వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

పాతనిబంధనలో దేవుడు యూదులకు అనేక సబ్బాతులు అనుగ్రహించాడు. అందులో ప్రతి శనివారం సబ్బాతుదినం అనేది చాలామందికి తెలియును. అయితే మరికొన్ని సబ్బాతులు కూడా ఉన్నాయి. ప్రతి ఏడవ సంవత్సరము ఒక సబ్బాతు సంవత్సరముగా ఉన్నది (లేవి 25:2-4). ప్రతి యాబైయవ సంవత్సరము సబ్బాతు సంవత్సరముగా ఉండెను. ఈ యాబైయవ సంవత్సరపు సబ్బాతు జూబిలీ(సునాదము)గా పిలువబడింది(లేవి 25:8-12).

ఆ జూబిలీ సంవత్సరములో ఇశ్రాయేలీయులు "అప్పుచేసి బానిసలుగా ఉన్న దేశవాసులందరికి విడుదల కలిగినదని చాటించవలెను", మరియు "మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును మరల తిరిగి పొందవలెనని(అప్పులన్ని కొట్టివేయబడె సమయముగా)" ప్రకటించవలెను.

ప్రతి ఏడవ సంవత్సరము అప్పులన్నియు కొట్టివేయవలెనని దేవుడు ఆజ్ఞాపించియున్నాడు. అప్పుడు అప్పిచ్చువాడు దేవుడు ప్రతి ఒక్కరిని విడిపించియున్నాడు గనుక ప్రామిసరీ నోటు మీద "చెల్లించబడెను" అని వ్రాయవలెను (ద్వితీయోపదేశకాండము 15:1-10 జాగ్రత్తగా చదవండి).

సబ్బాతు సంవత్సరములు ఎంతో సంతోషకరమైనవి మరియు ఆశీర్వాదకరమైనవి. సునాదమనగా సంతోషంతో హర్షించుట. ప్రతి దోషము క్షమించబడి మరియు అచ్చియున్నవాడు విడుదలపొందును గనుక ఈ సునాద సంవత్సరము ఎంతో సంతోషకరమైనది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులలో సునాద సంవత్సరము గూర్చి యిట్లనెను -'అది మీకు ఎంతో సంతోషకరమైన సంవత్సరమైయుండును'(లేవి 25:11 లివింగ్ బైబిల్).

ఇప్పుడు కొత్తనిబంధనలో వారములో ప్రతిరోజు సబ్బాతు దినమే. ఎందుకనగా ప్రతిరోజు దేవునికి ప్రతిష్టించబడిన దినము.

మనము ఎల్లప్పుడు మనకు హానిచేసిన వారిని, కీడుచేసిన వారిని క్షమించుచు ఉండెదము గనుక ప్రతి సంవత్సరము మనము జూబిలి సంవత్సరముగా సంతోషించెదము. ఆ విధముగా మన జీవితములో ప్రతి సంవత్సరము సునాద సంవత్సరముగా సంతోష సంవత్సరముగా ఉండును.

దేవుడు మనయెడల కనికరము గలవాడైనట్టు మనము కూడా ఇతరుల యెడల కనికరము గలవారైయుండుటకు పిలువబడ్డాము. "దేవుడు మనయెడల ఏమైయున్నాడో" అనుదానిని మన మనస్సులో పెట్టుకొని మనుష్యుల యెడల మనము ఆ విధముగా ఉండవలెను.

ప్రభువు యొద్దనుండి అనేక విషయములను ఉచితముగా పొందియున్నాము. అదేవిధముగా మనము పిసినిగొట్టుగా కాకుండా విశాలహృదయము కలిగి విస్తారముగా ఇచ్చెదము (మత్తయి 10:8).

దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆశ్చర్యకరమైన పాపక్షమాపణను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకొనవలెను. ప్రభువైనయేసు కలువరి సిలువలో మనకొరకు చేసిముగించిన దానినంతటికి కృతజ్ఞత వ్యక్తపరుస్తూ మన జీవితములను జీవించాలి.

మనము సమస్త దౌర్భాగ్య స్థితినుండి రక్షింప బడగలమనునదియే సువార్తయొక్క శుభవార్త. జీవజల నదులు మనలోనుండి ఎల్లప్పుడు ప్రవహించే జీవితమును కలిగియుండి మనకు కలుసుకునే ప్రతి కుటుంబమునకు ఆశీర్వాదముగా ఉండవచ్చును.

దేవుడు మనలను కనికరించినట్లు మనము కూడా ఇతరులను కనికరించవచ్చును.

దేవుడు మనలను విడిపించినట్లు మనము కూడా ఇతరులను విడిపించవచ్చును.

దేవుడు మనలను ఆశీర్వదించినట్లు మనము కూడా ఇతరులను ఆశీర్వదించవచ్చును.

దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించినట్లు మనము కూడా ఇతరులకు అనుగ్రహించవచ్చును.

దేవుడు మన యెడల విశాలహృదయము కలిగియుండినట్లు మనము కూడా ఇతరుల యెడల విశాలహృదయము కలిగియుండవచ్చును.

ఇతరులు మనలను ఏ విధముగా అయినను గాయపరచినను, హానిచేసినను వారిని క్షమించుచు విడిపించుచుండినట్లయితే ఈ సంవత్సరము మరియు రాబోయే సంవత్సరములన్నియు మనకు ఎంతో సంతోషకరముగా ఉండును. మనలో ఉన్న పగ ద్వేషమంతటిని పాతిపెట్టి మనుష్యులందరి యెడల కనికరపడి ఈ రోజునుండి ఒక నూతన ఆరంభమును ప్రభువుతో ఆరంభించెదము.