WFTW Body: 

2 దినవృత్తాంతములు 3:1లో "సొలొమోను మోరీయా పర్వతమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను" అని మనము చదివెదము. మోరీయా పర్వతము అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పించిన స్థలము (ఆదికాండము 22వ అధ్యాయము). అక్కడ, ఆ పర్వతము మీద దేవుని మార్గము త్యాగముతో కూడిన మార్గమని అబ్రాహాము అర్థము చేసికొని దానికి లోబడెను. దేవుడు ఆ స్థానమును పవిత్రపరచి ఆయన మందిరము అదే స్థానములో, వెయ్యేళ్ళ తరువాత కట్టబడునని నిర్ణయించెను. మరియు ఈ రోజున కూడా దేవుడు తన మందిరమును (సంఘమును) అదే చోట కట్టును. అబ్రాహాము యొక్క ఆత్మను మరియు విశ్వాసమును కలిగియున్న వారిని, ఆయన కనుగొన్న చోటనే సంఘమును కట్టును. మోరీయా పర్వతము మీద అబ్రాహాము దేవునితో చెప్పినది, ఏదేను వనములో ఆదాము మరియు హవ్వ దేవునికి చెప్పినదానికి సాదృశ్యరూపముగా ఖచ్చితముగా విరుద్ధముగా ఉన్నది.

ఏదేనులో, ఆదాము హవ్వ నిషేధింపబడిన ఫలము తిని, వారికి సంతోషాన్ని తీసుకువచ్చే సృష్టింపబడిన వస్తువులు, సృష్టికర్త కంటే వారికి అమూల్యమైనవని దేవునితో చెప్పిరి. ఈరోజు కూడా వందల కోట్ల మానవులు దేవునితో ఖచ్చితముగా అదే చెప్పుచున్నారు. "వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి" (రోమా 1:25). కాని మోరీయా పర్వతము మీద అబ్రాహాము దానికి విరుద్ధమైన దానిని చెప్పెను: తన దేవుడు మరియు తన సృష్టికర్త భూమి మీద తనకు కలిగిన అతిప్రియమైన దానికంటే (ఇస్సాకు కంటే) అమూల్యమైన వాడని చెప్పెను. దానిని నిరూపించుటకు అతడు ఇస్సాకును బలిచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఈ త్యాగమనే నియమము చొప్పున జీవించువారందరిని దేవుడు ఘనపరచును. ఈ మార్గము చేత పట్టబడిన వారి చేతనే దేవునియొక్క నిజమైన మందిరము ఈ రోజున కూడా కట్టబడును.

కల్వరికొండమీద, యేసు లోకపాపముల నిమిత్తము చనిపోవుట మాత్రమే సత్యము కాదు. అక్కడ, దేవుడు తన కార్యమునంతటిని చేయు త్యాగమనే నియమమును యేసు ప్రదర్శించెను. ఎవరైనను ప్రభువును ఇంకా ఏ ఇతర మార్గములో సేవించలేరు. ఈ లోకములో ఒక సౌకర్యవంతమైన జీవితమును కోరుకొని, అదే సమయములో సంఘమును కూడా కట్టాలనుకొనే వారు, కేవలము తమ్మును తాము మోసపరచుకొనెదరు. రెండు లోకాలలోను (ఇహలోకములో, పరలోకములో) శ్రేష్టమైన వాటిని కోరుకొనువారు సాతానుచేత పూర్తిగా మోసగింపబడిరి. అనేకులు త్యాగము చేయకుండా దేవుని సేవించుటకు ప్రయత్నించిరి. కాని వారి ప్రయాసలకు ఫలితము వైఫల్యము వెంట వైఫల్యమే.

క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్నుతాను అప్పగించుకొనెను (ఎఫెసీ 5:25,26). సంఘమును కట్టుటకు మనము కూడా సంఘమును అదే విధముగా ప్రేమించవలెను. మన డబ్బునో లేక సమయాన్నో ఇచ్చుట సరిపోదు. మనలను మనము (మన స్వజీవమును) అప్పగించుకోవలెను.

దేవుడు తన ప్రేమను మానవునికి వర్ణించగోరినప్పుడు, ఆయన తన ప్రేమను ఒకే ఒక్క భూసంబంధమైన ఉదాహరణతో పోల్చగలిగెను - అది ఒక తల్లి తనకు పుట్టిన చంటిబిడ్డ కొరకు కలిగియున్న ప్రేమ (యెషయా 49:15). మీరు ఒక తల్లిని గమనించిన యెడల, తన శిశువు కొరకు ఆమెకున్న ప్రేమ త్యాగపూరితమైన ఆత్మను కలిగియుండునని మీరు చూచెదరు. తెల్లవారుజాము నుండి రాత్రివరకు మరియు రాత్రంతయు కూడా ఒక తల్లి తన శిశువుకొరకు త్యాగము చేస్తూ ఉండును. దానికి ఫలితముగా ఆమెకు ఏమియు లభించదు. ఆమె తన బిడ్డకొరకు సంవత్సరం వెంబడి సంవత్సరం బాధను, అసౌకర్యమును, బదులుగా, ఏమియు ఆశించకుండా, ఆనందముగా సహించును.

దేవుడు మనలను కూడా అదేవిధముగా ప్రేమించుచున్నాడు. ఆ స్వభావమునే ఆయన మనకు ఇవ్వజూచుచున్నాడు. కాని ఆ విధముగా అందరు ఒకరినొకరు ప్రేమించే సహవాసము లోకమంతటిలో ఎక్కడైనను ఉన్నదని యధార్థముగా చెప్పగలుగుట అసాధ్యము. ఎక్కువ మంది విశ్వాసులకు వారితో ఏకీభవించిన వారిని మరియు తమ గుంపులో జేరినవారిని మాత్రమే ఏ విధముగా ప్రేమించవలెనో తెలియును. వారి ప్రేమ మానవ సంబంధమైనది మరియు అది తల్లుల యొక్క త్యాగములో కూడిన ప్రేమకు చాలా దూరముగా ఉన్నది.