"మేము కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము" అని పౌలు 2 కొరంథీ 4:2లో చెప్పుచున్నాడు.
మనలో కుయుక్తిగాని, మోసముగాని ఉన్నట్లయితే, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేము. గతములో తలాంతులు కలిగి, చాలా తెలివైన ఇద్దరు సహోదరులు (వారు ఇప్పుడు మనతోలేరు) మనతో కలసి పనిచేశారు. అయితే వారు చాలా కుయుక్తిపరులు. దీనులై, యథార్ధవంతులుగా ఉన్నట్లయితే తలాంతులు కలిగినవారిని మరియు తెలివైనవారిని కూడా దేవుడు ఆయన పనిలో వాడుకుంటాడు. అయితే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును(1 కొరంథీ 3:20). ఆ సహోదరులకు ఆయన అలాగే చేశాడు. హామానువలె, ఇతరుల కొరకు వారు సిద్ధపరచిన ఉరితీసేమ్రానుపై వారే ఉరి వేయబడియున్నారు. దేవుడు ఎంతో దీర్ఘశాంతముగలవాడై, ఎంతో కనికరము గలవాడు కాబట్టి కుయుక్తిగల సహోదర, సహోదరీలు సంఘములో బహుకాలము ఉండుటకు వారికి అవకాశమిచ్చి, వారు మార్పుచెందుటకు ఎంతో సమయమునిచ్చును. కాని వారు తమ పాపములను ఒప్పుకొని, పవిత్రపరచుకొనని యెడల వారు ఆత్మీయసంఘములో కొనసాగలేరు. "కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువలేరు"(కీర్తనలు 1:5).
క్రీస్తుశరీరమైయున్న జీవముగల సంఘములో నీవు ఉపయోగకరమైన పాత్రగా ఉండవలెనని కోరినచో, అప్పుడు నీవు మొదట కుయుక్తిని, మోసమును, అవమానకరమైన రహస్యకార్యములను మరియు నీకు అనుకూలముగా దేవుని వాక్యాన్ని చెరుపుటను విసర్జించుము.
దేవునివాక్యమును ప్రజలు రెండు రకములుగా చెరుపుదురు.
మొదటిది:- తన సొంత జీవితవిషయములో గాని లేక తన స్నేహితుని విషయములోగాని లేక తనకు పూర్తిగా మద్దతునిచ్చే వారి విషయములోగాని దేవునివాక్యప్రమాణాల విషయములో రాజీపడుట. ప్రభువైనయేసు అయితే తనకెంతో సన్నిహితముగా ఉండే పేతురు, తండ్రిచిత్తమునకు వ్యతిరేకముగా సలహా ఇచ్చినప్పుడు యిట్లు గద్దించారు, "సాతానా, నా వెనుకకు పోమ్ము". మన భార్యల తప్పులను కప్పిపుచ్చుకొనుటకుగాని లేక ఒక ధనవంతుని లేక ఒక స్నేహితుని సంతోషపెట్టుటకుగాని దేవుని వాక్యాన్ని చెరుపకూడదు. దేవుని వాక్యముకంటే ఎక్కువ సన్నిహితమైన స్నేహితులు మనకు ఉండకూడదు ఎందుకనగా అట్టి సహవాసము ఆత్మీయముగా ఉండదు.
రెండవది:- వారి ఉద్దేశ్యాలకుగాని లేక వారికి ఇంతకు మునుపే ఉన్న సిద్ధాంతములకు అనుకూలముగా గాని దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడము. ఒక ఉదాహరణ చూద్దాము - పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట. క్రొత్తనిబంధన మొదటి అయిదు పుస్తకములలో దీనిని గూర్చి చాలా స్పష్టముగాను మరియు వివరముగాను చెప్పబడింది (మత్తయి 3:11; మార్కు 1:8; లూకా 3:16; యోహాను 1:33; అపొ.కా. 1:5). బ్రదరన్ మరియు బాప్టిష్టు సంఘస్థులు రక్షణపొందినప్పుడే సమస్తమును పొందియున్నామని నమ్ముచున్నారు కాబట్టి ఈ రోజు(ఇప్పుడు) కూడా ప్రభువైనయేసు మనకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇస్తారని నమ్ముట వారికి దాదాపు అసాధ్యముగా ఉన్నది. మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనలో నుండి జీవజలనదులు ప్రవహిస్తాయని ప్రభువైనయేసు చెప్పినట్లు వారి జీవితములలో జరుగుటలేదని వారు యథార్ధవంతులైతే ఒప్పుకుంటారు. కాని వారు సత్యమును ఎదుర్కొనుటకు(నమ్ముటకు) సిద్ధముగా లేరు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటను గూర్చిన లేఖనములు వారు చదివినప్పుడు, వారు నమ్మిన సిద్ధాంతమునకు అనుకూలముగా చేస్తారు. నమ్మలేనందున దేవునివాక్యాన్ని కలుషితము చేయుచున్నారు.
ఇటువంటి కష్టతరమైన వచనములు చదినప్పుడు, యథార్ధవంతులైన విశ్వాసులు, వారు నమ్మిన సిద్ధాంతముతో వాక్యము ఏకీభవించనప్పుడు, ఆ వచనముల విషయములో దేవునివెలుగు తమకు అవసరమని గుర్తిస్తారు. అటువంటి వారికి ఎంతో నిరీక్షణ ఉన్నది.
యథార్ధత(నిజాయితీ) మరియు దీనత్వము కవలల వంటివి. ఒక వ్యక్తిలో ఇవి రెండును కలిసి వెళ్ళును. ఇవి ఒక నాణెమునకు ఉన్న రెండు ప్రక్కల వంటివి. ఒక దాన్ని కలిగియుండి రెండవ దానిని కలిగియుండకుండుట అసాధ్యము. నీవు నిజముగా దీనుడవైతే, యథార్ధముగా కూడా ఉంటావు. నీలో ఉన్న కుయుక్తిని ఒప్పుకొనుటయే నిన్ను నీవు తగ్గించుకొనుట. నీలో ఉన్న కుట్రని విసర్జించినప్పుడు నిజానికి, నీ గర్వాన్ని కూడా విసర్జిస్తున్నావు.