వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

ప్రపంచములోని మనుష్యులందరూ సంతోషమును వెదకుచున్నారు. కాని వారు తప్పుడు మార్గములో వెదకుచున్నారు. వారు వ్యభిచారము చేయుట ద్వారా లేక ధన సమృద్ధిని బట్టి లేక పేరు ప్రతిష్టలనుబట్టి లేక అధికారమునుబట్టి సంతోషము కలుగునని తలంచుచున్నారు. వాటిలో కొంత సంతోషము ఉండును. కాని అది అంతము వరకు ఉండదు.

మనము సంతోషంగా ఉండవలెనని దేవుడు కూడా కోరుచున్నాడు. కాని "శుద్ధహృదయముగలవారు సంతోషించెదరని" ఆయన చెప్పుచున్నాడు (మత్తయి 5:8 ఆంగ్ల లివింగ్ బైబిల్). పరిశుద్ధముగా ఉండుట ద్వారానే నిజమైన సంతోషము పొందగలము. ఒక క్రైస్తవుడుగా పరిశుద్ధుడవై యున్నావు గనుక ఎంతో సంతోషము అనుభవించుచున్నావని లోకస్థులకు చూపించాలి. దేవుడు నిషేధించిన పాపముల ద్వారా సంతోషమును పొందనవసరము లేదని మీరు ఇతరులకు చూపించాలి.

ఉద్యోగము లేక వివాహము వంటి మంచివాటి ద్వారా కూడా నిజమైన సంతోషము పొందలేము. మనము వీటిని కలిగియుండవచ్చును. కాని వాటి ద్వారా సంతోషము పొందలేము. ప్రభువులో మాత్రమే మీరు ఆనందించగలరు. అప్పుడు మాత్రమే సువార్తయొక్క సత్యమునకు సమర్థవంతమైన సాక్షులుగా ఉండెదము.

ప్రభువైనయేసు మనలను పాపమునుండి మాత్రమేకాక ఈలోకవ్యవస్థ నుండికూడా రక్షించుటకు వచ్చెను. సాతాను ఈ లోకాధికారి. ఈ లోకములో మనము తటస్థముగా కనిపించే వినోదకార్యక్రమములు, చదువు మొదలగు విషయాల వెనుక సాతాను ఉన్నాడు. ఉదాహరణకు, మంచిక్రైస్తవ సంగీతము వినుటకు మన ఖాళీ సమయమంతా ఉపయోగించినయెడల, దేవుని స్వరము వినకుండా సాతాను మనలను ఆటంకపరచును. అప్పుడు మంచిది శ్రేష్టమైన దానికి శత్రువు అగును.

ప్రభువు మనలను లోకములో నుండి తీసుకొని వెళ్ళలేదు. యోహాను 17:15లో "నీవు లోకములో నుండి వారిని తీసుకొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను". ఈ లోకములో మాత్రమే మనము అంతకంతకు పరిశుద్ధులుగా మారెదము. ఒక ఓడలోనికి నీరు ప్రవేశించుట లేదని తెలుసుకొనుటకు దానిని సముద్రములో పరీక్షించెదరు భూమిమీద కాదు.

నోవహు మరియు లోతు దినములవలే ప్రజలు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుకొనుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు ఉందురని ప్రభువు చెప్పాడు (లూకా 17:26-28). ఇవన్నియు చేయదగినవి. మనము వీటన్నిటిలో మునిగిపోయి దేవునికి సమయము ఇవ్వకుండా ఉండవచ్చు. అంత్యదినములలో ఇదియే అపాయకరము. మరియు అటువంటి దినములలో మనము నివసించుచున్నాము. మనము ఆర్థికముగా అభివృద్ధి చెంది, ఇష్టానుసారముగా సుఖించుచూ, దేవుని యొద్దనుండి సులభముగా తప్పిపోయెదము. "సంతుష్టిసహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై యున్నదని" బైబిలు చెప్పుచున్నది (1తిమోతి 6:6).

ఇదియే రక్షణ దినము. దేవునికంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించిన యెడల మారుమనస్సు పొందవలెను. మన హృదయములు అపవిత్రముగా ఉండినప్పుడు నిజముగా సంతోషించలేము. రహస్య పాపములు మరియు ఇతరుల యెడల తప్పుడు వైఖరులు, కయీను వలె ముఖము చిన్నబుచ్చుకొనునట్లుగా చేయును. "నీవెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు?" అని దేవుడు కయీనును ప్రశ్నించెను (ఆది.కా. 4:6). తాను పొందబోయే అపాయము గురించి దేవుడు కయీనును హెచ్చరించెను. పాపము తన హృదయమను తలుపునొద్ద పొంచియుండి అతనిని మ్రింగవలెనని చూచుచున్నదని, దానిని జయించుమని దేవుడు అతనితో చెప్పాడు.

అన్ని సమయములలో పాపము మనకు ఎంతో దగ్గరగా ఉన్నది. ఎల్లప్పుడూ దీనిని గుర్తించినవారు ధన్యులు - ఎందుకనగా శోధన వచ్చినప్పుడు వారు మెలకువగా ఉండెదరు. తమ శరీరములో బలహీనతను గుర్తించినవారు, వారు పడిపోకుండునట్లు దేవుని సహాయము కొరకు ఎల్లప్పుడూ మొరపెట్టుదురు.