గలతీ 5:1లో, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. కాబట్టి మనలను ధర్మశాస్త్రమనే కాడి క్రిందకు తెచ్చుటకు ఎవరికైనను అవకాశం ఇవ్వకూడదు. ఏ సంఘముగాని లేక సమాజముగాని చేసినటువంటి నియమనిబంధనలకు మనము ఎన్నటికి బానిసలము కాకూడదు. అలాగే ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలు చేయుటకు హేతువు కాకూడదు (గలతీ 5:13). చాలామంది విశ్వాసులు కృపను మరియు క్రైస్తవస్వాతంత్ర్యమును అర్ధం చేసుకొనలేక పాతనిబంధన విశ్వాసులకంటే కూడా దిగజారి శరీరయిచ్ఛలకు బానిసలుగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి మరియు ఆయనతో నడిపింపబడుటయే ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుటకు సరైన మార్గము. లేనట్లయితే మనము పాపములో జీవించెదము. మనం ఆత్మానుసారముగా నడిచినయెడల, శరీరయిచ్ఛను నెరవేర్చము. అటువంటి విశ్వాసులు మాత్రమే ధర్మశాస్త్రము నుండి విడుదల పొందియున్నామని చెప్పగలరు (గలతీ 5:16-18). కాబట్టి ఒక విశ్వాసి మూడు స్థాయిలలో జీవించవచ్చును.
ఈ మూడు స్థాయిలలో జీవించుటను ఒక భవనములోని మూడు అంతస్థులతో పోల్చవచ్చును. నీవు 3వ అంతస్థులో జీవించనట్లయితే (అనగా ఆత్మతో నింపబడి నడిపించబడనట్లయితే) నీవు 2వ అంతస్థును పాడుచేసి (పాతనిబంధన స్థితి) మొదటి అంతస్థుకు దిగజారెదవు (అనగా శరీరానుసారముగా నడుచుట). "ప్రభువైనయేసు ధర్మశాస్త్రమును కొట్టివేసియున్నారు కాబట్టి నేను ధర్మశాస్త్రానుసారముగా నడుచుకోను" అని నీవు చెప్పినట్లయితే నీవు ఆత్మానుసారముగా నడుచుకొనుట మంచిది. లేనట్లయితే నీవు శరీరానుసారముగా నడిచెదవు. అనేకమంది విశ్వాసుల విషయములో ఇదే జరిగింది. మనం ధర్మశాస్రము క్రింద లేమని వారు గలతీ పత్రికలో చదివియున్నారు. కాని వారు ఆత్మానుసారముగా నడుచుకొనరు. దాని ఫలితముగా వారు శరీరానుసారముగా జీవించుచున్నారు. అందువలన ఈనాటి క్రైస్తవ నాయకులు ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారికంటే నీచమైన కార్యములు చేయుచున్నారు. మేము కృపలో ఉన్నామని చెప్పుకొనే విశ్వాసులు శరీరానుసారముగా జీవిస్తున్నారు. ఎందుకనగా వారు ధర్మశాస్త్రమును త్రోసివేసియున్నారు. కాబట్టి "మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారుకారు" (గలతీ5:18). పరిశుద్ధాత్మచేత నడిపించబడనివారికి ధర్మశాస్త్రము అవసరము.
"ధర్మశాస్త్రమును త్రోసివేయుడి" అను సందేశము గలతీ పత్రికలో లేదు. "నీవు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మలో జీవించినయెడల నీవు ధర్మశాస్త్రమును త్రోసివేయవచ్చును". శరీర కార్యములను గూర్చి పరిశుద్ధాత్ముడు వివరించాడు (గలతీ 5:19-21). అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు మొదలగునవి. వీటిని అవిశ్వాసులలో మాత్రమే కనుకొనగలమా? కాదు. విశ్వాసులు అని పిలువబడేవారిలో కూడా ఈ పాపములు చేయుచున్నారు. ఎందుకని? ఎందుకనగా వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారముగా జీవించకముందే ధర్మశాస్త్రమును త్రోసివేసియున్నారు. అటువంటివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు (గలతీ 5:21). ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారముగా నడుచుకుంటారో వారిలో ఈ ఆత్మ ఫలాన్ని చూస్తాము. ఆత్మ ఫలమేమనగా “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాశత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహము" (గలతీ 5:22,23). మనము ఆత్మను అనుసరించి జీవించినట్లయితే, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము.