనము ఎవరిని సేవించుచున్నామో కనుగొనవచ్చును. మన జీవితాలలో ఎవరి హక్కులకు ప్రాముఖ్యత ఉన్నది- దేవుని హక్కులకా? లేక సిరి హక్కుకా? ఎవరూ ఇద్దరు యజమానులను సేవించలేరు. డబ్బు మిమ్ములను పిలచినప్పుడు మీరు వెంటనే స్పందిచినయెడల, మీరు సిరికి దాసులు.

ఎందుకని ఎక్కువమంది బోధకులు ధనిక విశ్వాసులున్న సౌకర్యవంతమైన ప్రదేశాలలో బోధించుటకు మాత్రమే ప్రయాణించుదురు. భారతదేశములో ఉన్న పేద విశ్వాసులను క్రమక్రమముగా దర్శించి వారిని విశ్వాసములో స్థిరపరచుటకు ఎంత మంది ఆసక్తి కలిగియున్నారు. వారే భారతదేశములో దేవుని నిజమైన సేవకులు.

అనేకమంది భారతీయులు పూర్తికాల సేవకులు ఇప్పుడు అమెరికాలో జీవించుచు, భారతదేశము కొరకు భారమున్నదని చెప్పుకొందురు. అది వట్టి వేషధారణ. అయినప్పటికి అనేకమంది విశ్వాసులు వారిచేత మోసగించబడుచున్నారు. వారికి భారతదేశము యెడల నిజముగా భారమున్న యెడల వారు భారతదేశములోనే నివసించియుండేవారు. ఒక విశ్వాసి మరియెక దేశమునకు తన నివాసస్థలమును మార్చుటలో ఏ తప్పులేదు. కాని అలా చేయుటకు తనకున్న ఉద్దేశ్యము ముఖ్యమైనది. యేసు కూడా తన నివాసస్థలమును పరలోకమునుండి భూమికి మార్చెను. కాని ఆయన ఉద్దేశ్యమేమిటి? అది సుఖసౌకర్యములు మరియు డబ్బా? లేక అది దేవుని మహిమ కొరకు అవసరతలో ఉన్నవారికి సహాయపడుటకా? ఒక ప్రదేశమునుండి మరియెక ప్రదేశమునకు మారుటకు నీవు ఎందుకు నిర్ణయించుకొంటివో చూచుకొనవలెను. నీవు దేవుని దాసుడవో లేక సిరికి దాసుడవో అది సూచించును. సిరిని సేవించువాడు దేవునికి పనికిరాడని అపవాదికి తెలియును. కాబట్టి అతడు అటువంటి బోధకులను విడిచిపెట్టుము. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి లోకస్తులనుండి భ్రష్టుపట్టిన క్రైస్తవలోకపు నాయకులనుండి ఘనత పొందుటకు నిన్ను అనుమతించుటయే అపవాది నీకు చేయగలిగిన అతిగొప్ప అవమానము.

ఒక దేవుని సేవకుడు నిరంతరము ఆత్మలను ఎలా గెలవాలని(రక్షణలోనికి నడిపించాలని) మరియు సంఘమును ఎలా కట్టాలని ఆలోచించును. రాత్రిపూట కూడా దాని గురించే కలలు కనును. అయితే సిరి యొక్క దాసుడు రాత్రింబగళ్ళు ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించి కలలుకనును. మన "మనసాక్షి"ని (sub-conscious) మనము మోసగించలేము. ఎందుకంటే దానికి అందరికంటే ఎక్కువగా మనము ఖచ్చితముగా దేనిని కోరుచున్నామో తెలియును. మనము సిరిని ప్రేమించుచుంటే మనము యధార్థముగా ఉండి దేవునితో చెప్పి దానినుండి మనలను విడిపించమని ఆయనను అడుగవలెను. యధార్థవంతులైన విశ్వాసులకు గొప్ప నిరీక్షణ కలదు. కాని యధార్థతలేని వేషధారులకు ఎటువంటి నిరీక్షణలేదు.

ఈ రోజుల్లో మనము అనేక "అద్భుత సమావేశాల"ను (కూటములను) గూర్చి విందుము. కాని "ప్రజలను డబ్బు అడగని" అద్భుతము జరుగు కూటములను చూచుటకు నేనింకా ఎదురుచూచుచున్నాను. యేసు మరియు ఆయన అపొస్తలులు వారి కూటములలో ప్రజల యొద్దనుండి కానుకలను ఎప్పుడు తీసుకోలేదు. కాని గ్రుడ్డివారును అవివేకులైన విశ్వాసులు ఈ రోజున సిగ్గులేకుండా డబ్బు అడుగు బోధకులను ప్రశంసించి వీరు దేవుని గొప్ప సేవకులని కూడా ఊహించుకొందురు. క్రీస్తు న్యాయపీఠము యొక్క స్పష్టమైన వెలుగు, అటువంటి బోధకులు దేవునిని గాక తమ్మును తామే సేవించుకొన్నారని బయలుపరచును. విశ్వాసులు సాంప్రాదాయకమైన సిద్ధాంతముగలవారిని అలా కానివారినుండి వేరుపరచుటకు ఒక గీతను గీయుదురు. కాని అటువంటి సందర్భములో అపవాది మరియు అతని దయ్యములందరు సాంప్రదాయకమైన సిద్ధాంతములు గలవారి ప్రక్కనే ఉందురు. ఎందుకనగా వారి సిద్ధాంతములు సరియైనవియే (యాకోబు 2:19). కాని దేవుడు సిరిని ప్రేమించువారిని దేవుని ప్రేమించువారినుండి వేరుపరచుటకు ఒక గీత గీయును. అప్పుడు అపవాది అతని దయ్యములు సిరిని ప్రేమించువారిలో ఉందురని మనము కనుగొనెదము.

మనము దేవుని రాజ్యమును మొదట వెదికిన యెడల, భూమిమీద మనకు జీవించుటకొరకు అవసరమైన వాటినన్నిటిని, మనము వాటికొరకు ప్రయాసపడకుండా, దేవుడు మనకిచ్చును. నా 40 ఏళ్ళ క్రైస్తవ అనుభవమంతటిలో ఇది నిజమని నేను కనుగొంటిని. ఆకాశమును భూమియు గతించును గాని దేవుని వాక్యము ఎప్పుడు గతించదు. తన రాజ్యమును మొదట వెదికిన వారందరి యొక్క అవసరతలన్నిటిని దేవుడు తీర్చునన్న సత్యమునకు మనము సజీవమైన ప్రదర్శనలుగా(సాక్షులుగా) ఉండాలి. మన క్రైస్తవ జీవితమంతటిలో అన్ని సమయాలలోను దేవుని రాజ్యమును స్థిరముగా మొదట వెదకితిమని మనలో ఎవరు చెప్పలేనప్పటికీ, మనము నిశ్చయముగా డబ్బు వెంట పరుగెత్తలేదని సాక్షము కలిగియుండాలి. మనము బోధకులమైతే మనము ఎక్కడికైనా బోధించుటకు వెళ్ళినప్పుడు కేవలము అక్కడ డబ్బు పొందగలమని తెలియుటను బట్టి వెళ్ళలేదనియు, ధనికులను సంతోషపెట్టుటకు మనము చూడమనియు, పేదవారిని నిర్లక్ష్యము చేయమనియు, కానుకలు పట్టుటకు మనకు ఆసక్తి లేదనియు, మన ఆర్థిక అవసరతలను ప్రజలకు తెలుపమనియు, ప్రజలు మనకు డబ్బులిచ్చెదరని ఎదురుచూడమనియు మనము సాక్ష్యము కలిగియుండవలెను. అటువంటి జీవితమును జీవించినట్లు పౌలు సాక్షమివ్వగలిగెను. పౌలు దేవునిని సేవించినట్లు తాము కూడా దేవునిని సేవించుచున్నామని చెప్పుకొనే ఆ కాలములో డబ్బును ప్రేమించే బోధకులందరినీ బయటపెట్టుటకు తాను అలా జీవించియున్నానని పౌలు చెప్పాడు (2 కొరంథీ 11:10-13 లివింగ్ బైబిలు).

మన కాలములో కూడా, భారతదేశములోని క్రైస్తవత్వములోని సమృద్ధిగా కనిపించే డబ్బును ప్రేమించు బోధకులను బయటపెట్టె పౌలు వంటి సజీవసాక్షుల అవసరత భారతదేశములోనున్నది. అపవాది మమ్ములను మా పరిచర్యలను ఎందుకు ద్వేషించునో మాకు బాగుగా తెలియును. అతడు మా కూటములకు ఎప్పుడు రానివారిని మరియు మేము మాట్లాడుట వినని వారిని మమ్మును మత భ్రష్టులనియు, క్రీస్తు విరోధలనియు, ఉగ్రవాదులనియు, అబద్ధప్రవక్తలనియు పిలుచునట్లు చేయును. డబ్బును ప్రేమించి క్రీస్తు సువార్తను ప్రకటించు పూర్తికాల సేవకులు నిజానికి సాతాను సేవకులన్న సత్యమును బయటపెట్టుట ద్వారా మేము సాతాను రాజ్యమునకు సమస్యలు కలిగించుచున్నందున సాతాను అలా చేయును (2 కొరంథీ 11:15ను 10-13 వచనాల సందర్భములో చూడండి).

సిరిని ఉపయోగించే విషయంలో మనము నమ్ముకముగా లేనియెడల దేవుడు తన రాజ్యము యొక్క సత్యమైన ధనమును మన వశము చేయడని యేసు చెప్పెను (లూకా 16:11). భారతీయ క్రైస్తవులు పాశ్చాత్య క్రైస్తవులను గ్రుడ్డిగా అనుకరించుటను, దేవుని వాక్యము మీద ప్రత్యక్షత యొక్క ఘోరమైన కొరతను, ఈ కాలము బోధకుల యొక్క విసుగుపుట్టించే బోధను మనము చూచినప్పుడు, ఈ బోధకులు డబ్బు విషయములో నమ్మకనుగా లేకపోవుటయే దీనంతటికీ కారణమని మనము స్పష్టముగా అర్థము చేసుకొనవచ్చును.

3. మనుష్యులను సంతోషపెట్టగోరుట నుండి విమోచించబడుట

"నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును" (గలతీ 1:10).

ఇది మూడవ అవసరత, మనుష్యులను సంతోషపెట్టగోరుట నుండి విడిపింపబడుట. మరోసారి చెప్పాలంటే, మనుష్యులను సంతోషపెట్టగోరుట కంటే ఒక లౌకిక పరమైన ఉద్యోగమునుండి విడుదలపొందుట తేలిక. మనము మనుష్యులను సంతోషపెట్టుటకు దేవుని వాక్యమును బోధించినయెడల మనము మనుష్యులకే గాని దేవుని సేవకులము కాము ఒక బోధకుడు వచ్చే సంవత్సరము ఎక్కువ డబ్బును ఘనతను పొందగలిగే ఒక ప్రతిష్టాత్మకమైన సమావేశమునకు మరల తిరిగి ఆహ్వానింపబడగోరిన యెడల, అతడు చెప్పుదానిని బట్టి ఎవ్వరు అభ్యంతరపడకుండా ఉండునట్లు తన వర్తమానము సవరించుటకు శోధింపబడవచ్చును. ఆ విధముగా అతడు మనుష్యులకు దాసుడగును. మీరు మనుష్యులను మెప్పించుటకు బహిరంగముగా ఒక విధముగా ప్రార్థించినప్పుడు మీరు సజీవుడైన దేవునిని కాక మనుష్యుల అభిప్రాయములను ఆరాధించుచున్నారు. దేవుడు అటువంటి ప్రార్థనలను వినడు, ఎందుకనగా అవి ఆయనకు కాక మనుష్యులకు అర్పింపబడినవి. అదేవిధముగా, మనము ఎటువంటి వస్త్రములను ధరించుదుమో, ఎలా ప్రజలతో మాట్లాడుదుమో, మనము నడిచే తీరును గూర్చికూడా మనలను మనము పరీక్షించుకొనవచ్చును. వీటిలో దేనినైనను మనుష్యులను మన "పరిశుద్ధత"తో లేక బహుశా మన "దీనత్వము"తో మెప్పించుటకు మనము చేసిన యెడల మనము మనుష్యులకే గాని దేవునికి దాసులము కాము. మీరు మీ భర్తనుగాని భార్యనుగాని సంతోషపెట్టగోరినా కూడా, మీరు దేవునిని సంతోషపెట్టలేరు.

మీరు దేవునిని ఎంత ఎక్కువగా సంతోషపెట్టుదురో అంత ఎక్కువగా మీరు దేవుని ఎరుగని మనుష్యుల చేత, క్రైస్తవలోకము యొక్క మతపరమైన నాయకుల చేత కూడా చెడు పేర్లతో పిలువబడుదురు. యేసు "దయ్యములకు అధిపతి" అని పిలువబడెను. శిష్యులు పోపును గాని బిషప్పును గాని, ముఖ్యకాపరిని గాని భూమిమీద ఇంకే మనుష్యుని గాని సంతోషపెట్టగోరరు కాబట్టి వారింకెంతగా అటువంటి పేర్లతో పిలువబడుదురో.