WFTW Body: 

కొన్నిసార్లు ప్రజలు మనపై నిజంగా కోపం తెచ్చుకునే పరిస్థితులలోకి మనం వెళ్తాము. మనం చిన్నతనంలో కూడా దానిని అనుభవిస్తాము. ఉదాహరణగా, ఇంట్లో తోబుట్టువులతో గొడవలు జరుగుతాయి, పాఠశాలలో రౌడీ పిల్లలు లేదా క్రూరమైన స్నేహితులు ఉంటారు. మనం పెద్దయ్యాక సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు మనపై కోపం తెచ్చుకుంటారు. నెలలు, సంవత్సరాలు కూడా మనతో మాట్లాడకపోవచ్చు. బహుశా మనం ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, అది మన తప్పు, బహుశా మనం వారికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండవచ్చు. లేదా అది ప్రాథమికంగా మన తప్పు కాదు కానీ ఏదో జరిగి దాని గురించి వారు మనపై కోపంగా ఉన్నారు.

అది మనకు కోపం వచ్చేలా చేస్తుంది, లేదా వారు మనల్ని క్షమించకపోవడం విచారానికి, ఆందోళనకు గురిచేస్తుంది. మనతో కోపంగా ఉన్నందుకు వారు చాలా భక్తిహీనులుగా ఉన్నారని మనం భావించి వారిని చిన్నచూపు చూడవచ్చు. దీనిలో ఏదీ దేవుని సంకల్పం కాదు.

ఎవరైనా మనపై కోపంగా ఉంటే ఏం చేస్తాం?

మొదటి విషయం మనల్ని మనం తగ్గించుకోవడం అని నేను నమ్ముతున్నాను. మనల్ని మనం తగ్గించుకోవడంలో ఒక భాగం: మొదటిగా మనమే పునరుద్ధరణను (సంగతులను సరిచేయుటకు) కోరుకోవడం.

ఒక వాదనలో, ఎవరైతే క్షమాపణ మరియు పునరుద్ధరణ కోరుతారో వారే అత్యంత ఆత్మీయమైన వ్యక్తి. నేను యేసును అనుసరించాలనుకుంటే, నేను మొదట పునరుద్ధరణను వెతకాలి.

మత్తయి 5:23-24లో, మన సహోదరుడు మనతో కోపగించినట్లయితే, మనం దేవుని వద్దకు రాకముందే అతనితో రాజీపడి సమాధానపడేందుకు ప్రయత్నించాలని యేసు చెప్పాడు. క్షమాపణ చెప్పండి, సరిచేసుకోండి, పునరుద్ధరించటానికి ప్రయత్నించండి - బహుశా తప్పు మనదే కావచ్చు. మనం తప్పు చేయనప్పటికీ పునరుద్ధరణను కోరవచ్చు... బహుశా మనం చేయని తప్పుకు కూడా క్షమాపణ చెప్పవలసి ఉంటుంది! ఆయన చేయని అనేక పాపాల కోసం మరణించిన యేసు హృదయం అదే అని నేను నమ్ముతున్నాను - మనకు మనం చనిపోవాల్సి వచ్చినా సయోధ్య కోసం వెతకండి. అవతలి వ్యక్తి మన క్షమాపణను అంగీకరిస్తారని ఖచ్చితంగా చెప్పలేము, అయితే ప్రశ్న ఏమిటంటే, శాంతిని పునరుద్ధరించడానికి మనం చేయగలిగినదంతా చేశామా:

రోమా 12:18 - "మీకు సాధ్యమైనంతవరకు మనుష్యులందరితో సమాధానంగా జీవించండి."

నన్ను నేను తగ్గించుకోవడంలో భాగంగా నేను చూసిన మరొక విషయం ఏమిటంటే, దేవుడు నన్ను ఎంతగా క్షమించాడో మరియు ప్రతి క్షణం నాపై ఎంత దయను కుమ్మరిస్తున్నాడో గుర్తుంచుకోవడం.

ఉదాహరణకు, నా బిడ్డ అవిధేయతతో చేసిన పనికి నాకు కోపం వచ్చినప్పుడు నాకు సహాయపడే వాటిలో ఒకటి, నా కోపం నా పిల్లల అవిధేయత కంటే చాలా తీవ్రమైనదని గుర్తుంచుకోవడం, ఎందుకంటే నేను పెద్దవాడిని మరియు నాకు ఎక్కువ తెలుసు! దేవుడు తన ప్రేమ, దయ, క్షమాపణ గురించి నాకు చెప్పాడు, మరియు నేను దేవునికి అవిధేయుడిగా ఎలా ఉన్నానో నాకు బాగా తెలుసు… కాబట్టి నా పిల్లలు అవిధేయత చూపినందుకు నాకు నిజంగా కోపం వచ్చినప్పుడు, వారి కంటే ఎక్కువగా నాకు దేవుని నుండి కృప మరియు దయ అవసరం అనేది గుర్తుచేసుకోవడానికి సహాయపడుతుంది.

అవతలి వ్యక్తితో రాజీపడేందుకు మనం చేయగలిగినదంతా చేసినప్పటికీ వారు మనపై కోపంగా ఉన్నట్లయితే, అది మనల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది, కలత చెందుటకు, వారిపై కోపం తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇతరులు నన్ను త్వరగా క్షమించని ఇలాంటి పరిస్థితుల్లో నేను కొన్నిసార్లు వారితో చాలా విసుగు చెందాను. నేను నా విశ్రాంతిని మరియు బలాన్ని దేవునిలో మాత్రమే కనుగొనాలని తెలుసుకున్నాను - ఆయన ప్రేమ మరియు ఆమోదం మాత్రమే ముఖ్యమైనవి.

దావీదు దీనికి ఒక గొప్ప ఉదాహరణ: 1 సమూయేలు 30:6లో ప్రజలు అతనిని రాళ్లతో కొట్టాలని మాట్లాడినందున దావీదు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ప్రజలందరూ వారి కుమారులు మరియు కుమార్తెలను బట్టి కోపంగా ఉన్నారు. అయితే దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి తనను తాను బలపరచుకున్నాడు.

మనం నిలబడేది మన తండ్రి ప్రేమలో. వేరే వారి ప్రేమ లేదా ఆమోదంలో కాదు. ఆయన ఆమోదం మరియు ప్రేమ మాత్రమే మనం బలపరచబడుటకు అవసరం.

ఎవరైనా నాతో మాట్లాడకపోతే, దేవుడు ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నాడని ప్రోత్సహించబడగలను! నేను పశ్చాత్తాపపడిన తర్వాత కూడా ఎవరైనా నా పాపాన్ని నాకు వ్యతిరేకంగా ఎత్తి చూపుతున్నట్లయితే నేను చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఆవిధంగా ఎత్తి చూపుటలేదు! దేవుడు ఇకపై నా పాపాన్ని నాకు వ్యతిరేకంగా ఉంచడం లేదు, నా పాపాన్ని ఎవరైనా నాకు వ్యతిరేకంగా కలిగి ఉండండం కంటే అది చాలా ముఖ్యమైనది.

ఇతరులు మనపై కోపంగా ఉండి వెంటనే మనల్ని క్షమించకపోతే లేదా పునరుద్ధరణ కోరుతూ మనకు ప్రతిస్పందించకుంటే, వారిని వెంటనే వదులుకోవద్దు. దేవుడు మనతో ఉన్నట్లే మనం వారి పట్ల సహనంతో ఉండాలి. మనము క్షమాపణలు చెప్పినప్పటికీ వారు మనల్ని ఇంకా క్షమించనట్లయితే, వారి కోపం చల్లబడటానికి కొంత సమయం అనుమతించాలి. ఇది బార్బెక్యూలో(బొగ్గుల శెగలో) వంట చేయడం లాంటిది - మీరు దానిలో బొగ్గులు వేసి వాటిని వెలిగిస్తారు. కాసేపు అక్కడ పెద్ద మంటలు మండుతాయి. మీరు ఆ మంటలపై వంట చేయలేరు - ఆ బొగ్గులతో ప్రయోజనకరంగా వంట చేయడానికి మీరు మంటలు ఆరిపోయి కేవలం వేడి వచ్చేవరకు వేచి ఉండాలి. అదే విధంగా కొన్నిసార్లు మీ చర్చలు లాభదాయకంగా ఉండటానికి ముందు ఎదుటి వ్యక్తిలో కోపం యొక్క మంటలను చల్లారనివ్వాలి. దేవుడు నాపట్ల సహనం చూపినట్లే నేను ఇతరులతో సహనంతో ఉండటం నేర్పడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు.

"కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి" (1 పేతురు 3:9) అని బైబిలు చెప్తుంది. మనం యేసులా ఉండాలనుకుంటే, చెడుకు ప్రతిఫలంగా చెడు చేయకుండా మంచి చేయటం కంటే సరియైన మార్గం మరొకటి లేదు. శత్రుత్వానికి సున్నితమైన మాటలతో తిరిగి చెల్లించండి (సామె. 15:1). మరొకరి పగకు, సహనం మరియు దయతో తిరిగి చెల్లించండి. ఇది యేసు జీవిత కథ - ఆయనను తృణీకరించిన ప్రపంచం కోసం తన ప్రాణాలను అర్పించడానికి వచ్చాడు. ఆయననే మనం చూడాలి.

"మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి" (హెబ్రీయులు 12:3).

యేసు వైపు చూడడం ద్వారా మరియు ఆయన ఎంత సౌమ్యుడో, శత్రుత్వాన్ని సహనంతో మరియు దయతో ఎంతగా సహించాడో చూడటం ద్వారా మనం ప్రోత్సహించబడవచ్చు.

దేవుడు తన ఆత్మ యొక్క శక్తి ద్వారా మనలోని కోపాన్ని స్వాధీనపరచుకోవడానికి మరియు ఇతరుల పట్ల ప్రేమతో (మన శత్రువులతో సహా), మన ప్రతిస్పందనలలో తెలివిగా, ఇతరులు మనపై కోపంగా ఉన్నప్పుడు సహనంతో మరియు దయతో ఉండటానికి సహాయం చేస్తాడు.