WFTW Body: 

పేతురు తాను వ్రాసిన మొదటి పత్రికలో విధేయత గురించి ఎక్కువగా చెప్పాడు. నిజమైన దేవుని కృపను అనుభవించే వ్యక్తి ఎక్కడ ఉన్నప్పటికి ఎల్లప్పుడు అధికారానికి విధేయత చూపిస్తాడు. విధేయత చూపించుటకు అతనికి ఎటువంటి సమస్య ఉండదు. ఆదాము సృష్టింపబడకముందే తిరుగుబాటు ద్వారా పాపము ప్రవేశించింది. ప్రధానదూత దేవునికి తిరుగుబాటు చేసిన వెంటనే సాతానుగా మారాడు. అందువలన "తిరుగుబాటు చేయుట సోదెచెప్పుట యను పాపముతో సమానము" (1సమూయేలు 15:23) . సోదెచెప్పుట వలె తిరుగుబాటు చేయుట ద్వారా ఒకడు దురాత్మతో కలుసుకొనును. యేసు దానికి వ్యతిరేకంగా జీవించి సాతానును జయించాడు. ఆయన తన్నుతాను తగ్గించుకొని మరియు తన తండ్రికి సంపూర్ణంగా విధేయత చూపించి పరలోకమునుండి భూలోకముకు దిగివచ్చాడు. ఈ భూలోకంలో జీవించిన 30 సంవత్సరములు తన పరలోకపు తండ్రి తనమీద అధికారులుగా నియమించిన అసంపూర్ణలైన మరియ, యోసేపులకు లోబడియున్నాడు. దేవుని నిజమైన కృపను అనుభవించే వ్యక్తి తిరుగుబాటు చేసే ఆత్మనుండి సంపూర్ణంగా రక్షింపబడును. నీపై ఉన్న అధికారానికి లోబడుటకు నీకు సమస్య ఉండినట్లయితే నీవు నీ ప్రాణంలో రక్షణ పొందాలి.

క్రైస్తవులు వారిపైన ఉన్న మానవ అధికారానికి అనగా రాజులకు, అధికారులకు మొదలగు వారందరికి లోబడుటకు పిలువబడ్డారు (1పేతురు 2:13,14). ఆ కాలములో ఉన్న రోమా చక్రవర్తి నీరో అత్యంత దుష్టుడు. ఆయన రాజైయుండి క్రైస్తవులను హింసించి చంపాడు. అయినప్పటికి క్రైస్తవులు రాజుకు విధేయత చూపుటయే గాక, రాజును సన్మానించమని పౌలు చెప్పుచున్నాడు. మరియు అందరిని కూడా సన్మానించమని పేతురు చెప్పుచున్నాడు (1పేతురు 2:17) . పాతనిబంధనలో వయస్సులో పెద్ద వారిని మాత్రమే సన్మానించమని ఉన్నది (లేవీయకాండము 19:32). కాని క్రొత్తనిబంధనలో మనము అందరిని సన్మానించాలి. క్రొత్తనిబంధనలో ప్రతివిషయంలో ప్రమాణం ఉన్నతమైనది. పాతనిబంధనలో దేవునికి దశమభాగం ఇవ్వాలి. క్రొత్తనిబంధనలో మనకు ఉన్నది అంతా ఇవ్వాలి (లూకా 14:33) . పాతనిబంధనలో వారములో ఒక దినము విశ్రాంతి దినము. క్రొత్తనిబంధనలో ప్రతిదినము విశ్రాంతి(పరిశుద్ధ) దినము. పాతనిబంధనలో మొదటిగా పుట్టిన మగబిడ్డను దేవునికి ప్రతిష్టించాలి. క్రొత్తనిబంధనలో మన పిల్లలందరిని దేవునికి ప్రతిష్టించాలి. ఒక వ్యక్తి దేవుని కృపను అనుభవిస్తున్నట్లయితే, అందరిని సన్మానించుటకు అతనికి ఇబ్బంది ఉండదు. యేసువలె మనము దాసులమై ఉండి, సంతోషముతో ప్రతి ఒక్కరిని ఘనపరచి, వినయమైన మనస్సుగలవారమై ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యులని యెంచుతాము (ఫిలిప్పీ 2:3).

తరువాత ప్రత్యేకంగా సేవకులతో మాట్లాడుచూ వారు తమ యాజమానులకు లోబడియుండమని చెప్పాడు. సేవకులు తమ యజమానులకు లోబడాలని అపొస్తలులందరూ బోధించారు. తన ఆఫీసులోగాని, కంపెనీలోగాని తనపైన ఉన్న అధికారులపై తిరుగుబాటు చేసే క్రైస్తవులు, క్రీస్తుకు సాక్షిగా ఉండలేరు. స్కూల్లో గాని, కాలేజీలోగాని తనయొక్క ఉపాధ్యాయులపై తిరుగుబాటు చేసే క్రైస్తవవిద్యార్ధి క్రీస్తుకు సరియైన సాక్షిగా ఉండలేడు. అటువంటి క్రైస్తవుడు దేవుని నిజమైన కృపను కొంచెం కూడా అర్ధము చేసుకోలేడు. యేసు తన భూసంబంధమైన అసంపూర్ణులైన తల్లిదండ్రులకు 30 సంవత్సరములు లోబడుతూ ఉన్నాడని వారు అర్ధము చేసుకోలేదు. ఈ విషయాన్ని మనమందరము అర్ధము చేసుకోవాలి. సేవకులు తమ యజమానులకు గౌరవంతో లోబడాలి. నీవు ఆఫీసులోగాని, కంపెనీలోగాని, స్కూల్లోగాని మరియు మరి ఎక్కడైనా సరే అక్కడ ఉన్న పై అధికారులను గౌరవించాలి.

తమ ఉపాధ్యాయులను గౌరవించాలని మరియు ఇతరులతో కలిసి వారిని హేలన చేయవద్దని మన పిల్లలకు మనము బోధించాలి. పనివారు, మంచివారు మరియు సాత్వికులైన యజమానులకు మాత్రమే కాక ముష్కరులైన యజమానులకు కూడా లోబడియుండాలి అని చెప్పుచున్నాడు. మంచి యజమానునికి లోబడియుండుట సులభమే కాని నిజమైన దేవుని కృపను అనుభవించిన క్రైస్తవుడు చెడ్డ యజమానికి కూడా అలాగే లోబడియుండును (1పేతురు 2:18) . ఒక యజమానునికి లోబడినప్పుడు ఒక క్రైస్తవుడుగా నీ వెలుగు ప్రకాశిస్తుంది. సూర్యుని వెలుగులో క్రొవొత్తి యొక్క వెలుగు కనిపించదు. కాని చీకటిలో దాని వెలుగును అందరు చూడగలరు. అలాగే గాడాంధకారములో ఒక క్రైస్తవుని వెలుగు ఎంతో తేజస్సులో కనబడుతుంది.

ఒక తప్పు చేసి నీవు శిక్షింపబడినప్పుడు సహించుట గొప్పకాదు. మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమవుతుంది (1పేతురు 2:20). పేతురు యొక్క పత్రికలో అన్యాయముగా శ్రమబడుట ఒక ముఖ్యమైన అంశం. యేసు కూడా అలాగే శ్రమపొందియున్నాడని అతడు చెప్పాడు. క్రీస్తుకూడ మన కొరకు అన్యాయముగా బాధపడి మనము తన అడుగుజాడలలో నడుచుకొనునట్లు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను (1పేతురు 2:21-23). నిజమైన దేవుని కృపను అర్ధము చేసుకొనిన ఒక క్రైస్తవుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు.