వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   శిష్యులు
WFTW Body: 

దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడును. ముఖ్యముగా దేవుని వాక్యములో నుండి మనతో ఆయన మాట్లాడును. దేవుని వాక్యములో ఏదైనా ఒక విషయము స్పష్టముగా బయలు పరచినయెడల, ఆ విషయమై దేవుని చిత్తము కనుగొనుటకు ప్రార్ధించవలసిన అవసరములేదు.

పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడును. ప్రతి తలుపుయొక్క తాళపు చెవిని ప్రభువు కలిగియున్నాడు (ప్రకటన 1:18) మరియు ఆయన ద్వారమును తెరువగా దానిని ఎవ్వరు మూయలేరు, ఆయన ద్వారమును మూయగా ఎవ్వరు తెరువలేరు (ప్రకటన 3:18). ఒక ప్రత్యకమైన మార్గములో మనము వెళ్ళవలెనా లేక లేదా అని తెలుసుకొనుటకు మన పరిస్థితులే సూచనగా ఉండును. దేవుడు మూసిన తలుపుదగ్గర మనము తట్టుచూ ఉండనవసరములేదు. కాని ఒక తలుపు మూయబడినప్పుడు ప్రార్ధించాలి. కాని అనేకసార్లు ప్రార్ధించిన తరువాత కూడా తలుపు మూయబడియున్నట్లయితే, బహుశా మనము ఆ ద్వారముగుండా వెళ్లుట దేవుని చిత్తము కాకపోవచ్చును. మనము అలాగే ప్రార్ధనలో కొనసాగవలెనా లేదా అనునది దేవుని అడుగవలెను (లూకా 11:5-9).

పరిణితి పొందిన భక్తిగల సహోదరుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడవచ్చును. అటువంటివారు ఎన్నో అనుభవములద్వారా వెళ్ళియుంటారు మరియు మనకు తెలియని ఆత్మీయ గోతులను గూర్చి హెచ్చరించెదరు. వారికి మనము గ్రుడ్డిగా లోబడము గాని వారి ఆత్మీయ సలహాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.

మనము ఇతర విశ్వాసులతో సహవాసము చేయునప్పుడు దేవుడు మనతో మాట్లాడును. దేవుని వాక్యముయొక్క ప్రత్యక్షత కొరకు కూడా, క్రీస్తు శరీరములోని ఇతరులమీద మనము అధారపడుటను దేవుడు నేర్పిస్తాడు.

మనము ఏదైన శోధన(పరీక్ష)లో గుండా వెళ్ళునప్పుడు లేక మనకు రోగము వచ్చినప్పుడు, ముఖ్యమైన సంగతి దేవుడు మనతో మాట్లాడాలని ఆశించుచున్నాడని గమనించవలెను.

ఇతరుల తప్పిదములనుబట్టి కూడా దేవుడు మనలను హెచ్చరించును. ఉదాహరణకు, ఒక దైవజనుడు పాపములో పడినప్పుడు, మనమందరము బలహీనులము గనుక అతని ఓటమినుండి మనము ఏమినేర్చుకొనగలమనియు మరియు మనము ఏవిధముగా కాపాడబడగలమనియు దేవునికి ప్రార్ధించవలెను.

ఎవరికైనా కీడు జరిగిందనిగాని మరియు ఎవరికైనా అపాయము(యాక్సిడెంట్స్) జరిగిందనిగాని మనము వినినప్పుడు దేవుడు మాట్లాడును.

పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను మరియు సిలోయములోని గోపురము పడి కొందరు చనిపోయిరని ప్రభువైన యేసుతో ఉన్నవారు వినినప్పుడు ఇటువంటివి ఎవరికైనను జరుగును గనుక మారుమనస్సు పొందుడని వారికి ఆయన చెప్పారు (లూకా 13:1-4).

బైబిలును తెరిచి మొదటిగా కనబడిన వచనము చదువుటద్వారా దేవుని స్వరమును వినుటనుగూర్చి నన్ను హెచ్చరించనివ్వండి.

నీవు ఒక అమ్మాయిని పెళ్లిచేసుకొనవలెనని నిర్ణయించుకొని, నిశ్చయతకొరకు బైబిలు తెరచి చదువవచ్చును. అటువంటి వచనము నీవు కనుగొనువరకు ఆ విధముగా బైబిలు చదువుతూనే ఉంటావు. ఆ విధముగా నిన్ను నీవు మోసగించుకొనవచ్చును.

ఈ విధముగా బైబిలు చదివి దేవుని చిత్తమును కనుగొనవలెనని ప్రయత్నించిన ఒక వ్యక్తిని గూర్చి విన్నాను. మొదటిగా “అతడు పోయి ఉరిపెట్టుకొనెను” (మత్తయి 27:5) అని చదివెను. అతడు మరలా బైబిలు తెరచి “నీవును వెళ్లి ఆలాగు చేయుము” (లూకా 10:37) అని చదివెను. మూడవసారి బైబిలు తెరచి, “నీవు చేయుచున్నది త్వరగా చేయుము” (యోహాను 13:27) అని చదివెను. ఈ విధముగా దేవుని చిత్తమును కనుగొనుటనుండి ఇది అతనిని శాశ్వతముగా విడిపించెను.

కొన్నిసార్లు మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు బైబిలు తెరువగానే మన ప్రోత్సాహము నిమిత్తము ఒక వచనము ద్వారా ప్రభువు ప్రోత్సహించవచ్చును. కాబట్టి ఈ పద్ధతి ప్రోత్సాహముకొరకు బాగానే ఉంటుంది గాని నడిపింపుకొరకు కాదు.

సహోదరులారా ఈ విధముగా దేవునియొద్దనుండి వినే అలవాటును వృద్ధి చేసుకొనుడని మిమ్మును ప్రోత్సహించుచున్నాను. మీరు వృద్ధిచేసుకొనగల ఒకే ఒక ముఖ్యమైన అలవాటు ఇది.