WFTW Body: 

మన కాలములో పరిశుద్ధాత్మలో ముంచబడి పొందవలసిన బాప్తీస్మము గురించి విలువ ఇవ్వడం అవసరమైనది. ఈనాడు క్రైస్తవ్యంలో రెండు విపరీతమైన వైఖరులు ఉన్నవి. కొందరు పరిశుద్ధాత్మలో పొందవలసిన బాప్తీస్మమును బొత్తిగా నిరాకరించుచున్నారు. మరియు కొందరు పరిశుద్ధ జీవితం జీవించుటకుగాని లేక పరిచర్య చేయుటకుగాని శక్తిని ఇవ్వని నకిలీ బాప్తీస్మము గురించి అతిశయించుచున్నారు. మనము ఈ రెండు వైఖరులను విసర్జించి మరియు జీవించుటకు మరియు పరిచర్య చేయుటకును అవసరమైన జీవమును, శక్తిని ఇచ్చే బాప్తీస్మము పొందవలెను.

మనము ఎదిగిన దానికంటె ఎక్కువగా మన సంఘములను ఎదిగింపలేము. మనము కేవలం నకిలీ అనుభవం కలిగిన యెడల, ఇతరులను కూడా నకిలీ అనుభవంలోనికి నడిపించెదము. మనము నిజముగా పరిశుద్ధాత్మలో ముంచబడవలెను. అది మాత్రమే సరిపోదు. మనము ప్రభువు కొరకు ప్రభావితముగా ఉండవలెనని కోరినచో, మనము ఎల్లప్పుడు నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడవలెను. మనము ఎల్లప్పుడు ఆత్మపూర్ణులమై యుండాలి (ఎఫెసీ 5:18).

మన సంఘములో ఫలభరితమైన పరిచర్య చేయవలెనని కోరినయెడల, మన సంఘములోని సహోదర, సహోదరీల ఆత్మీయ అభివృద్ధి గురించి శ్రద్ధ వహించాలి. మన తోటి సహోదరులను ఫలభరితముగా సేవించవలెనని కోరినయెడల, అది ప్రవచన వరము కొరకు దేవునికి ప్రార్థించేటట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ వరము లేకుండా ప్రభావవంతమైన వాక్యపరిచర్య చేసి దేవునిని సేవించుట అసాధ్యము. కాబట్టి ఆ వరము కొరకు హృదయమంతటితో ప్రార్థించాలి. మన సంఘములో అవసరములో ఉన్నవారియెడల మనం శ్రద్ధకలిగి యుండవలెననుటకు ఒక వ్యక్తి తన స్నేహితుని కొరకు రొట్టెలను అడుగుటకు మధ్యరాత్రిలో తన పొరుగువాని యింటికి వెళ్ళుటను గూర్చిన ఉపమానమును ప్రభువైనయేసు చెప్పారు. మనకవసరమైనంత పరిశుద్ధాత్మను పొందేవరకు, మనం దేవునియొద్దకు వెళ్ళి తలుపు తట్టి ప్రార్థించాలి (లూకా 11వ అధ్యాయములో 8, 13 వచనాలను పోల్చిచూడండి).

క్రొత్తనిబంధనలో ప్రవచించుట అనగా, అవసరమైన పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి, సంఘము క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు పొందునట్లు దేవుని వాక్యమును ప్రకటించుట (1కొరింథీ 14:4,24,25). 1కొరింథీ 14వ అధ్యాయములో స్థానిక సంఘముల యొక్క కూటములలో ప్రవచించుటయొక్క ప్రాముఖ్యతను పౌలు చెప్పియున్నాడు. ఇటువంటి అభిషేకముతో కూడిన ప్రవచించుట లేకుండానే సంఘమును నిర్మించినయెడల, అప్పుడు దేవుడు ఈ వరమును సంఘమునకు అనవసరముగా ఇచ్చినట్లుండును. అప్పుడు, "విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి" అను హెచ్చరిక అనవసరముగా ఉండును (1కొరింథీ14:1,39). కాని సంఘమును నిర్మించుటకు ఈ వరము అత్యవసరమైయున్నది. ఒక సంఘములో ఈ విధముగా ఆత్మలో ప్రవచించే సహోదరుడు కనీసం ఒకరు కూడా లేనియెడల ఆ సంఘము చివరకు ఆత్మీయ మరణమును పొందును.

ఆత్మాభిషేకమును నిర్లక్ష్యముచేయుట ద్వారా పెంతెకొస్తు రోజు పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడుట అనవసరమనియు మరియు ఆయనయొక్క శక్తిలేకుండానే ప్రభువుయొక్క పరిచర్య చేయగలమని చెప్పినట్టుండును. అంతేగాక దేవుని రాజ్యములోనికి వెళ్ళుటకు ప్రభువైనయేసుకూడా భూమి మీదకు శరీరధారిగా రానవసరములేదని చెప్పినట్లుండును. త్రిత్వములో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను నిర్లక్ష్యము చేసి, తిరస్కరించుట త్రిత్వములో రెండవ వ్యక్తిని కూడా నిర్లక్ష్యము చేసినట్లవుతుంది. ఇది చాలా తీవ్రమైన పాపము.

కొందరు విశ్వాసులు పరిశుద్ధాత్మయొక్క అభిషేకమును దూషించుచున్నందువలన దానిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. నీకు పరిశుద్ధాత్మ శక్తిలేనియెడల, ప్రభువు యొక్క పరిచర్య చేయుటకు నీ యొక్క స్వంత తలాంతులు మరియు నీ అనుభవముతో చేసెదవు. అది దేవుని సంకల్పమును ఎన్నటికి నెరవేర్చదు.

ఒక వైపున ప్రజలను పరిసయ్యతత్వంనుండియు మరియు ధర్మశాస్త్రమునుండియు విడిపించి మరొక వైపున రాజీపడుటనుండియు లోకత్వమునుండియు ప్రజలను విడిపించాలి. ఇటువంటి పరిచర్యను చేయగలవారు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు మాత్రమే అటువంటి శక్తిని కలుగజేయగలడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చే జ్ఞానము కొరకును మరియు ఆయన శక్తి కొరకును మనము దేవునికి ప్రార్థించాలి. ఎఫెసీ క్రైస్తవుల కొరకు పౌలు ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ జ్ఞానము కొరకును, శక్తికొరకును ప్రార్థించాడు(ఎఫెసీ 1:17-19, 3:18). వీటి కొరకు మనం కూడా ప్రార్థించాలి.