వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము
WFTW Body: 

దానియేలు అతడి తరములో దేవుడు వాడుకొన్న వారిలో ఒకడు. అతడు 17సంవత్సరముల యౌవ్వనుడుగా ఉండినప్పుడు తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు (దానియేలు 1:8). ఎప్పుడైతే హనన్యా, మిషాయేలు మరియు అజర్యా తమతోటి యౌవ్వనుడైన దానియేలు దేవుని కొరకు నిలబడుటను చూచిరో (దానియేలు 1:11), వారు స్వంతంగా నిలబడుటకు ధైర్యము లేకుండెను కాని వారు దానియేలు నిలబడుట చూచినప్పుడు వారు ధైర్యము తెచ్చుకొనిరి. ఈనాడు దేవుని కొరకు వారికి వారుగా ధైర్యముగా నిలువబడలేని అనేకమంది, దానియేలు వంటివారు నిర్ణయము తీసుకొని నిలువబడుట కొరకు చూచుచున్నారు. అప్పుడు వారు కూడా అతడితో ఏకమవుదురు. నీవు అటువంటి దానియేలుగా ఉందువా? "నన్ను నేను అపవిత్రపరచుకొనను, రాజును లేక ఏ వెనక్కు జారిపోయిన పెద్దను లేక ఎవరినైనా సంతోషపరచుటకు నేను చూడను. నేనే 100% దేవుని వాక్యము ఏమి చెప్తుందో అది చేయుటకు నిలువబడుదును" అని నీవు చెప్పగలవా? "అనేకులను నీతి మార్గములోనికి త్రిప్పు" (దానియేలు 12:3) దానియేలు పరిచర్యకు స్త్రీ పురుషుల అవసరత ఈనాడు మన దేశములో ఎంతో ఉన్నది. ఈ వచనము నీతి గూర్చి బోధించే బోధకులగూర్చి చెప్పుటలేదు. కాని, వారి జీవితముతో మరియు మాదిరితో ఇతరులను నీతి మార్గములోనికి త్రిప్పు వారి గూర్చి చెప్పుచున్నది.

మనము లేఖనములలో మరియొక పరిచర్య గూర్చి చదువుదుము. అది "దానియేలు పరిచర్య"కు సరిగ్గా వ్యతిరేకమైన "లూసిఫరు పరిచర్య". దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుటలో తనను వెంబడించుటకు అనేకకోట్ల దేవదూతలను త్రిప్పుటలో లూసిఫరు సఫలమాయెనని మనము ప్రకటన 12:4లో చదివెదము. అంతమంది దేవదూతలను తప్పుదారి పట్టించుటకు లూసిఫరును దేవుడు ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే దానిద్వారా తిరుగుబాటు మరియు అసంతృప్తి కలిగిన దేవదూతల నుండి పరలోకము పవిత్రపర్చబడినది. వారి మధ్య లూసిఫరు లేచి వారిని దేవునికి విరోధముగా తిరుగుబాటుకు రేపక పోయినట్లయితే వారి దుష్ట హృదయములు బయటపడి ఉండేవికాదు.

అందుచేత ఈనాడు కూడా సహోదర సహోదరిలు సంఘములో లూసిఫరు పరిచర్య కలిగియుండునట్లు దేవుడు అనుమతించును. వారు ఇంటింటికి వెళ్ళి నేరారోపణ చేయునట్లును, కొండెములాడునట్లును, అబద్ధములాడి చెడు మాట్లాడునట్లు దేవుడు అనుమతించును. దానిని బట్టి సంఘములో ఉండిన తిరుగుబాటు, అసంతృప్తి మరియు లోకానుసారత కలిగిన విశ్వాసులు గుర్తింపబడి, బయట పెట్టబడి, అటువంటి వారందరు ఏకమై సంఘము నుండి బయటకు వెళ్ళిపోవుట ద్వారా క్రీస్తు శరీరమైన సంఘము పవిత్రపరచబడును. దేవుడు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం పరలోకములో మొదట లూసిఫరును ఆపనట్లుగానే, సంఘములో తిరుగుతూ లూసిఫరు పరిచర్య చేయుచుండు వారిని ఆపడు. అది దైవికమైన జ్ఞానము.

అటువంటి సహోదర సహోదరిలతో మనమెప్పుడు పోరాడకూడదు. దేవుడే సంఘమును భద్రపర్చును. తగిన సమయమందు సంఘమును అపవిత్ర పరచువారిని ఆయన నాశనము చేయును (1 కొరింథీ 3:17). ఎవ్వరు నశించిపోవుట ఆయనకు ఇష్టముండకపోవుట చేత ఆయన దీర్ఘశాంతము చూపించి తీర్పు తీర్చేముందు అనేక సంవత్సరములు వేచియుండును. నోవహు కాలములో ఆయన 120సంవత్సరములు వేచియుండెను. కాని దేవుడు తీర్పు తీర్చునప్పుడు ఆయన తీర్పు తీవ్రముగా ఉండును. అందువలన సంఘము ఎప్పుడు చీలిపోలేదని అతిశయించుట బుద్ధిహీనతయై ఉన్నది. ప్రారంభములో పరలోకములోనే దేవదూతలలోనే చీలికవచ్చింది. అటువంటి చీలికలు అవసరము. ఎందుకంటే "మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు" (1 కొరింథీ 11:19). వెలుగు చీకటి నుండి వేరుపరచబడవలసియున్నది. దానిని నీవు చీలిక అని పిలువలేవు. అది శుభ్రపరచు ప్రక్రియ. అది లేనట్లయితే ఈ భూమిపై దేవుని యొక్క సాక్ష్యము అపవిత్రపరచబడును.

మనమందరము దానియేలు పరిచర్య కలిగియుండి సంఘములో ఐకమత్యమును మరియు సహవాసమును కట్టవచ్చును లేక లూసిఫరు పరిచర్య కలిగి విభేదమును విత్తవచ్చును. మనము తటస్థముగా ఉండలేము. ఆయనతో కలసి సమకూర్చబడనివాడు చెదరగొట్టువాడని యేసు ప్రభువు చెప్పెను. సంఘములో రెండు పరిచర్యలేయున్నవి. సమకూర్చుట మరియు చెదరగొట్టుట (మత్తయి 12:30).

ప్రతిచోట స్వచ్ఛమైన సాక్ష్యము కలిగి దేవుని నామమునకు మహిమ తెచ్చు సంఘము కట్టబడునట్లు ఈ కడవరి దినములలో దేవుడు మనలను ఎలా జీవించాలని కోరుతున్నారో అట్లు జీవించుటకు మనము కృపను జ్ఞానమును పొందుదుము గాక!