వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు శిష్యులు
WFTW Body: 

2 కొరింథీ 5:20లో “దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై-దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము” అని చదువుతాం. యేసుక్రీస్తుకు రాయబారులముగా ఉండుటకు పిలువబడుట ఎంతో ధన్యకరమైయుంది. అది నిజమైన దేవుని బిడ్డకున్న గౌరవం. ఒక చిన్న దేశానికి రాయబారిగా ఉన్నను గౌరవముంటుంది. ఎంత పెద్ద దేశమైతే రాయబారిగా ఉండుట అంత గౌరవముగా ఉంటుంది. ఇండియాలో ఉన్న అమెరికా రాయబారి గురించి ఆలోచిద్దాం. ప్రపంచంలోనే అతిగొప్ప దేశానికి రాయబారిగా ఉన్నాడు కాబట్టి అతడెంత గౌరవంతో నడుచుకుంటాడో మీరు ఊహించగలరా? అతడు అమర్యాదగా, చవకబారుగా ఏదియు చెయ్యడు. అతడు ధనముకొరకు బిక్షమెత్తడు(అడుగడు) మరియు అతని దేశానికి నిందనుతెచ్చే దేదియు అతడు చెయ్యడు. అమెరికా రాయబారి మీయింటికి వచ్చి, వారి దేశ సహాయం కొరకు డబ్బును అడుగుటను మీరు ఊహించగలరా?

ఒక వ్యక్తి సూట్ మరియు బూట్ వేసుకొని మీ ఇంటికి వచ్చి (లేక టీవిలో గాని వచ్చి) “నేను అమెరికాదేశ రాయబారిని. మాదేశం ఎంతో ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నది కాబట్టి మాపని కొరకు రూ.100 సహాయం చేయగలరా?” అని చెప్పినట్లయితే, నీవేమి చెబుతావు? నీవిట్లంటావు, ”నీవు మోసగాడివి నువ్వు అమెరికా రాయబారివి కావు. అమెరికా రాయబారి ఈవిధంగా డబ్బుకొరకు బిక్షమెత్తడు”.

మరొకవ్యక్తి మీయింటికివచ్చి, లేక టివీలో నుండి, “నేను ప్రభువైన యేసుక్రీస్తుయొక్క రాయబారిని. మా పరిచర్యకు డబ్బు ఎంతో అవసరం ఉంది. మా పరిచర్యకు రూ.100 సహాయం చేయగలరా” అని అడిగితే, మీరు అతనిని నమ్మి మరియు ఆడబ్బును ఇస్తారు. ఎందుకని? ఎందుకనగా అమెరికా రాయబారి గౌరవప్రదమైన వ్యక్తికాని ప్రభువైన యేసుక్రీస్తుయొక్క రాయబారి బిక్షగాడని మీరు నమ్ముచున్నారు.

ఈ విశ్వమంతటిలో సర్వశక్తిగల దేవుని రాజ్యమే అత్యంత శక్తి కలిగియున్నది. అమెరికా రాయబారి ఈ లోకములోని శక్తివంతమైన దేశానికి మాత్రమే రాయబారి. కాని నేను ఎంతో దీనుడనై చెప్పుచున్నాను, నేను ఈ విశ్వమంతటిలో శక్తిగల రాజ్యానికి రాయబారినని చెప్పగలను. ప్రభువైనయేసు యొక్క నిజమైన శిష్యుడు ఆవిధంగా ఉంటాడు. అటువంటి రాయబారిగా గౌరవప్రదంగా ఉంటావానీవు? క్రైస్తవ పరిచారకులు గౌరవం లేకుండా టీవీలోను సంఘకూటాలలోను మరియు ఉత్తరములద్వారా డబ్బుకొరకు బిక్షం అడుగుతుంటే ప్రభువైన యేసునామం నిందించబడుతున్నందుకు నా హృదయంలో ఎంతో వేదన కలుగుతుంది. కీర్తన 50:12లో “లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను” అని ప్రభువు చెప్పుచున్నాడు. అలాగే నిజమైన దేవుని సేవకుడు కూడా చెప్తాడు. “నేను అవసరంలో ఉన్నను లేక ఆకలిగొనినను నేను మీకు చెప్పను. సమస్త భూమికి అధిపతియైన, పరలోకంలో ఉన్న నా యజమానికే చెప్పెదను”.ఒక రాయబారి ఎల్లప్పుడు తన స్వంత దేశంతో సహవాసం కలిగి యుంటాడు. ఒక్క రోజు కూడా తన దేశంతో సహవాసం చేయకుండా ఉండడు. ఆవిధంగా మనము కూడా జీవించాలి. ఇండియాలోని దేవుని సేవకులు బీదవారైయుండి, సైకిలుమీద వెళ్లుచున్నప్పటికీ, విశ్వమంతటిలో అత్యంత శక్తివంతమైన రాజ్యానికి రాయబారులకు తగినట్లుగా గౌరవంగా నడుచుకొనే రోజు రావాలని నేను కోరుచున్నాను. కాని అటువంటి క్రైస్తవ సేవకుల నెంతమందిని మీరు కలుసుకున్నారు? క్రైస్తవ సేవకులనేకులు గౌరవప్రదమైన బిక్షగాళ్లుగా ఉండి, ఎల్లప్పుడు ప్రజలను డబ్బు కొరకు అడుగుచూ, ధనవంతులగుటకు ప్రయత్నించుచున్నారు. ఇది చాలా బాధాకరం.

నీవు రైల్లోగాని, బస్సులోగాని మరి ఏవిధంగా ఎక్కడికి వెళ్లిననూ నీవు ప్రభువైన యేసుక్రీస్తు రాయబారివని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకొనుము.

2 కొరింథీ 6:3-10 లో పౌలు ఎలా జీవించాడో చెప్పుచున్నాడు “ మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏవిషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై, పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుక్షీర్తులవలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమై నట్లుండియు బాగుగా తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్నవారము; శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడనివారము; దుఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము”. ఆవిధంగా పౌలు జీవించాడు. ధనవంతులను చేసే సువార్త పౌలు నమ్మలేదు.