బైబిలంతటిలోనూ మెల్కీసెదెకు మూడు వచనాల్లో మాత్రమే ప్రత్యక్ష మవుతున్నప్పటికీ మన ప్రభువు అతని క్రమములో ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడు (ఆదికాండము. 14:18-20) మెల్కీసెదెకు చేసిన అంతటి అద్భుత కార్యమేమిటి? అబ్రాహాము అవసరతలు ఏమిటో తెలియకుండానే, దేవుడు చెప్పినట్లుగా చేయటం ద్వారా మెల్కీసెదెకు అబ్రాహాముకు గల మూడు అవసరతలు తీర్చాడు.
మొట్టమొదటిగా అతను అబ్రాహాము కోసం కొంత ఆహారము తీసుకువచ్చాడు. మెల్కీసెదెకు వివేచనాపరుడు! ఆత్మీయులంటే వారు వైరాగ్యం కలిగి ఉండే వారు అనే భావన కలిగి ఉండే అతిఆత్మీయులవలె అతడు లేడు. ఉపవాసముండి ప్రార్థించమని అతడు అబ్రాహాముకు చెప్పలేదు కానీ అతనికి మంచి ఆహారము తెచ్చిపెట్టాడు.
చాలా సంవత్సరాల తరువాత దేవుడు ఏలియా జీవితంలో సరిగ్గా ఇదే పని చేశాడు. అప్పుడు ఏలియా అలసిపోయి నిరుత్సాహంతో నిండివున్నాడు. దేవుడతని దగ్గరకు ఒక దూతను పంపాడు - ఒక "హెచ్చరికతో" కాదుగానీ బలమిచ్చే మంచి భోజనంతో పంపాడు (1 రాజులు 19:5-8)
ఇది మనము అనుసరించదగిన ఒక మంచి ఉదాహరణ - అలసి సొలసి పడివున్న ఓ సహోదరుడి కోసం లేక ఓ సహోదరి కోసం భోజనము సమకూర్చుట. ఒక విశ్వాసి నిరాశా నిస్పృహలతో పడివున్నప్పుడు అతనికి కావలసిందల్లా కొంత మంచి ఆహారము కాని హెచ్చరిక కాదు- ఎందుకంటే అతడు ప్రాణము, ఆత్మ మాత్రమే కలిగిలేడు గానీ అతనికి శరీరము కూడాఉంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు!
భోజనము పెట్టిన తరువాత మెల్కీసెదెకు అబ్రాహాముకు ఆత్మీయముగా కూడా సహాయపడ్డాడు - అది అతనికి బోధచేయటంవల్ల కాదు కానీ రెండే రెండు వాక్యాల్లో అబ్రాహాము విజయం గూర్చి దేవుణ్ణి స్తుతించాడు.
"ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక" అని చెప్పెను (ఆది 14:19,20).
బహుశా మెల్కీసెదెకు అబ్రాహాముకు, అతని సేవకులకు భోజనం పెట్టటానికి రెండు గంటలైనా పట్టిఉండవచ్చు. దేవుణ్ణి స్తుతించుటకు పదిహేను సెకెన్లు పట్టిఉండవచ్చు. కానీ మెల్కీసెదెకు యొక్క సంక్షిప్త స్తుతిలో అబ్రాహాము రెండు విషయాలు గుర్తించాడు.
మొట్టమొదటిదిగా తాను భూమ్యాకాశములకు కర్తయైన దేవునికి చెందిన వాడనని అబ్రాహాము గుర్తించాడు. అది కొల్లగొట్టుకొచ్చిన సొదొమ రాజుకు చెందిన ధనరాశులపట్ల ఉన్న దురాశ నుండి అతని విడిపించింది. సొదొమ ధనవంతమైన పట్టణము, ఆ ధనరాసులు ఎంతో విలువైనవి, అయినప్పటికీ తన దేవుడి సొత్తయిన భూలోక పరలోకముల ముందు అవి పనికిరాని చెత్తగా అబ్రాహాముకు కనబడుతున్నాయి. అతడు ఎవరికి సంబంధించినవాడో అను సత్యాన్ని మెల్కిసెదెకు అబ్రాహాముకు స్పష్టముగా చూపించాడు.
ఇక్కడ మెల్కీసెదెకు జ్ఞానమును గమనించండి. "నీవు దురాశాపరుడవవుతున్నావని దేవుడు నాకు చెప్పాడు అందుచేత నిన్ను ముందుగా హెచ్చరించుటకు దేవుడిచ్చిన మాటతో వచ్చాను" అని అబ్రాహాముతో చెప్పలేదు. నీ కోసం "దేవుని ప్రవచనము" తమవద్ద ఉందని ఎల్లప్పుడు చెప్పుకుంటూ తిరిగే స్వయం నియామక "ప్రవక్తల" గూర్చి జాగ్రత్తగా ఉండండి. అటువంటి "ప్రవక్తలు" అబద్ధ ప్రవక్తలు. మెల్కీసెదెకు అబ్రాహాము దృష్టిని దోపుడు ధనముపైనుండి దేవుని వైపుకు త్రిప్పాడు. దాంతో భూసంబంధమైన వస్తువులపై అబ్రాహాము కనుదృష్టి మసక బారింది. ప్రజలకు సహాయపడె విధానం ఇదే.
రెండవదిగా, ఆ శత్రురాజులను జయించింది తానూ, తన 318 మంది సేవకులు కాదు గానీ దేవుడేనను వాస్తవాన్ని అబ్రాహాము చూచాడు! అది మరో ప్రత్యక్షత - అది అబ్రాహామును గర్వమునుండి రక్షించింది. మరోసారి అబ్రాహాముదృష్టిని తన విజయమునుండి దేవుని వైపుకు త్రిప్పుటలో మెల్కీసెదెకు విజయము పొందాడు!
మన దృష్టిని మననుండి, మన సొంత విజయాలపైనుండి ప్రభువు వైపుకు త్రిప్పగలిగిన వాడే శ్రేష్టుడైన బోధకుడు.
ఇప్పుడు మనము ఈ కథలో అత్యుత్తమ భాగానికి వచ్చాము - అబ్రాహామును ఆశీర్వదించిన తరువాత మెల్కీసెదెకు అదృశ్యమైపోయాడు. మళ్ళీ అతన్ని గూర్చి బైబిలు గ్రంథములో మరెక్కడా చదవము. అతని నామము యేసుకు సాదృశ్యముగా మాత్రమే కనబడుతుంది.
తాను ఆరోజు ఏమి చేయాలో దేవుడు చెప్పినప్పుడు మెల్కీసెదెకు తన గుడారములో ఉదయకాల ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు. అతనికి అబ్రాహాము తెలియదు కానీ దేవుడు బాగా తెలుసు. అదిచాలు. దేవుడతనికి ఏమి చేయాలో చెప్పాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు.
మెల్కీసెదెకు క్రమము చొప్పున పిలువబడిన యాజకులమైన మనకు ఎంత గొప్ప పరిచర్య ఉందో చూడండి! మనము ప్రజలను భౌతికముగా, ఆత్మీయముగా ఆశీర్వదించాలి - ఎవ్వరూ మనకు వందనాలు చెప్పకముందే వెంటనే అదృశ్యమైపోవాలి.
నీవు ఒక గొప్ప దైవజనుడవని నిన్ను గూర్చి ప్రజలు భావించాలని నీవు కోరుకుంటున్నావా? లేక నీ "దేవుడు గొప్పవాడు" అని ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నావా? ఇక్కడ మతపరమైన పరిచర్యకూ, ఆత్మీయ పరిచర్యకూ మధ్య వ్యత్యాసము దాగివుంది. అహరోను యాజకత్వానికి మెల్కీసెదెకు యాజకత్వానికి మధ్యగల తారతమ్యము కనబడుతుంది. అహరోను ఎల్లప్పుడు ప్రజల మధ్య కనబడుతూ వారినుండి ఘనత పొందుతూ వచ్చాడు. మెల్కీసెదెకైతే ప్రజలకు సేవచేసి అదృశ్యమైపోయాడు!
యేసు కూడా తన భూలోక జీవితములో ఈ విధముగానే పరిచర్యచేశాడు. జీవన పోరాటాల్లో ఎదురు దెబ్బ తిన్న ప్రజల ఆత్మీయ, భౌతిక అవసరతలు తీరుస్తూ తిరిగాడు. తాను చేస్తున్న స్వస్థతల గూర్చి ప్రచారము చేయమని తాను ఎవ్వరినీ కోరలేదు. స్వస్థపరచే వాడిగా ప్రసిద్ధి పొందాలని ఆయన కోరుకొనలేదు. రాజుగా కావాలని కూడా ఆయన ఎన్నడూ కోరుకోలేదు. ఇతరులను సేవించి వారికోసం తన ప్రాణం బలిగా అర్పించుటకే ఆయన వచ్చాడు. పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన ఆరాట పడలేదు. తాను దేవునికుమారుడని నిరూపించుటకు పునరుత్థానుడైన తరువాత హేరోదు, పిలాతు, అన్నకయపలకు ప్రత్యక్షము కావాలని కూడా ఆయన కోరుకోలేదు. తన పునరుత్థానము తరువాత ఒక్క పరిసయ్యుడికి గానీ, సద్దూకయ్యుడికి గానీ ఆయన ప్రత్యక్షము కాలేదు. ఎందుకంటే మానవుల ముందు తన్ను తాను సమర్థించుకోవాలని కోరలేదు. మానవ ఉద్దేశ్యాలు చెత్తకుండీలో వేయుటకు మాత్రమే పనికి వస్తాయని ఆయనకు బాగా తెలుసు!
ప్రతిరోజూ దేవుని మాటలు వింటూ, ఏమి చేయాలో ఆయన దగ్గర విచారణ చేస్తూ మెల్కీసెదెకు వలె జీవించనారంభిస్తే ఏమిజరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి జీవితము ఈ భూలోకములో ఎవరైనా జీవించదగిన అత్యంత ప్రయోజనకర జీవితము.
మనలను కలసిన వారుకూడా భౌతికముగా, ఆత్మీయముగా ఆశీర్వదింపబడుటకు అటువంటి జీవితాలు జీవించుటకోసము మనము పిలువ బడలేదా?. మనమందరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకులుగా ఉండుటకు పిలువబడ్డాము.