WFTW Body: 

"ఆ సంగతులు జరిగిన తరువాత........." అని ఆదికాండము 22వ అధ్యాయము ఆరంభమగును. ఆ పరీక్షా సమయములో వెంటనే జరిగిన విషయములను మనము గమనించినట్లయితే, అబ్రాహాము జయించేవాడుగా ఉన్నట్లు కనుగొనెదము. అన్యులు అతని దగ్గరకు వచ్చి ఇట్లనిరి, "నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు" (ఆదికాండము 21:22). అద్భుతరీతిలో శారా గర్భము ధరించుటను గూర్చి వారు విని మరియు దేవుడు వారి కుటుంబముతో ఉన్నాడని నమ్మిరి. ఇస్సాకు అబ్రాహాము హృదయానికి ప్రియుడైయున్నాడు. దేవుని యెడల తనయొక్క మొదటి ప్రేమను కోల్పొయే ప్రమాదములో అబ్రాహాము ఉండెను. కాబట్టి దేవుడు అబ్రాహామును మరలా పరీక్షించి మరియు ఇస్సాకును బలిగా ఇవ్వమని అబ్రాహాముతో చెప్పెను. కాని అబ్రాహాము వినగల చెవులు గలవాడైయుండి మరియు దేవుడు ఆజ్ఞాపించిన దానికి లోబడే హృదయాన్ని కలిగియుండెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి మరియు దేవునికి లోబడుటకు వెళ్ళాడు (ఆదికాండము 22:3 ). దేవుడు మాట్లాడిన తరువాత గత రాత్రి తండ్రి ఏవిధమైన పరిస్థితిలో గుండా వెళ్ళెనో, అక్క డ వ్రాయబడలేదు. అతడు బహుశా నిద్రపోలేదని నేను నమ్ముచున్నాను. అతడు అనేకసార్లు లేచి, తన కుమారుని చూచుకొని యుండవచ్చును. మరియు తన కుమారునికి తాను చేయబోయే దానిని గురించి ఆలోచించి కన్నీరు కార్చియుండును.

ఆ వయస్సులో తన కుమారుని బలిగా అర్పించుటకు అబ్రాహాముకు ఎంతో కష్టమైయుండవచ్చును. కాని ఎంత వెలైనా చెల్లించి దేవునికి లోబడవలెనని కోరియున్నాడు. 50 సంవత్సరాల క్రితం ఊరాను పట్టణములో నుండి దేవుడు తనను పిలిచినప్పుడు, అతడు వెనుదిరగలేదు. అతడు విధేయత చూపించుచునే ఉన్నాడు మరియు తన దేవుని కొరకు త్యాగము చేయుటకు ఇష్టపడుచున్నాడు. అందువలననే అతడు దేవుని స్నేహితుడుగా పిలువబడుటలో ఆశ్చర్యము లేదు.

హెబ్రీ 11:19లో చెప్పినట్లు, దేవుడు తన కుమారుని మరలా లేపునని తన హృదయములో విశ్వాసముండెను. ఇస్సాకు పుట్టినప్పుడే, అబ్రాహాము మరియు శారా కొంత పునఃరుత్థాన శక్తిని రుచి చూశారు. బలిపీఠము మీద బలి చేయబడిన ఇస్సాకును తప్పనిసరిగా దేవుడు తిరిగి మరలా బ్రతికించును. అందువలన మోరీయా పర్వతము దగ్గరకు వచ్చిన తరువాత అబ్రాహాము తన పనివారితో, "నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి (దేవునికి) మొక్కి మరల మీ యొద్దకు వచ్చెదము" (ఆదికాండము 22:5). అది విశ్వాసముతో మాట్లాడిన మాట. ఇస్సాకు మరలా తనతో వచ్చునని అతడు నమ్మెను.

"మేము దేవునిని ఆరాధించుటకు వెళ్ళుచున్నామని" తన పనివారితో చెప్పుటను గమనించడి. దేవుడు ఇంత గొప్ప యాగమును కోరుచున్నాడని అతడు సణగలేదు లేక దేవునికి ఇంత గొప్ప త్యాగము చేయుచున్నానని గర్వముగా చెప్పలేదు. దేవుని కొరకు వారు చేసే త్యాగములను గూర్చి ఇతరులకు నెమ్మదిగా చెప్పేవారిలాగా అబ్రాహాము లేడు. నేను దేవునిని ఆరాధించుటకు వెళ్ళుచున్నానని మాత్రమే అతడు చెప్పాడు. మరియు ఇక్కడ నిజమైన ఆరాధన అంటే ఏమిటో చూచుచున్నాము. ఒకసారి ప్రభువైనయేసు ఇట్లనెను, "అబ్రాహాము నా దినము చూతనని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెను అనెను" (యోహాను 8:56). నిశ్చయముగా అబ్రాహామును మోరీయా పర్వతము మీదనే క్రీస్తు యొక్క దినమును చూచియున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన దర్శనములో, తండ్రియైన దేవుడే తన అద్వితీయ కుమారుని కల్వరికొండ మీద, సకల మానవుల పాపములకొరకు బలిగా అర్పించబోవుచున్నాడని ఆబ్రాహాము చూచెను. తప్పిపోయిన లోకమును రక్షించుటకు దేవుడు, మోరీయా పర్వతము మీద ఎంత వెల చెల్లించబోవుచున్నాడో అతడు చూచెను. ఆ ఉదయకాలమున దేవుని హృదయముతో సన్నిహిత సహవాసమును కలిగియున్నాడు. అవును, అతడు దేవునిని ఆరాధించాడు - కేవలము మాటలతోను, పాటలతోను మాత్రమే గాక ఎంతో విధేయత మరియు త్యాగముతో ఆరాధించెను.

అటువంటి విధేయత ద్వారా దేవునితో లోతైన సహవాసము కలిగియుండెదము. వేదాంతపరమైన అనేక విషయములను సరిగా తెలుసుకొనియుండవచ్చును కాని సమస్తమును ఆయనకు అప్పగించుకొనినప్పుడు, మనము నిజమైన ఆత్మసంబంధమైన జ్ఞానము పొందెదము. వేరొక మార్గములేదు. వరములను ఇచ్చువాడిని ఎక్కువగా ప్రేమించుచున్నాడా లేక వరములను ఎక్కువగా ప్రేమించుచున్నాడా అని అబ్రాహాము పరీక్షించబడ్డాడు. నిశ్చయముగా ఇస్సాకు దేవుడిచ్చిన వరమే కాని అతని కుమారుని దేవునికంటే ఎక్కువగా ప్రేమించే అపాయములో అబ్రాహాము ఉన్నాడు. అబ్రాహాముకు ఇస్సాకే ఒక విగ్రహమయ్యే ప్రమాదమున్నది. ఆ పరిస్థితి నుండి రక్షించుటకే దేవుడు కలుగజేసుకొనియున్నాడు.