వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు శిష్యులు
WFTW Body: 

2 రాజులు 4 : 8-37లో ఎలీషా పరిచర్యలో ఆశీర్వాదించబడిన ధనవంతురాలు, పలుకుబడి గలిగిన మరియు పేరుప్రతిష్ట గలిగిన స్త్రీని గూర్చి చదువుతాము. దేవుడు కేవలము బీదవారిని, చదువుకొనని వారిని మాత్రమే దీవించడు. ఆయనకు పక్షపాతము లేదు. ఆయన చదువు రాని పేతురును ఏర్పరచుకొన్నాడు అలాగే బాగుగా చదువుకున్న పౌలును కూడా ఏర్పరచుకొన్నాడు. పేతురుకు లేఖనములను గూర్చి ఎక్కువగా తెలియదు కాని పౌలు లేఖనములను బాగుగా ఎరిగిన పండితుడు. ధనవంతులైన స్త్రీలు కొందరు ప్రభువైనయేసుకు మరియు ఆయన శిష్యులకు వారి ఆస్తితో(ధనముతో) ఉపచారము చేశారు. వారు విశ్వాసులు కాబట్టి ప్రభువు వారి యొక్క పెద్ద బహుమానములను స్వీకరించారు (లూకా 8 : 3).

ఇక్కడ కూడా ఒక ధనవంతురాలైన స్త్రీ ఎలీషాకు సహాయము చేయుటకు నిర్ణయించుకున్నది. ఈమె ఒక విశ్వాసురాలు ఎందుకనగా అతడు వచ్చినప్పుడెల్లను తన భర్తతో ఇట్లనినది, "ఇతడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును". ఎలీషా యొక్క ఒక ప్రసంగము కూడా వినకుండా, అతడు భక్తిగల దైవజనుడని ఏ విధముగా గుర్తించింది? అతడు తినునప్పుడు అతని ప్రవర్తనను ఆమె గమనించియున్నది. ఇది మనకు ఎంత మాదిరిగా ఉన్నది? చిన్న విషయాలలో కూడా మనము దైవజనుని గుర్తించగలము అనగా అతడు కూర్చునే విధానము, మాట్లాడే విధానము మరియు ఇతర విషయాలలో అతని ప్రవర్తన ద్వారా గుర్తించగలము. మనము అతని యొక్క ప్రసంగములను విననవసరము లేదు.

కాబట్టి అతనికి ఒక గది కట్టించి అందులో అతనికొరకు మంచము, బల్ల, పీట మరియు ద్వీపస్తంభము ఉంచాలని ఆమె నిర్ణయించుకొన్నది. ఇవి తనకు కావలెనని ఎలీషా కనీసము సలహా కూడా చెప్పలేదు. కాని ఆమె ఒక దైవజనురాలుగా ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తిగా ఆవిధముగా నిర్ణయించుకొన్నది. దేవుడు తన సేవకులకు వారు ఊహించని రీతిగా ఇటువంటి విశ్రాంతి స్థలాలను ఇస్తాడు. కాని ఒక నిజమైన దైవజనుడు వారికి రుణపడియుండడు. కాబట్టి తన దాసుడైన గెహాజీతో "నేను నీకు ఏమి చేయవలెనని" కోరుచున్నావని ఆమెను అడుగమన్నాడు. ఆమెకు సంతానములేదని గెహాజీ చెప్పాడు. అప్పుడు ఎలీషా ప్రార్ధించి, నీకు ఒక సం||లో బిడ్డపుడతాడని చెప్పాడు మరియు అలాగే జరిగింది.

ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైయ్యాడు మరియు అతనికి జబ్బు వచ్చి చనిపోయాడు (2 రాజులు 4 : 20). ఆమె అతనిని భూస్థాపితము చేయకుండా ఇట్లనినది, "మొదట దైవజనుని యొద్దకు వెళ్ళి వచ్చెదనని" చెప్పిన ఆమె విశ్వాసాన్ని గూర్చి ఆలోచించండి (2 రాజులు 4 : 22). ఆమె ఎలీషా దగ్గరకు వెళ్ళింది. ఆమె దూరమున ఉండగానే అతడు గెహాజీని ఇట్లడగమన్నాడు. "నీవును, నీ పెనుమటియు, నీబిడ్డయు సుఖముగా ఉన్నారా? (2 రాజులు 4 : 26). చనిపోయిన ఆమె బిడ్డ గురించి విశ్వాసముతో ఆమె చెప్పిన మాటను వినండి, "సుఖముగా ఉన్నాము". ఎంతగొప్ప విశ్వాసమది. ఎలీషా వెళ్ళి ప్రార్ధించగా అతడు బ్రతికాడు. ఒక తల్లి యొక్క విశ్వాసము తన బిడ్డ కొరకు ఎంతగొప్ప కార్యము చేయగలదో చూచుట ఎంతో ఆశ్చర్యకరము. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె పొందుకొనియున్నది. అందువలననే విశ్వాస వీరులలో ఆమె కూడా చెప్పబడింది. "స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన పొంది మరియు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు (హెబ్రీ 11 : 35,39). ఒకవేళ ఆమెకు విశ్వాసము లేనట్లయితే, తన బిడ్డను భూస్థాపితము చేసియుండెడిది. తన యెడల విశ్వాసముగలవారిని ప్రభువు కనుగొనినప్పుడు ఆయన ఎంత గొప్ప అద్భుతములు చేస్తాడో గదా! ఆమెన్.