వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు పురుషులు
WFTW Body: 

యిర్మియా 15:16-21 లో దేవునికి ప్రత్యామ్నాయముగా మాటలాడువానికి ఉండవలసిన మూడు షరతులను మనము చూడగలము.

మొదటిగా: “దేవా! నీ మాటలు నాకు దొరికెను మరియు నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి”(16వ). దేవుని వాక్యము మాత్రమే నీకు సంతోషమును మరియు నీ హృదయమునకు ఆనందమును కలుగజేయునదిగా ఉండవలెను. డబ్బు సంపాదించుటలో వ్యాపారస్థులు సంతోషించినట్లే, నీవు కూడా దేవుని వాక్యమును పొందుటకు సంతోషించవలెను. ఈ దినములలో చాలామంది భోదకులుగా ఉండగోరెదరు కాని వారు సమయమును వెచ్చించి దేవుని వాక్యమును లోతుగా ధ్యానించరు మరియు దేవుని వాక్యమును వారి హృదయమునకు సంతోషమిచ్చేదిగాగాని మరియు ఆనందమిచ్చేదిగాగాని వారు చూడరు.


రెండవదిగా: "సంతోషించువారి సమూహములో నేను కూర్చుండలేదు" (17వ). యూదాలో ఉన్న ఇతర ప్రజలు సంతోషించుచూ ఉల్లసించుచుండగా, యిర్మియా మాత్రము దేవునితో ఒంటరిగా గడుపుటకు తనకు తానుగా వెళ్ళెను. ఈ లోకములో ఉన్న ఎగతాళి చేసేవారినుండి దూరముగా ఉండుటకు నిన్ను నీవు క్రమశిక్షణలో పెట్టుకొననియెడల, నీవు ఎన్నటికీ దేవునికి ప్రత్యామ్నాయముగా మాట్లాడేవాడుగా ఉండలేవు. మంచి జోక్స్ చెడ్డవని నేను చెప్పుటలేదు. కాని చాలామంది క్రైస్తవులకు ఇటువంటి విషయములలో ఎక్కడ ఆగిపోవలయునో తెలియదు - వారు ఎల్లప్పుడు జోక్స్(పరిహసము) చేయుదురు. అటువంటి ప్రజలతో సమయము గడపకుండునట్లు యిర్మియా నిశ్చయించుకొనెను.

మూడవదిగా: 18వ వచనములో యిర్మియా దేవునికి ఈ విధముగా ఫిర్యాదు చేసెను. “నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థతనొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా? నిలువని జలములవవుదువా?”. “అటువంటి విషయములు నీవెప్పుడు నాతో మాట్లాడవద్దు" అని ప్రభువు చెప్పెను. అటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడుటనుబట్టి దేవుడు యిర్మియాను గద్దించెను (19వ). దేవుడు మనలను ఎన్నటికీ దిగజారనివ్వడు. ఆయన నిలువని జలమయమువంటివాడు కాదు. యిర్మియా తన తలంపులమీద ఆధారపడుచు మరియు తన పరిస్థితులను చూచుచున్నాడు. ప్రభువు అతనితో ఈ విధముగా చెప్పెను. “నీవు నాతట్టు తిరిగిన యెడల మరియు వ్యర్ధమైన మాటలు మాటలాడు అలవాటును(ఇప్పుడు మాట్లాడినట్లుగా - వ్యర్ధమైన, పనికిరాని మరియు అవిశ్వాసపు మాటలు) విడచినయెడల మరియు ఘనమైన మాటలు (మంచితనముతోను మరియు విశ్వాసముతోను నిండిన మాటలు) మాత్రమే మాట్లాడెదనని నీవు చెప్పినయెడల, అప్పుడు నీవు నా నోటివలె ఉందువు".

మీలో ఎంతమంది దేవునికి నోటివలే ఉండవలెనని కోరుచున్నారు? ఏదో ఒక పుస్తకము చదివి, మృతమైన ప్రసంగములు చేసే భోధకుడుగా ఉండుట గురించి నేను మాట్లాడుటలేదు కాని దేవునికి ప్రత్యామ్నాయముగా మాట్లాడుటగురించి మాట్లాడుచున్నాను. నీవు ఆలాగున ఉండగోరిన యెడల, అప్పుడు నీవు ఇటువంటి వారితో సమయమును వృధాచేసుకొనక ఆ సమయమును దేవుని వాక్యమును లోతుగా ధ్యానించుటకు వెచ్చించుము. అదే నీకు సంతోషముగా ఉండనిమ్ము. పనికిరాని సంభాషణ పూర్తిగా విడిచిపెట్టి మరియు ఎల్లప్పుడు విశ్వాసముతో మాట్లాడుచు మరియు నీ సంభాషణ అంతటిలో మంచి మాటలు మాత్రమే మాట్లాడుము. అప్పుడు ప్రభువు నిన్ను తన నోటిగా చేయును. దేవునికి ఎటువంటి పక్షపాతము లేదు.